ఆదివారం 29 నవంబర్ 2020
Warangal-rural - Oct 27, 2020 , 01:28:24

తిన్నది కక్కండి..!

తిన్నది కక్కండి..!

ఎస్సారెస్పీ కాలువ పనుల్లో అక్రమాలపై ప్రభుత్వం సీరియస్‌

2007-10లో నామినేషన్లపై పనులు

రూ.కోట్లలో సర్కారు సొమ్ము పక్కదారి

విజిలెన్స్‌ విచారణలో వెలుగు చూసిన నిజాలు

డబ్బు రికవరికీ సాగునీటి శాఖ నోటీసులు

వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: గత ప్రభుత్వాల హయాంలో ప్రజాధనం అడ్డగోలుగా దోపిడీ అయ్యింది. అభివృద్ధి పనుల పేరిట అక్రమార్కులు ఇష్టరాజ్యంగా స్వాహా చేశారు. నిబంధనలు ఉల్లంఘించి నామినేషన్ల పేరుతో కావాల్సిన వారికి తలా ఇంత అన్న తీరుగా కట్టబెట్టారు. సాగునీటి శాఖలో ఈ వ్యవహారం వెలుగుచూడగా ఎలాంటి పనులు చేయకుండానే కాలువల మరమ్మతుల పేరిట దోచుకున్న కోట్ల రూపాయల సొమ్మను రికవరీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అక్రమాలపై విచారణ అధికారుల ప్రతిపాదనల మేరకు రికవరీ ప్రక్రియ మొదలైంది. ఒక్కొక్కరి పేరిట దోపిడీలో భాగస్వాములైన అందరికీ ఇప్పుడు నోటీసులు చేరుతున్నాయి. చింతగట్టు సర్కిల్‌లోనే దాదాపు రూ.5కోట్ల దాకా రికవరీకి నోటీసులు జారీ అయ్యాయి. ప్రజాధనం దోపిడీ చేస్తే ఎప్పటికైనా తిరిగి కట్టాల్సిందేనన్న భయం ఇప్పుడు అక్రమార్కులలో మొదలైంది. ‘2007-08, 2008-09, 2009-10 సంవత్సరాల్లో చేపట్టిన ఎస్సారెస్పీ కాలువ మరమ్మతులు, నిర్వహణ పనులను తనిఖీ చేయగా అక్రమాలు జరిగినట్లు నిర్ధారణైంది. బిల్లు ప్రకారం పనులు లేవని తేలింది. ‘విజిలెన్స్‌ విచారణ ప్రాతిపదికన మీ నుంచి నిధుల రికవరీకి  ఈ నోటీసు జారీ చేస్తున్నాం. ఈ నోటీసులో పేర్కొన్న మొత్తాన్ని ఇది చేరిన వారంలోగా డీడీ రూపంలో జమ చేయాల్సి ఉంటుంది. లేకుంటే నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు మొదలవుతాయి’ అని అందులో పేర్కొనగా వాటిని అందుకున్న వారిలో ఆందోళన మొదలైంది. 

903 పనుల్లో 42మాత్రమే పూర్తి

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) కాలువ మరమ్మతులు, నిర్వహణ కోసం 2007 నుంచి 2010 మధ్య అప్పటి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. నీటి సంఘాలకు, చైర్మన్ల బినామీలకు నామినేషన్‌పై పనులు అప్పగించగా, హన్మకొండ కనస్ట్రక్షన్‌ సర్కిల్‌ పరిధిలోని ఎస్సారెస్పీ కాలువ 191వ కిలో మీటరు నుంచి 234వ కిలో మీటరు వరకు మొత్తం 903 పనులు చేసినట్లు చూపారు. పర్యవేక్షణ లేకపోవడంతో పనులు ఇష్టారాజ్యంగా జరిగాయి. పిచ్చి మొక్కలు చదును చేసి పనులు పూర్తయినట్లు రికార్డులు రాశారు. అడ్డగోలుగా బిల్లులు ఎత్తుకుని సర్కారు నిధులను జేబులో వేసుకున్నారు. క్షేత్రస్థాయిలో పనులు కాకుండానే అయినట్లు చూపడంతో ఆరోపణలు వెల్లువెత్తాయి. వందల సంఖ్యలో ఫిర్యాదులు అందడంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విచారణ నిర్వహించాలని నిర్ణయించింది. విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించింది. విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌తోపాటు సాగునీటి శాఖలోని ఉన్నతాధికారులను బృందాలుగా నియమించింది. విచారణలో భాగంగా అధికారులు 833 పనులను తనిఖీ చేశారు. 42 పనులే పూర్తిగా జరిగాయని తేల్చారు. మరో 252 పనులు కొంత మేర బాగున్నాయని గుర్తించారు. ఎక్కువ శాతం పనుల తీరు తూతూమంత్రంగా ఉండడంతో విజిలెన్స్‌ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. పనులు చేయకుండానే బిల్లులు ఎత్తుకున్నారని, బాధ్యుల నుంచి నిధులు తిరిగి వసూలు చేయాలని ప్రతిపాదించింది. ఈ మేరకు ప్రభుత్వం సాగునీటి శాఖను ఆదేశించగా రికవరీ ప్రక్రియ మొదలైంది. అప్పుడు పనులు పొందిన వారి పేరుతో నోటీసులు జారీ కాగా సంబంధిత వ్యక్తుల్లో గుబులు రేగుతున్నది.