శుక్రవారం 27 నవంబర్ 2020
Warangal-rural - Nov 08, 2020 , 02:09:04

సాదాబైనామా సంబురం

సాదాబైనామా సంబురం

కొడకండ్ల వేదికగా విలీన గ్రామాలకు సీఎం కేసీఆర్‌ వరం

10వరకు భూముల క్రమబద్ధీకరణకు అవకాశం

ఐదెకరాల దాకా ‘స్టాంప్‌ డ్యూటీ’ అవసరం లేదు

రైతుల్లో హర్షం.. ఉత్సాహంగా మీ సేవ కేంద్రాలకు పరుగు 

పోటాపోటీగా దరఖాస్తులు 

వరంగల్‌రూరల్‌, నమస్తే తెలంగాణ : గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీడబ్ల్యూఎంసీ) పరిధిలోని విలీ న గ్రామాల ప్రజలకు సీఎం కేసీఆర్‌ కొండకండ్ల వేదికగా వరమిచ్చారు. సాదాబైనామాతో ఐదెకరాల వరకు స్టాంప్‌ డ్యూటీ అవసరం లేకుండా తమ భూములను క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పించారు.  

గ్రామీణ ప్రాంత ప్రజలు సాదాబైనామాతో తమ భూములను క్రమబద్ధీకరించుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలోని విలీన గ్రామాల ప్రజలకూ సాదాబైనామాతో భూములను క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు విలీన గ్రామాల ప్రతిపాదనను గత నెలలో జనగామ జిల్లా కొడకండ్లకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. దీంతో అదేరోజు సాదాబైనామా కలిగిన విలీన గ్రామాల ప్రజలు తమ భూముల రెగ్యులరైజ్‌ కోసం నవంబరు 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు విడదలచేశారు. దీంతో విలీన గ్రామా ల ప్రజలు ఆనందంలో మునిగిపోయారు. తమ చిరకాల కోరిక నెరవేర్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. తుది గడువు సమీపించడంతో పెద్దసంఖ్యలో దరఖాస్తులు వస్తున్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. 

తొలిసారి అవకాశం

సాదాబైనామాతో భూములను రెగ్యులర్‌ చేసుకునే అవకాశం విలీన గ్రామాల ప్రజలకు తొలిసారి లభించింది. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వం గతంలో రెండుసార్లు గ్రామీణ ప్రాంత ప్రజలకు సాదాబైనామాతో భూములను రెగ్యులరైజ్‌ చేసుకునే అవకాశం కల్పించింది. చివరగా 2018లో భూరికార్డుల ప్రక్షాళన సమయంలోనూ గ్రామీణ ప్రాంత ప్రజలు తమ భూములను సాదాబైనామాతో రెగ్యులరైజ్‌ చేసుకున్నారు. అప్పట్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని విలీన గ్రామాల ప్రజలకు అవకాశం రాలేదు. ఇటీవల మరోసారి అవకాశం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో విలీన గ్రామాల ప్రజలు తమకూ ఆ ఉత్తర్వులను వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చివరకు వారి కోరిక నెరవేరింది. 2014 జూన్‌ 2లోపు తమ వద్ద సాదాబైనామాలతో మీ సేవ కేంద్రాలకు చేరుకుని తమ భూముల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. 

ప్రయోజనం ఎవరికి

ముఖ్యంగా సాదాబైనామాతో భూముల రెగ్యులరైజ్‌ వల్ల జీడబ్ల్యూఎంసీ పరిధిలోని వరంగల్‌రూరల్‌, వరంగల్‌అర్బన్‌ జిల్లాలకు చెందిన గీసుగొండ, ఖిలావరంగల్‌, హన్మకొండ, కాజీపేట, హసన్‌పర్తి తదితర మండలాల్లోని విలీన గ్రామాల ప్రజలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరనుంది. ఎందుకంటే వరంగల్‌ నగర శివారులో ఉన్న ఈ గ్రామాల్లోని భూములు విలువైనవి. కొన్ని గ్రామాల్లో మార్కెట్‌ రేటును పక్కనపెడితే ప్రభుత్వం నిర్ణయించిన ధర ఒక్కో ఎకరానికి రూ.50 లక్షల వరకు ఉంది. సాదాబైనామాతో 5 ఎకరాలు ఉన్న వారి భూములను స్టాంప్‌ డ్యూటీ చెల్లించాల్సిన అవసరం లేకుండా అధికారులు క్రమబద్ధీకరిస్తారు. రెగ్యులరైజ్‌తో వారికి భూములపై హక్కులు కల్పించడమే కాకుండా ధరణిలో పొందుపరుస్తారు. ఈ నేపథ్యంలో మునుపెన్నడూ లేని అవకాశం దక్కడంతో విలీన గ్రామాల్లోని ప్రజలు సంతోషం వెలిబుచ్చుతున్నారు. పోటాపోటీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. 

తప్పులకు  కేంద్రాల నిర్వాహకులే బాధ్యులు

సాదాబైనామా దరఖాస్తు చేసే సమయంలో మీసేవ కేంద్రాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ నియమాలను కచ్చితంగా పాటించాలి. ఒక్కో దరఖాస్తుదారు వద్ద రూ.45 కంటే ఎక్కువ రుసుం వసూలు చేసిన మీసేవ కేంద్రాలను శాశ్వతంగా తొలగిస్తాం. తప్పులు దొర్లితే సంబంధిత కేంద్రాల నిర్వాహకులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రతి సర్వీస్‌కు సిస్టం జనరేట్‌ చేసి ప్రింట్‌ రిసిప్ట్‌ దరఖాస్తుదారులకు ఇవ్వాలి. ప్రతి మీసేవ కేంద్రం వద్ద సిటిజన్‌ రేటు చార్ట్‌, సాదాబైనామా రుసుం ప్రజలందరికీ కనపడేలా ఏర్పాటు చేయాలి.    

-ఆర్‌ మహేందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌

రైతులు సంబురపడుతున్నారు

విలీన గ్రామాల రైతులు కూడా సాదాబైనామాతో తమ భూములను రెగ్యులరైజ్‌ చేసుకునేందుకు సీఎం కేసీఆర్‌ ఆవకాశం కల్పించడంతో రైతులు సంబురపడుతున్నారు. గతంలో కొన్న భూములు రైతుల పేర్లపై నమోదు కాకపోవటంతో నిత్యం తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరిగే వారు. ఇప్పుడు సాదాబైనామాతో భూములను రెగ్యులరైజ్‌ చేసుకునే అవకాశం కల్పించడంతో ఆ పరిస్థితి ఉండదు. మీసేవ కేంద్రాల్లో ప్రతిరోజు వందల మంది రైతులు దరఖాస్తు చేసుకుంటున్నారు.  -బొల్లం రాజయ్య, రైతు

బంధు సమితి గ్రామ కోఆర్డినేటర్‌ ధర్మారం, గీసుగొండ