శనివారం 23 జనవరి 2021
Warangal-rural - Oct 30, 2020 , 02:30:43

హోంగార్డుల ఉద్వాసనకు రంగం సిద్ధం

హోంగార్డుల ఉద్వాసనకు రంగం సిద్ధం

వరంగల్‌ క్రైం, అక్టోబర్‌ 29 : పోలీసు శాఖ పేరు చెప్పుకుని వసూళ్లకు పాల్పడడంతో పాటు చట్టవిరుద్ధ పనుల్లో తలదూర్చిన హోంగార్డులను విధుల నుంచి తొలగించేందుకు వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ హోంగార్డు కార్యాల యం కసరత్తు చేస్తున్నది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారిపై రిపోర్టు తయారుచేసే పనిలో పడింది. వివిధ ఠాణా ల్లో విధులు నిర్వర్తిస్తున్న కొంత మంది హోంగార్డులు పలు ఆరోపణల నేపథ్యంలో కమిషనరేట్‌కు అటాచ్డ్‌ అయ్యారు. వారిలో ఐదుగురు హోంగార్డులు మహిళలతో అసభ్య ప్ర వర్తన, డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు హోంగార్డులపై కేసు నమోదైంది. హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో నాగేశ్వర్‌రా వు, రాజు మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో హన్మకొండ, సుబేదారి స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వెయిటింగ్‌లో ఉన్న హోంగార్డు సారయ్య పరకాల ప్రాంతంలో లారీ డ్రైవర్‌ నుంచి రూ. 10 వేలు వసూలు చేశాడనే కారణంతో కేసు నమోదైంది. కాజీపేట ట్రాఫిక్‌లో పనిచేసే రాజేశ్‌ తన వాహనంలో మద్యాన్ని తరలిస్తూ నర్సంపేట పోలీసులకు పట్టుబడగా కేసు నమోదైంది. ఇంతేజార్‌గంజ్‌లో విధులు నిర్వర్తించే సుదర్శన్‌ బెల్టుషాపుల నిర్వాహకులకు సహకరిస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో కమిషనరేట్‌కు అటాచ్డ్‌ అయ్యాడు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ హోంగార్డు కార్యాలయం నుంచి షోకాజ్‌ నోటీసులు పంపించారు. 

కాగా, హోంగార్డులు ఇచ్చిన సమాధానాలపై ఉన్నతాధికారులు అసంతృప్తిగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఉన్నతాధికారుల నుంచి హోంగార్డు కార్యాలయానికి అందిన ఆదేశాల మేరకు ఐదుగురిని సర్వీస్‌ నుంచి తొలగించేందుకు రిపోర్ట్‌ సిద్ధం చేసే పనిలో హోంగార్డు ఆర్‌ఐ ఉన్నట్లు తెలుస్తున్నది. logo