బుధవారం 02 డిసెంబర్ 2020
Warangal-rural - Oct 31, 2020 , 02:22:48

దేశానికి అన్నపూర్ణ తెలంగాణ

దేశానికి అన్నపూర్ణ తెలంగాణ

సీఎం కేసీఆర్‌ పాలనలో రైతుల్లో కొత్త వెలుగు

రైతును రాజు చేయడమే ముఖ్యమంత్రి లక్ష్యం

వేదికలతో వ్యవసాయ రంగానికి నవశకం

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

పాలకుర్తి రూరల్‌/కొడకండ్ల : దేశానికి తెలంగాణ అన్నపూర్ణలా మారిందని, సీఎం కేసీఆర్‌ పాలనలో రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. కొడకండ్ల మండల కేంద్రంలో శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన, సభ ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, జడ్పీ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రఘునందన్‌రావు, పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌కుమార్‌ సుల్తానియా, కలెక్టర్‌ కే నిఖిలతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ రైతు వేదికలు కర్షక దేవాలయాలని, రైతుల పాలిట ఉజ్వల సోపానాలని అభిప్రాయపడ్డారు. వేదికలతో రైతులకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందన్నారు. ఆరేళ్ల పాలనలో వ్యవసాయ రంగంలో సీఎం కేసీఆర్‌ అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చారని, ఈ రంగంలో నూతన ఒరవడికి నాంది పలికారని పేర్కొన్నారు. సమాజానికి అన్నం పెట్టే రైతుల బాగోగులు చూసేవారు లేక నిబ్బరం కోల్పోయి ఉమ్మడి రాష్ట్రం లో ఆత్మహత్యల బాట పట్టారని, స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారని గుర్తు చేశారు. ఆరేళ్ల కాలంలో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యమిచ్చి దేశంలోనే తెలంగాణను నంబర్‌ వన్‌ స్థానంలో నిలిపారని స్పష్టం చేశారు. దేశానికి తెలంగాణ అన్నపూర్ణలా వెలుగొందుతోందన్నారు. రైతులు నిజమైన రాజులుగా బతకాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని, రైతు వేదికలు దేశానికి తలమానికంలా నిలుస్తాయని చెప్పారు. బీజేపీ నాయకులకు ఉప ఎ న్నికపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని ధ్వజమెత్తారు. ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయినా కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు. జాతీయ విపత్తుగా ప్రకటించాల్సి ఉన్నా  కేంద్రం ప్రకటించలేదని మండిపడ్డారు. రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చి రైతుల నోట్లో కేంద్రం మట్టి కొడుతోందన్నారు. రైతులకు సీఎం కేసీఆర్‌ బాసటగా నిలుస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2601 రైతు వేదికలు నిర్మిస్తున్నామని, 58లక్షల మంది రైతులకు వీటిద్వారా మేలు కలుగుతుంద ని చెప్పారు. రైతు వేదికలు విజ్ఞాన భాండాగారాలుగా నిలుస్తాయన్నా రు. వాటిని సాంకేతికంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. విపత్తులను తట్టుకుని రైతులు నిలబడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని, ఇందుకు వేదికలు దోహదపడుతాయని పేర్కొన్నారు. కరువు ప్రాంతమైన కొడకండ్లలో రైతు వేదికను సీఎం చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు. సీఎం కేసీఆర్‌ ఉపన్యాసాన్ని ప్రజలు, రైతులు ఆసక్తిగా వినాలని కోరారు. రైతు వేదిక సభ నుంచి రాష్ట్ర రైతు లకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. పర్యటన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని కితాబునిచ్చారు. ఇక్కడ డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కుం దూరు వెంకటేశ్వర్‌రెడ్డి, డీసీపీ బీ శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ గొల్ల రమేశ్‌, డీఆర్డీవో గూడూరు రాంరెడ్డి, జడ్పీ సీఈవో రమాదేవి, అల్లమనేని నా గేందర్‌రావు, ఎంపీపీలు నల్లానాగిరెడ్డి, జినుగు అనిమిరెడ్డి, గాంధీనాయక్‌, జ్యోతి, పుస్కూరి శ్రీనివాసరావు, పేరం రాము, దీకొండ వెంకటేశ్వర్‌రావు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పసునూరి నవీన్‌, తీగల దయాకర్‌, వసుపర్తి సీతారాములు, నూనవత్‌ నర్సింహనాయక్‌, సిం దే రామోజీ, బిల్లా సుధీర్‌రెడ్డి, ఆకుల సురేందర్‌రావు, వర్రె వెంకన్న, కేలోతు సత్తమ్మ, కొడకండ్ల సర్పంచ్‌ మధుసూదన్‌ పాల్గొన్నారు.