గురువారం 26 నవంబర్ 2020
Warangal-rural - Nov 11, 2020 , 02:38:36

సేవలు సులభం.. రైతుల సంబురం

సేవలు సులభం.. రైతుల సంబురం

ధరణితో మండలాల్లోనే రిజిస్ట్రేషన్లు

ముందురోజు స్లాట్‌ బుకింగ్‌.. మరుసటి రోజు తహసీల్‌కు..

కోరుకున్న రోజున సమయానికి పూర్తవుతున్న ప్రక్రియ

పోర్టల్‌ రాకతో దయాదాక్షిణ్యాలకు చెల్లు

తప్పిన వ్యయప్రయాసలు

ఆఫీసుల చుట్టూ తిరుగుడుకు ఫుల్‌స్టాప్‌

వరంగల్‌ రూరల్‌, నమస్తే తెలంగాణ : ధరణి సేవలు అందుబాటులోకి రావడంతో రైతులు, ప్రజలు సంబురపడుతున్నారు. ముందుగా స్లాట్‌ బుక్‌ చేసుకుని స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో ఒకేరోజు రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, అప్‌డేషన్‌ పూర్తవుతుండడంతో మురిసిపోతున్నారు. రూపాయి ఖర్చు లేకుండా 1బీ పహాణీ చేతికొస్తుండడంతో వారి ఆనందానికి అవుధుల్లేకుండా పోయాయి.

నాడు ముడుపులిస్తేనే..

ఇదివరకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో చేసేవారు. కనీసం రెండు మూడురోజులు తిరగాల్సి రావడంతో చాలా ఇబ్బందులు పడేవారు. మొదట డాక్యుమెంటరీ రైటర్‌ను కలిసి వివరాలన్నీ చెప్పి భూమి విలువ తెలుసుకోవడం, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు కోసం మళ్లీ ఒకరోజు వెళ్లి అతడికి డబ్బులు ఇచ్చేవారు. అతను చలానా, డాక్యుమెంట్‌ రెడీ చేసి సబ్‌ రిజిస్ట్రార్‌ నుంచి సమయం తీసుకున్న తర్వాత గానీ పని అయ్యేదికాదు. ఒకవేళ మంచిరోజై రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఉంటే ఆ రోజంతా అక్కడే గడిచేది. ఇలా పలుమార్లు తిరగాల్సి వచ్చేది. కొన్ని సందర్భాల్లో డాక్యుమెంట్‌ రైటర్‌కు లేదా సబ్‌ రిజిస్ట్రార్‌కు వీలు కాకపోయినా రిజిస్ట్రేషన్‌ లేటయ్యేది. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం భూమి విలువపై స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజుతో పాటు అదనంగా డాక్యుమెంట్‌ రైటర్లకు డబ్బు ముట్టజెప్పేవారు. సబ్‌ రిజిస్ట్రార్‌, సిబ్బంది ఫిక్స్‌ చేసిన ముడుపులను రైటర్లు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తికాగానే జనం నుంచి వసూలు చేయడం వల్ల చాలా అవస్థలు పడ్డారు.

ఇప్పుడు కోరుకున్న రోజే రిజిస్ట్రేషన్‌..

సబ్‌ రిజిస్ట్రార్‌, డాక్యుమెంటరీ రైటర్‌ సమయం

 ఇచ్చిన రోజు అదికూడా వారు దయతలిస్తేనే గతంలో రిజిస్ట్రేషన్లు చేసేవారు. ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్‌తో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు భూమి కొనుగోలు చేసిన వ్యక్తులు మీ-సేవ కేంద్రానికి వెళ్లి తమకు అనుకూలమైన రోజున స్లాట్‌ బుక్‌ చేసుకుంటున్నారు. తహసీల్దార్‌ కేటాయించిన సమయం ప్రకారం అమ్మిన వ్యక్తులు, సాక్షులతో వెళ్లి నిమిషాల్లో పనులు చేయించుకుంటున్నారు.  ఒకేరోజు రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, అప్‌డేషన్‌ కావడం, వెంటనే పాస్‌బుక్‌, వన్‌బీ పహాణీ చేతికి అందుతుండడంతో ఆశ్చర్యపోతున్నారు. గత అనుభవాలను నెమరువేసుకుని ఇలాంటి సౌలత్‌ వస్తుందని కలలో కూడా ఊహించలేదని సంతోషం వెలిబుచ్చుతున్నారు.

బిడ్డ పేర అరెకురం పట్టా చేసిన తల్లి లచ్చమ్మ

పెనిమిటి మాట నిలబెట్టిన

దేవరుప్పుల : మాది దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి. బిడ్డ పద్మను రాయపర్తి మండలం ఆరెగూడెం ఇచ్చినం. ఆమె పెండ్లప్పుడు అరెకురం ఇస్తమని ఒప్పుకున్నం. నా పెనిమిటి చనిపోయేటప్పుడు.. బిడ్డకు భూమి ఇస్తమని మాట ఇచ్చిన తప్పునపడొద్దు.. పట్టా చే యమని నా నలుగురు కొడుకులకు, నాకు చెప్పిండు. ఇచ్చిన మాట ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేసి పట్టా కాయిదాలు చేతులపెట్టినం. కేసీఆర్‌ ధరణి పెట్టంగనే నలుగురు కొడుకులు ఇప్పుడు పని అల్కగైతది అక్కను పిలిచి నాయిన మాట ప్రకారం పట్టా చే యించు అన్నరు. మంగళవారం తైసిల్‌ ఆ ఫీసుకు పోయి పట్టా చేసుడుతోటి మా మాట నిలబడ్డది.. బిడ్డ సంబురపడ్డది. నా కేమో శాతగాదాయె.. ఆఫీసుల చుట్టు తిరుగుడు ఎట్లయితదో అని రంది పడ్డ. పని అల్కగ ఒడిశింది.

ప్రాసెస్‌ సింపుల్‌గా అయిపోయింది..

శాయంపేట : మాది ప్రగతిసింగారం. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా జాబ్‌చేస్తున్నా. నేను కాట్రపల్లి దగ్గర పది గుంటల భూమి కొన్నా. రిజిస్ట్రేషన్‌ ఎలా చేయించాలోనని చాలా టెన్షన్‌ పడ్డా. కానీ ధరణిలో ఇంత సింపుల్‌గా అవుతుందని అనుకోలేదు. నిజానికి గత శనివారం స్లాట్‌ బుక్‌ చేశాను. టెక్నికల్‌ ప్రాబ్లం వల్ల రీ షెడ్యూల్‌ చేయాల్సి వచ్చింది. ఆఫీసర్లు చాలా ఫాస్ట్‌గా రెస్పాండ్‌ అయి సెట్‌ చేశారు. మళ్లీ మంగళవారం వెళ్లిన వెంటనే పట్టా చేతికి ఇచ్చారు. చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఇంతకుముందు రిజిస్ట్రేషన్‌ అంటేనే పెద్ద ప్రాసెస్‌. రోజుల తరబడి ఆఫీస్‌ చుట్టూ తిరగడం, బ్రోకర్లను కలవడం.. అమ్మో! ఇప్పుడు అదంతా ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. ఆ రోజు సరిగ్గా చేస్తే అరగంటలో అయిపోయేది. ధరణితో ఇంత ఈజీగా పట్టాలిస్తున్న గవర్నమెంట్‌కు మెనీ థ్యాంక్స్‌.

- మాచర్ల శివకుమార్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, ప్రగతిసింగారం

అల్కగ పనైంది..

భూపాలపల్లి : మా నాయన నంగావత్‌ మంగ్యా పేరు మీద ఎకరం 22గుంటల భూమి ఉంది. ఇంకా కొంత భూమి మా నాయన కొన్నడు. కానీ అమ్మిన వారి పేరు మీదనే ఉంది. నాలుగేండ్ల కింద మా నాయన వోయినంక ఆ భూమి మొత్తం మా అన్న రాజు పేరు మీదికి వచ్చింది. ఈ భూమిల మా అవ్వ సమ్మక్క, నాకు కూడా భాగం ఇయ్యాలని ఎప్పటినుంచో తిరుగుతాంది కానీ కాలె. ఇప్పుడు కేసీఆర్‌ సార్‌ ధరణి తెచ్చినంక పని అల్కగైంది. మా అన్న పేరు మీద ఉన్న భూమిలో నుంచి 22గుంటలు నా పేరు మీద పట్టా అయింది. ఇదిగాక ఇంకో 18గుంటల మా అవ్వ పేరు మీద చేశిన్రు. మా నాయన సాదాబైనామా మీద కొన్న భూమి కోసం దరఖాస్తు ఇచ్చినం.

- నంగావత్‌ ప్రశాంత్‌, పెద్దకుంటపల్లి


కాటారం : భూమి రిజిస్ట్రేషన్‌ కేవ లం 30 నిమిషాల్లో పూర్తయింది. పోతుల్వాయిలో మా నాన్న కిష్టస్వామి పేరున ఎకరం 20గుంటల భూమి ఉంది. నేరుగా స్లాట్‌ బుక్‌ చేసుకొని రెవెన్యూ కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న. ఇంతకుముందు ములుగు సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో గంటల తరబడి ఇబ్బందులు పడేవాళ్లం. డాక్యుమెంట్ల కోసం మరికొన్ని రోజుల పాటు పడిగాపులు కాయాల్సి వచ్చేది. అక్కడినుంచి పాస్‌ పుస్తకం కోసం రెవెన్యూ ఆఫీస్‌లో దరఖాస్తు చేసుకొని ఎదురుచూడాల్సి వచ్చేది. ఇప్పుడు ఇబ్బంది లేకుండా పైసా ఖర్చు లేకుండా పనైపోయింది. 

- కుడుదుల సరిత, పోతుల్వాయి, కాటారం 

సేవలు బాగున్నయ్‌..

కేసముద్రం : వీఆర్‌వో వ్యవ స్థ రద్దు చేసి ధరణి పోర్టల్‌ను తీసుకరావడం నిజంగా గొప్ప విషయం. నాకు ఐదెకరాల భూ మి ఉంది. కొన్ని కారణాల వల్ల రెండెకరాలు అమ్ముకున్న. సో మవారం స్లాట్‌ బుక్‌ చేస్తే మం గళవారం పొద్దున రమ్మని చెప్పి న్రు. తాసిల్దార్‌ ఆఫీస్‌కు వచ్చిన అరగంటలోపటనే పని అయిపోయింది. మ్యుటేషన్‌ చేసి నాకు మూడెకరాలున్న ట్లు పట్టా పుస్తకం చేతిల పెట్టిన్రు. ఇంత తొందరగా అదికూడా రూపాయి ఖర్చు లేకుండా చేయడం బాగుంది.                     - వెంకటేశ్‌, కోమటిపల్లి

అప్పుడు తిరగలేక పట్టా చేయించలె..

కేసముద్రం : నేను పదేండ్ల కింద రెండెకరాల భూమి కొన్నా. నా పేరు మీదికి పట్టా చేయాలని మా ఊరి పెద్దమనుషుల చుట్టూ, ఆఫీస్‌ల చుట్టూ పొలం పనులు ఇడిశిపెట్టి నెలలకొద్దీ తిరిగిన. అయినా పాస్‌ పుస్తకం రాలే. పైసలిచ్చినా పని కాక ఆర్థికంగా ఇబ్బందిపడి చివరకు పట్టా పుస్తకం లేకున్నా మంచిదేనని ఊకున్న. సీఎం కేసీఆర్‌ భూ ప్రక్షాళన చేసినప్పుడు ఆ రెండు ఎకరాలకు కొత్త పట్టా పాస్‌పుస్తకం వచ్చింది. కొన్ని రోజుల కింద రెండెకరాలు కొన్నా. మళ్లీ ఎన్ని రోజులు తిరుగాల్నో అనుకున్నా. ధరణి వచ్చినంక బాధ లేకుంటయింది. మొన్న ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి మంగళవారం తహసీల్‌ ఆఫీస్‌కు పోయిన అరగంటల్నే పట్టా ఇచ్చిన్రు. మ్యుటేషన్‌ కూడా అయిపోయింది.

- ఇస్లావత్‌ బాబురావు, కోమటిపల్లి

తొందరగా పనైంది..

భూపాలపల్లి : నా భర్త శివనాత్రి సాంబమూర్తి 2019 ఆగస్టులో చనిపోయిండు. మా ఆయన పేరు మీద రెండెకరాలకు పైననే ఉంది. ఇందులో ఎకరం 2గుంటల భూమి మాత్రమే నా భర్త పేరు మీద ధరణిలో వచ్చింది. మిగతా భూమి రాలేదు. ఆ భూమిని నాపేరు మీదికి చేయాలని సంవత్సరంల రెండుసార్లు దరఖాస్తు చేసిన. ఎంత తిరిగినా పనికాలే. కేసీఆర్‌ సార్‌ తీసుకువచ్చిన ధరణితో తొందరగా పని అయిం ది. నా పేరు మీద పట్టా అయింది. ధరణిల ఎక్కని మిగతా భూమి కూడా తహసీల్దార్‌ సార్‌ చేస్తానని చెప్పిండు. ఇలా పనులు తొందరగా కావడం సంతోషంగా ఉంది.        - శివనాత్రి స్వరూప, గొర్లవీడు

ఇరవై నిమిషాల్లో పూర్తి

కేసముద్రం : మా తాత పేరు మీద ఉన్న భూమిని వారసత్వంగా నా పేరు మీదికి మార్చడానికి కేవలం 20 నిమిషాలు పట్టింది. ఈ భూమిని నా పేరు మీదికి చేయాలని ఇదివరకు ఆఫీస్‌ల చుట్టూ తిరిగితిరిగి పనిగాక ఊకున్న. ఇప్పుడు ధరణి వచ్చినంక లంచాలు లేకుండా పనులైతున్నయ్‌. పోర్టల్‌ ద్వారా వెంటనే రిజిస్ట్రేషన్లు అయితున్నయని తెలిసి స్లాట్‌ బుక్‌ చేసిన. తైసిల్‌ ఆఫీస్‌ల వచ్చిన 20నిమిషాల్లోనే పట్టా చేతికచ్చింది. ధరణి పోర్టల్‌ తీసుకవచ్చిన సీఎం కేసీఆర్‌ ప్రభుత్వానికి కృతజ్ఞతలు.                 

                                        - సురేశ్‌, ఇనుగుర్తి

ఆశ్చర్యం అనిపించింది

కేసముద్రం : ధరణి పోర్టల్‌ ద్వారా నిమిషాలల్లో పట్టా అవుతుందని విన్నాను కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోయిన. మా గ్రామానికి చెందిన వ్యక్తి భూమి కొనుగోలు చేసినట్లు సాక్షి సంతకం కోసం తహసీల్దార్‌ ఆఫీస్‌కు వచ్చాను. వచ్చిన 20 నిమిషాలల్లో రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యింది. నిమిషాలల్లో మ్యుటేషన్‌ పూర్తి చేసి డాక్యుమెంట్‌ ఇవ్వడం సీఎం కేసీఆర్‌ పనితీరుకు నిదర్శనం. ఇకనుంచి రైతులు, ప్రజలు కార్యాలయాల చుట్టూ, పైరవీకారుల చుట్టూ తిరుగాల్సిన పని లేకుండా పోయింది.

- దేవేందర్‌, ఉప సర్పంచ్‌, ఇనుగుర్తి

అటూఇటు తిరుగుడు తప్పింది..

ఏటూరునాగారం : మాది శంకరాజుపల్లి. నేను ఐదు నెలల కింద ముల్లకట్ట దగ్గర 19గుంట ల వ్యవసాయ భూమి ని కొన్న. అప్పుడు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలంటే ములుగుకు పోవాల్సి వచ్చేది. కొన్నంక కొద్ది రోజులకు తహసీల్దార్‌ ఆఫీస్‌లనే భూముల రిజిస్ట్రేషన్‌ చేస్తారని ప్రభుత్వం చెప్పింది. అంతదూరం పోవుడు ఎందుకని ఆగి ఇక్కడే రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నా. అటూఇటు తిరగకుండా ఇక్కడ్నే పనైపోయింది. కేసీఆర్‌ తెచ్చిన ధరణి వల్ల రైతులకు పని తొందరగ అయితాంది.               - రాజేశ్‌, శంకరాజుపల్లి