శనివారం 23 జనవరి 2021
Warangal-rural - Nov 04, 2020 , 01:24:45

వేగంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు

వేగంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు

  • పలు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు
  • 6లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచన

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియ జిల్లావ్యాప్తంగా వేగంగా జరుగుతున్నది. మంగళవారం పరకాల మండలంలోని మల్లక్కపేట, వెల్లంపల్లి, లక్ష్మీపురం, పైడిపల్లిలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఆముదాలపల్లి అశోక్‌గౌడ్‌ దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేసేందుకు ఆయా గ్రామాల ఇన్‌చార్జిలకు అప్పగించారు. అలాగే, గ్రామాల్లో సేకరించిన పట్టభద్రుల దరఖాస్తు ఫారాలను వెల్లంపల్లి ఇన్‌చార్జి రాంగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అశోక్‌కు అందించారు. టీఆర్‌ఎస్‌ యూత్‌ ఆత్మకూరు మండలాధ్యక్షుడు వేముల నవీన్‌ మండలంలోని నీరుకుళ్ల, పెంచికలపేట, కామారం, చౌళ్లపల్లి, ఆత్మకూరులో ఇన్‌చార్జిల నుంచి దరఖాస్తు ఫారాలను తీసుకున్నారు. దామెర మండలంలోని ఊరుగొండ ప్రభుత్వ పాఠశాలలో పీఆర్డీయూ మండల అధ్యక్షుడు చిట్టిరెడ్డి తిరుపతిరెడ్డి పట్టభద్రులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పీఆర్టీయూ నడికూడ మండల అధ్యక్షుడు దూదిపాల సాంబరెడ్డి నార్లాపూర్‌, వరికోల్‌, పులిగిల్ల, రాయపర్తి, చర్లపల్లి ఉన్నత పాఠశాలల్లో ఓటరు నమోదు చేపట్టారు. నర్సంపేట మండలంలోని ఇటుకాలపల్లి జడ్పీఎస్‌ఎస్‌లో పీఆర్టీయూ మండల అధ్యక్షుడు కోడెం సాంబయ్య ఓటరు నమోదు చేపట్టారు. పర్వతగిరిలో పీఆర్డీయూ మండల అధ్యక్షురాలు సూర సుజాత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు.

పీఆర్టీయూ రాయపర్తి మండల ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ శోభారాణి మండలకేంద్రంలోని జడ్పీఎస్‌ఎస్‌లో ఓటరు నమోదుపై ప్రచారం చేశారు. మండలంలో పని చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు గీసుగొండ మండలకేంద్రంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి అవగాహన కల్పించారు. నెక్కొండలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన సమావేశం నిర్వహించారు. పీఆర్టీయూ మండల అధ్యక్షుడు ఎం ప్రతాప్‌సింగ్‌ మాట్లాడుతూ ఈనెల ఆరో తేదీలోగా పట్టభద్రులు ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.


logo