మంగళవారం 24 నవంబర్ 2020
Warangal-rural - Nov 10, 2020 , 01:42:08

గుడుంబాపై ఉక్కుపాదం..!

గుడుంబాపై ఉక్కుపాదం..!

  • మళ్లీ తెరపైకి పీడీ యాక్టు
  • సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో రంగంలోకి ఎక్సైజ్‌, పోలీస్‌శాఖలు
  • ఉమ్మడి జిల్లాలో బెల్లం రవాణాదారుల గుర్తింపు
  • ఇప్పటికే ఐదుగురిపై ప్రయోగం
  • బెల్లం, గుడుంబా వ్యాపారుల్లో వణుకు..

గుడుంబా తయారీదారులు, వ్యాపారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎక్సైజ్‌ శాఖ గుడుంబాను నియంత్రించేందుకు మరోసారి పీడీ యాక్టును తెరపైకి తెచ్చింది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఐదుగురిపై కేసులు నమోదు చేయగా మరికొందరిపైనా పీడీ యాక్టు ప్రయోగించనుంది. దీంతో ఈ దందా చేసే వ్యాపారుల్లో వణుకు మొదలు కాగా కొందరు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తున్నది.  

- వరంగల్‌ రూరల్‌, నమస్తే తెలంగాణ

సమాజాన్ని పట్టి పీడిస్తున్న గుడుంబా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం ఆది నుంచి కృతనిశ్చయంతో ఉన్నది. గుడుంబా తయారీకి ఉపయోగించే బెల్లం, స్ఫటిక సరఫరా చేసే వ్యాపారులు, గుడుంబా తయారీదారులు, రవాణాదారులపై పీడీ యాక్టు ప్రయోగించాలని పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా కొద్ది నెలల నుంచి గుడుంబా మళ్లీ గుప్పుమంటున్నది. పల్లెలు, పట్టణాలు, వరంగల్‌ నగరంలో అంతటా గుడుంబా తయారీ, రవాణా, అమ్మకాలు జరుగుతున్నాయి. గుడుంబా తయారీదారులకు బెల్లం సరఫరా చేసేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. లారీలు, వ్యాన్లు, ఆటోలను వాడితే పట్టుకుంటున్నారని ఇటీవల బెల్లం రవాణాకు వ్యాపారులు కార్లను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. గ్రామాల్లో తయారైన గుడుంబాను పట్టణాలు, వరంగల్‌ నగరానికి రవాణా చేయడంలోనూ అనేకమంది వ్యాపారులు పోటీపడుతున్నారు. కొవిడ్‌ కారణంగా గ్రామాలు, పట్టణాలు, వరంగల్‌ నగరంలో గుడుంబా తయారీ కేంద్రాలపై అధికారుల దాడులకు బ్రేక్‌ పడడంతో ఇదే అదనుగా బెల్లం, గుడుంబా వ్యాపారులు పెట్రేగిపోతున్నారు. తనిఖీల్లో పోలీసు, ఎక్సైజ్‌శాఖ అధికారులు బెల్లం, గుడుంబా రవాణా చేస్తున్న వాహనాలను పట్టుకుని వ్యాపారులపై కేసులు నమోదు చేసినా గుడుంబా తయారీ, అమ్మకాలు ఆగడం లేదు.  

సీఎం ఆదేశాలతో రంగంలోకి..

కరోనాతో మళ్లీ విజృంభిస్తున్న గుడుంబా మహమ్మారిపై ఉక్కుపాదం మోపాలని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించడంతో ఎక్సైజ్‌, పోలీస్‌ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. గుడుంబా తయారీ, రవాణా, అమ్మకాల కట్టడికి పీడీ అస్త్రం ప్రయోగించేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలో వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో కొద్ది నెలల నుంచి బెల్లం సరఫరా, గుడుంబా రవాణా చేస్తున్న వ్యాపారులను ఎక్సైజ్‌ అధికారులు గుర్తించారు. ఎక్కువ సార్లు తనిఖీల్లో దొరికిన, కేసులు నమోదైన వ్యాపారుల వివరాలు సేకరించారు. పక్కా ఆధారాలతో వారిపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలో పీడీ యాక్టు కింద ఐదుగురు వ్యాపారులను జైలు బాట పట్టించారు.

వరంగల్‌ రూరల్‌ జిల్లా నుంచి నెక్కొండ మండలం చర్లతండాకు చెందిన జర్పుల హతిరాం, గీసుగొండ మం డలం నందనాయక్‌తండాకు చెందిన భూక్య రామును ఎక్సైజ్‌ అధికారులు పీడీ యాక్టు కింద వేర్వేరుగా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

 మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం గుండెపుడిలో బానోత్‌ వెంకన్నను పీడీ యాక్టు కింద అరెస్ట్‌ చేశారు. అంతకుముందే ఇదే జిల్లాలో తొర్రూరు, మహబూబాబాద్‌ పరిధిలో మరో ఇద్దరిని జైలుకు పంపారు.  

జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాలోనూ గుడుంబా, బెల్లం దందా చేస్తున్న కొందరు వ్యాపారులపై పీడీ యాక్టు నమోదుకు ఎక్సైజ్‌శాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. తాజాగా ఎక్సైజ్‌శాఖ అధికారులు పీడీ యాక్టు ప్రయోగిస్తుండడంతో బెల్లం, గుడుంబా వ్యాపారుల్లో గుబులు మొదలైంది.