ఆదివారం 29 నవంబర్ 2020
Warangal-rural - Nov 09, 2020 , 04:32:05

పులి జాడ కోసం అన్వేషణ

పులి జాడ కోసం అన్వేషణ

  • పాకాల, కొత్తగూడ అడవుల్లో సంచారం..
  • పాదముద్రల ఆధారంగా నిర్ధారణ 
  • తాజాగా ములుగు మండలం దేవునిగుట్టలోనూ గాండ్రింపులు

నర్సంపేట : కొద్దిరోజులుగా పాకాల, కొత్తగూడ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పులి కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. నిపుణులు, పరిశోధకులను కూడా ఆయా ప్రాంతానికి తీసుకెళ్లి పులి పాదాల ముద్రలను పరిశీలించారు. ఆదివారం అటవీ అధికారులు అలహాబాద్‌ యూనివర్సిటీ రీసెర్చ్‌ స్కాలర్‌ రాజేశ్‌తో కలిసి బండమీది మామిడితండా బీట్‌ పరిధిలోని అడవుల్లో కలియతిరిగారు. శనివారం సేకరించిన పులిముద్రల ఆధారంగా పులి కొత్తగూడ, పాకాల గూడూరు అడవి ప్రాంతంలో తిరుగుతున్నదని నిర్ధారణకు వచ్చారు. కొన్ని నెలల కిందట కొత్తగూడ మండలం రాంపూర్‌ గ్రామంలో ఎద్దుతో పాటు కొన్ని పశువులను చంపినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆ పులే పాకాల అడవుల్లో తిరుగుతున్నదని పాకాల అడవుల్లో తావు కోసం వెతుకుతున్నట్లు స్పష్టం చేశారు. కొత్తగూడ, పాకాల అడవుల్లో సంచరించే పులి ఒకటేనని చెబుతున్నారు. పులి మనుగడ సాగించేందుకు పాకాల అడవి అనుకూలంగా ఉంది. ఇక్కడ దాని ఆహారానికి కావాల్సిన జంతువులు పుష్కలంగా ఉండడం వల్లే ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది.

దేవునిగుట్ట సమీపంలో గాండ్రింపులు..

ములుగు రూరల్‌ : ములుగు మండల పరిధిలోని దుబ్బగూడెం-కొత్తూరు దేవునిగుట్ట సమీపంలో ఆదివారం పెద్దపులి గాండ్రింపులు వినిపించినట్లు కొందరు వ్యవసాయ కూలీలు చెప్పారు. చేనులో పనిచేసుకుంటున్న సమయంలో పెద్దగా శబ్దం రావడంతో ఒక్క ఉదుటున పరుగులు తీశారు. వివరాలిలా ఉన్నాయి.. సర్వాపురం గ్రామానికి చెందిన నాగిరెడ్డి దేవునిగుట్ట సమీపంలో ఉన్న తన పత్తిచేనులో 20మంది కూలీలతో పనులు చేయిస్తున్నాడు. వారిలో ఓ మహిళ బయటకు వెళ్లి తిరిగి పత్తి చేనులోకి వస్తుండగా ఆమెకు సమీపంలోనే పులి బిగ్గరగా గ్రాండించింది. అది పెద్దపులి అరుపేనని నిర్ధారించుకొని కూలీలు గ్రామంలోకి పరుగులు తీశారు. ఈ విషయమై ఎఫ్‌ఆర్వో రామ్మోహన్‌రావును వివరణ కోరగా పులి గాండ్రింపు, సంచారం విషయం తమకు సమాచారం అందిందని, సోమవారం సిబ్బందితో వెళ్లి పరిశీలిస్తామని తెలిపారు.

పాకాల నుంచి వచ్చిందా..?

పాకాల అడవుల్లో పులి సంచరిస్తున్నట్లు శనివారం అధికారులు నిర్ధారించిన నేపథ్యంలో అదే పులి అటవీ మార్గంలో దేవునిగుట్ట వైపు వచ్చినట్లు తెలుస్తోంది. కొత్తూరు నుంచి కొత్తగూడ మండలం ఓటాయి, సాదిరెడ్డిపల్లికి వేసవి కాలంలో అటవీ మార్గం ద్వారా ద్విచక్రవాహనాలు, ఎడ్లబండ్లు గతంలో వెళ్లేవి. కొత్తూరు నుంచి ఓటాయి, సాదిరెడ్డిపల్లికి సుమారు 15 నుంచి 20 కిలోమీటర్ల అటవీ మార్గం ఉన్నట్లు తెలుస్తోంది.