బుధవారం 25 నవంబర్ 2020
Warangal-rural - Nov 12, 2020 , 02:46:03

వేదికలు.. రైతు నేస్తాలు

వేదికలు.. రైతు నేస్తాలు

  •  ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో   రూ.73.60 కోట్లతో   334 రైతు వేదికలు
  •  నేడు తీగరాజుపల్లి, గవిచర్ల   వేదికలు  ప్రారంభించనున్న  మంత్రి ఎర్రబెల్లి

వరంగల్‌రూరల్‌-నమస్తేతెలంగాణ : రైతులను సంఘటితం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణం చేపట్టింది. ఐక్యతతో పంటలు సాగు చేసుకునేందుకు, మార్కెట్‌లో పంట ఉత్పత్తులకు ఆశించిన ధర పొందడానికి, తమ డిమాండ్లు నెరవేర్చుకునేందుకు, అనేక మెళకువలు తెలుసుకునేందుకు ఈ వేదికలు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతాయని ప్రభుత్వం ఆశిస్తున్నది. ఈనేపథ్యంలో వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో 250 రైతు వేదికల నిర్మాణం పూర్తి చేసింది. మరో 84 రైతు వేదికల నిర్మాణ పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో 334 క్లస్టర్లు ఉన్నాయి. ఒక్కో రైతు వేదికకు రూ.22 లక్షల లెక్కన 334 వేదికల నిర్మాణానికి ప్రభుత్వం ఇటీవల రూ.73.60 కోట్లు మంజూరు చేసింది. వరంగల్‌రూరల్‌ జిల్లాలో 74, అర్బన్‌ జిల్లాలో 40, జనగామలో 62, మహబూబాబాద్‌లో 82, జయశంకర్‌ భూపాలపల్లిలో 45, ములుగులో 31 రైతు వేదికల నిర్మాణం చేపట్టింది. వీటి నిర్మాణ పనులను పంచాయతీరాజ్‌ ఇంజినీరిం గ్‌ విభాగం పర్యవేక్షిస్తున్నది. వేదికల నిర్మాణంలో జనగామ జిల్లా ముందంజలో ఉంది. ఇక్కడ చేపట్టిన 62 రైతు వేదికల నిర్మాణం పూర్తి కావడం విశేషం. ఈ నేపథ్యంలో జనగామ జిల్లా కొడకండ్లలో నిర్మాణం పూర్తయిన రైతు వేదికను సీఎం కేసీఆర్‌ గత అక్టోబర్‌ 31న ప్రారంభించారు. రాష్ట్రంలో ఆయన ప్రారంభించిన మొదటి రైతు వేదిక ఇదే. కాగా, వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండలం గవిచర్ల, తీగరాజుపల్లి గ్రామంలో నిర్మాణం పూర్తయిన రైతు వేదికలను గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే చల్లా గవిచర్ల, తీగరాజుపల్లి, పరకాల రైతు వేదికలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.