శనివారం 28 నవంబర్ 2020
Warangal-rural - Oct 28, 2020 , 02:02:49

ఫిఫ్టీ.. ఫిఫ్టీ

ఫిఫ్టీ.. ఫిఫ్టీ

  • ల్యాండ్‌ పూలింగ్‌లో కొత్త ఆఫర్‌ 
  • కసరత్తు చేస్తున్న ‘కుడా’
  • 500 ఎకరాల భూసేకరణ లక్ష్యం
  • అసైన్డ్‌ భూములపై ప్రత్యేక దృష్టి

వరంగల్‌ మహా నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. త్వరలో కొత్త మాస్టర్‌ప్లాన్‌ ప్రభుత్వామోదం పొంది అమలులోకి రానున్నది.  ఈ నేపథ్యంలో భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) తరహాలో ల్యాండ్‌ పూలింగ్‌ చేయాలని ‘కుడా’ సంకల్పించింది. 500 ఎకరాల భూ సేకరణ లక్ష్యంగా కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా ఒకే చోట 50 ఎకరాలు అప్పగిస్తే, ఆ భూమిని ‘కుడా’ అభివృద్ధి చేసి వెంచర్లుగా మార్చి ఫిఫ్టీ.. ఫిఫ్టీ ఆఫర్‌లో విక్రయించాలని భావి స్తున్నది. ఇందుకోసం ప్రధానంగా అసైన్డ్‌ భూములపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

 - వరంగల్‌

మహా నగరంగా విస్తరిస్తున్న గ్రేటర్‌ కార్పొరేషన్‌ను పక్కా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసే దిశలో కాకతీ య పట్టణాభివృద్ధి సంస్థ అడుగులు వేస్తున్నది. అతి త్వరలో కొత్త మాస్టర్‌ ప్లాన్‌ ప్రభుత్వ ఆమోదం పొంది అమలులోకి రానున్న నేపథ్యంలో రాబోయే రోజులను దృష్టి పెట్టుకుని హెచ్‌ఎండీఏ తరహాలో ల్యాండ్‌ పూలింగ్‌కు కసరత్తు చేస్తున్నది. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ల్యాంగ్‌ పూలింగ్‌  చేయాలని రాష్ట్ర మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించిన నేపథ్యంలో భూ సేకరణకు ప్రణా ళికలు రూపొందిస్తున్నారు. దీని ద్వారా కుడా ఆర్థికాభివృద్ధితోపాటు నగరం పక్కా ప్రణాళికాబద్ధంగా అ భివృద్ధి చెందనుంది. రెండు విడుతలుగా ల్యాండ్‌ పూలింగ్‌ చేయనున్నారు. ఇందుకోసం కొత్త అఫర్‌ను ప్రకటించేందుకు అధికారులు ఆలోచిస్తున్నారు. దీనిలో భాగంగానే ఫిఫ్టీ.. ఫిఫ్టీ అఫర్‌ను ముందుకు తీసుకువస్తున్నారు. ముఖ్యంగా అసైన్డ్‌ భూములపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. సాధ్యమైనంత త్వరగా  ల్యాండ్‌ పూలింగ్‌ చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

భూ యజమానులకు లాభదాయకం..

ల్యాండ్‌ పూలింగ్‌లో ఫిఫ్టీ.. ఫిఫీ ఆఫర్‌ భూ యాజమానులకు లాభదాయకంగా ఉంటుందని కుడా అధి కారులు చెబుతున్నారు. 50 ఎకరాలు భూమి అప్పగిస్తూ ఒప్పందం చేసుకున్న వెంటనే ఆ స్థలంలో అభివృద్ధి పనులు మొదలు పెడుతారు. రోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, పైప్‌లైన్‌, ఎలక్ట్రిసిటీ, ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ లాంటి అభివృద్ధి పనులను పూర్తిగా కుడా ఆధ్వర్యంలో చేపడుతారు. నివాస యోగ్యా నికి పూర్తిస్థాయిలో వసతులు కూడా కల్పిస్తారు. అనంతరం ఆ భూమిలో సగం భూయాజమానులకు అప్పగిస్తారు. ఆ తర్వాత అక్కడ అధిక  ధరలకు ఫ్లాట్లను విక్రయించే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఓసిటీ, మాసిటీ పేరిట కుడా ఆధ్వర్యంలో చేపట్టిన ప్లాట్ల వేలం పాటలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిన విషయం తెలిసిందే.

500 ఎకరాల ల్యాండ్‌ పూలింగ్‌

500 ఎకరాలు ల్యాండ్‌ పూలింగ్‌ చేయాలన్న లక్ష్యంతో కుడా అధికారులు ముందుకు పోతున్నారు.  ఇప్పటికే కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఎమ్మెల్యేలు చల్లా ధర్మా రెడ్డి, అరూరి రమేశ్‌తో అయా నియోజకవర్గాల్లో  ల్యాంగ్‌ పూలింగ్‌పై చర్చించారు. ప్రభుత్వ భూములను కుడాకు అప్పగించాలని కోరారు. అలాగే వందల ఎకరాల అసైన్డ్‌ భూములపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అసైన్డ్‌ భూమిని అనుభవిస్తున్న వారు ల్యాండ్‌ పూలింగ్‌లో అప్పగిస్తే అభివృద్ధి చేసి విక్రయాలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఏడాది కాలంలో 500 ఎకరాల ల్యాండ్‌ పూలింగ్‌ లక్ష్యం చేరుకునేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

 ప్రత్యేకంగా వింగ్‌

కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థలో ప్రత్యేకంగా ల్యాండ్‌ పూలింగ్‌ వింగ్‌ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం అధికారులకు శిక్షణ ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. ఇప్పటికే హెచ్‌ఎండీఏలో ఈ ప్రక్రియ చేపట్టిన నేపథ్యంలో అక్కడి పద్ధతులను అధ్యయనం చేసేందుకు కుడాలోని కొంత మంది అధికారులను పంపించనున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకుపోయినట్లు సమాచారం. నగర నలు మూలల మంచి మార్కెట్‌ ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ల్యాండ్‌ పూలింగ్‌ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే అభివృద్ధి.. అమ్మకాలు అనే పద్ధతిలో సంస్థ వేగంగా ముందడుగు వేస్తున్న విషయం తెలిసిందే. అజాంజాహి మిల్లు భూములను కొని అక్కడ వేగంగా అభివృద్ధి చేసి ప్లాట్ల వేలం పాటలు నిర్వహిస్తే హాట్‌కేక్‌లుగా అమ్ముడుపోతున్నాయి. అలాగే  మడిపెల్లిలో మాసిటీ పేరిట నిర్వహించిన ప్లాట్ల వేలం పాటల్లో అధికారులు విస్తుపోయేలా ప్రజలు పాట పాడి ప్లాట్లు దక్కించుకున్నారు. కుడాపై ప్రజలకు ఉన్న నమ్మకంతో సంస్థ చేపట్టిన ప్రతి వెంచర్‌ రూ. కోట్ల ఆదాయం తీసుకువస్తున్నది. ఓసిటీ  వెంచర్‌ కుడాను ఆర్థికంగా బలోపేతం చేసింది. ఓసిటీ ప్లాట్ల వేలంతో వచ్చిన రూ. కోట్ల నిధులతో నగరం వేగంగా అభివృద్ధి దిశలో పరుగులు పెడుతోంది.

50 ఎకరాలకు తక్కువ కాకుండా

ఒకే చోట 50 ఎకరాలు భూమి సేకరించి అక్కడ అభివృద్ధి చేసి ఫిఫ్టీ.. ఫిఫీ ఆఫర్‌లో విక్రయించాలని అధికారులు భావిస్తున్నారు. ఒక్కరు కాకుండా ఉమ్మడిగా 50 ఎకరాలు సమీకరించి ఒప్పందం చేసుకోవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా ఇన్నర్‌, ఔటర్‌, రీజియన్‌ రింగ్‌ రోడ్లను దృష్టిలో పెట్టుకుని ల్యాండ్‌ పూలింగ్‌ చేయనున్నాయని అంటున్నారు.  

ప్రత్యేకంగా దృష్టి పెట్టాం

ల్యాంగ్‌ పూలింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఇప్పటికే ఇద్దరు రిటైర్డ్‌ తహసీల్దార్లతో ప్రత్యేకంగా సర్వే చేయిస్తున్నాం. ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల సర్వే నంబర్లతో సహా సర్వే చేస్తున్నారు. ఔటర్‌, ఇన్నర్‌ రిం గ్‌ల చుట్టూ ల్యాంగ్‌ పూలింగ్‌ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్‌తో ప్రత్యేక సమావేశాలు నిర్వహిం చాం. 500 ఎకరాలు ల్యాండ్‌పూలింగ్‌ చేయాలన్న లక్ష్యంగా ముందుకు పోతున్నాం. ఆరు నెలల్లో అనుకున్న లక్ష్యం మేరకు భూమిని సేకరిస్తాం.

- మర్రి యాదరెడ్డి, కుడా చైర్మన్‌