శుక్రవారం 04 డిసెంబర్ 2020
Warangal-rural - Oct 31, 2020 , 02:22:48

సీఎం రాక కోసం కొడకండ్ల ముస్తాబు

సీఎం రాక కోసం కొడకండ్ల ముస్తాబు

సర్వాంగ సుందరంగా రైతు వేదిక.. పల్లె ప్రకృతి వనం  

ఆహ్లాదం పంచుతున్న కళాకృతులు.. చిత్రాలు

కొడకండ్ల/పాలకుర్తి రూరల్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాక సందర్భంగా కొడకండ్ల మండల కేంద్రం కొత్త రూపును సంతరించుకుంది. సీఎం చేతుల మీదుగా ప్రారంభం కానున్న రైతు వేదిక, పల్లె ప్రకృతి వనాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ‘వేదిక’ వేడుకను అంగరంగ వైభవంగా పూర్తి చేయాలనే సంకల్పంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నిరంతర పర్యవేక్షణతో అధికారులు, ప్రజాప్రతినిధులు సకల ఏర్పాట్లు చేశారు. రాష్ర్టానికే రోల్‌మోడల్‌గా నిలిచేలా రైతు వేదికకు సిద్ధం చేశారు. భవనం లోపల గోడలకు రైతుల జీవన విధానం ఉట్టిపడేలా అందమైన కళాకృతులు వేయించారు. ధాన్యం దిగుబడులను ఎడ్లబండిలో ఇంటికి తీసుకెళ్తున్న రైతు కుటుంబం కళాఖండాన్ని రైతు వేదిక ముందు ఏర్పాటు చేయగా చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. పల్లె పకృతి వనం సైతం పచ్చని శోభతో ఆకర్షిస్తున్నది. పార్కులో రాళ్లపై జంతువులు, పక్షుల బొమ్మలు, వివిధ కళాకృతులు, పార్కులో చిన్న నీటికొలను ఏర్పాటు చేయడంతో ఎంతగానో ఆహ్లాదం పంచుతున్నది. 70రకాల పూల మొక్కలు, వందల సంఖ్యలో పండ్ల మొక్కలు నాటడంతో ప్రకృతి వనం కళకళలాడుతున్నది. పిల్లలకు ప్రత్యేకంగా క్రీడా పరికరాలు సైతం ఏర్పాటయ్యాయి.