బుధవారం 25 నవంబర్ 2020
Warangal-rural - Nov 03, 2020 , 02:13:19

టీఎస్‌ ఐసెట్‌లో 90.28 శాతం ఉత్తీర్ణత

టీఎస్‌ ఐసెట్‌లో 90.28 శాతం ఉత్తీర్ణత

  భీమారం,(వరంగల్‌) : తెలుగు రాష్ర్టాల్లో టీఎస్‌ ఐసెట్‌ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సెప్టెంబర్‌30, అక్టోబర్‌ 1 నిర్వహించిన టీఎస్‌ ఐసెట్‌ -2020 ఫలితాలను వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీ కామర్స్‌ భవనంలో సోమవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ పాపిరెడ్డి, ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రాజిరెడ్డి, కేయూ రిజిస్ట్రార్‌ పురుషోత్తం విడుదల చేశారు. 2020-21 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు గాను నిర్వహించిన టీఎస్‌ ఐసెట్‌-2020కి 58392 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా 45975 మంది పరీక్షలు రాశారు. వీరిలో 41506 మంది (90.28 శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలుర విభాగంలో 22912 మంది అభ్యర్థులకు 20816 (90.85శాతం) మంది, బాలికల్లో 23059 మందికి 20686 (89.71 శాతం) పాసయ్యారు. నలుగురు ట్రాన్స్‌జెండర్లు ఉత్తీర్ణత పొందారు. ఫలితాల్లో హైదరాబాద్‌ అమీర్‌పేటకు చెందిన బీ శుభశ్రీ 159.55 మార్కులతో మొదటి ర్యాంకు, నిజామాబాద్‌లోని ఆర్మూర్‌కు చెందిన గైని సందీప్‌ 144.50 మార్కులతో రెండో ర్యాంకు సాధించారు. టాప్‌ 20 ర్యాంకుల్లో పురుషులే ఉన్నారు. కాకతీయ యూనివర్సిటీ తొమ్మిదోసారి టీఎస్‌ ఐసెట్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు కేయూ రిజిస్ట్రార్‌ పురుషోత్తం, టీఎస్‌ ఐసెట్‌ కన్వీనర్‌          రాజిరెడ్డిని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి  అభినందించారు. టాప్‌ టెన్‌ ర్యాంకర్లలో ఖిలా వరంగల్‌కు చెందిన అడలా ప్రసన్నలక్ష్మి (142 మార్కులతో           నాలుగో ర్యాంకు) ఉంది.