సోమవారం 30 నవంబర్ 2020
Warangal-rural - Oct 27, 2020 , 01:19:32

వరంగల్‌, ములుగు మధ్య ఫోర్‌లేన్‌

వరంగల్‌, ములుగు మధ్య ఫోర్‌లేన్‌

కటాక్షపురం చెరువు వద్ద హైలెవల్‌ వంతెన

ఆరెపల్లి నుంచి గట్టమ్మ టెంపుల్‌ దాకా సర్వే

30 కిలోమీటర్ల నాలుగు వరుసల రోడ్డుకు అంచనాలు

రూ.300 కోట్లతో డీపీఆర్‌ తయారు

పరిశీలిస్తున్న నేషనల్‌ హైవే అధికారులు 

వరంగల్‌రూరల్‌, నమస్తేతెలంగాణ : హైదరాబాద్‌-భూపాలపట్నం 163 జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌)ని వరంగల్‌, ములుగు మధ్య విస్తరించేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. నాలుగు వరుసల రోడ్డు నిర్మించేందుకు అధికారులు రూ.300 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను తయారు చేశారు. ఇందులో కటాక్షపురం వద్ద హైలెవల్‌ వంతెన నిర్మాణానికి ప్రతిపాదించారు. మరి కొద్దిరోజుల్లో ఈ డీపీఆర్‌ను ఎన్‌హెచ్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(ఈఎన్‌సీ)కి అందజేయనున్నారు. 163 ఎన్‌హెచ్‌లో తొలి విడుత హైదరాబాద్‌ నుంచి యాదాద్రి వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం జరిగింది. యాదాద్రి నుంచి వరంగల్‌ నగరం సమీపంలోని ఆరెపల్లి గ్రామం వరకు రెండో విడుత చేపట్టిన నాలుగు లేన్ల రోడ్డు నిర్మా ణం తుది దశకు చేరింది. దీంతో హైదరాబాద్‌ నుంచి ఆరెపల్లి వరకు 150 కి.మీ ఫోర్‌లేన్‌ రోడ్డు ప్రయాణి కులకు అందుబాటులోకి వచ్చింది. ఆరెపల్లి గ్రామం వరంగల్‌- ములుగు రూటులో ఉంది. ఈ నేపథ్యం లో ప్రస్తుతం వరంగల్‌ నుంచి ములుగు వరకు 163 ఎన్‌హెచ్‌ను విస్తరించే కసరత్తు ఇటీవల మొదలైంది. ఇందులో వరంగల్‌, ములుగు మధ్య ఆరు కి.మీ విస్తరణ జరిగింది. 159వ కి.మీ నుంచి 165వ కి.మీ వరకు అంటే ఆత్మకూరు మండలంలో గూడెప్పాడ్‌ నుంచి నీరుకుళ్ల క్రాస్‌ వరకు పూర్తి చేశారు. ఈ ఆరు కి.మీలో ఆత్మకూరు మండల కేంద్రం వద్ద రహదారికి రెండు వైపులా డ్రైనేజీ, ఫుట్‌పాత్‌లు, రెయిలింగ్‌, డివైడర్‌ నిర్మించి సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం కూడా ఏర్పాటు చేశారు. దీంతోపాటు ములుగు జిల్లా కేంద్రంలోనూ 163 ఎన్‌హెచ్‌ను నాలుగు లేన్ల రోడ్డుగా విస్తరించారు. గట్టమ్మ టెంపుల్‌ నుంచి ములుగు మీదుగా జంగాలపల్లి క్రాస్‌ వరకు ఫోర్‌లేన్‌ రోడ్డు, రెండు వైపులా డ్రైనేజీ, ఫుట్‌పాత్‌లు, రెయిలింగ్‌, రోడ్డు మధ్యన డివైడర్‌ నిర్మించి సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం ఏర్పాటు చేశారు. ఆరెపల్లి నుంచి గూడెప్పాడ్‌ వరకు, నీరుకుళ్ల క్రాస్‌ నుంచి ములుగు శివారులోని గట్టమ్మ టెంపుల్‌ వరకు 30 కి.మీ విస్తరించాల్సి ఉంది. ఆరెపల్లి నుంచి గూడెప్పాడ్‌ వరకు 9, నీరుకుళ్ల క్రాస్‌ నుంచి గట్టమ్మ టెంపుల్‌ వరకు 21 కి.మీ నిడివి ఉంది. 

కటాక్షపురం వద్ద కష్టాలు

వరంగల్‌- ములుగు రూటులో ఆత్మకూరు మండలంలోని కటాక్షపురం వద్ద గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇటీవల ప్రయాణికులకు కష్టాలు ఎదురయ్యాయి. నీరుకుళ్ల- గట్టమ్మ టెంపుల్‌ మధ్య కటాక్షపు రం వద్ద చెరువు ఉంది. భారీ వర్షాలు కురిసిన సమయంలో ఈ చెరువు మత్తడి నీరు 163 ఎన్‌హెచ్‌ మీదుగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ హైలెవల్‌ వంతెన లేదు. దీంతో నీటి ప్రవాహం పెరిగితే కొన్ని సందర్భాల్లో రాకపోకలకు బ్రేక్‌ పడుతుంది. ఇటీవల వరుస వర్షాలతో కొన్ని రోజులపాటు కటాక్షపురం వద్ద చెరువు మత్తడి నీరు ఎన్‌హెచ్‌ మీదుగా ప్రవహించింది. ఫలితంగా దీనిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్‌, ములుగు మధ్య రాకపోకలు స్తంభించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తప్పని పరిస్థితిలో నర్సంపేట మీదుగా ప్రయాణం చేశారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ కటాక్షపురం చెరువు వద్ద ఎన్‌హెచ్‌పై హైలెవల్‌ వంతెన నిర్మించాలనే ఒత్తిడి అధికారులపై పెరిగింది. అప్పటికే వరంగల్‌, ములుగు మధ్య ఫోర్‌లేన్‌ రోడ్డు నిర్మాణం చేపట్టే ప్రతిపాదన పరిశీలిస్తున్న ఎన్‌హెచ్‌ అధికారు లు అంచనాలు రూపొందించేందుకు రంగంలోకి దిగారు. 163 ఎన్‌హెచ్‌లో వరంగల్‌, ములుగు మధ్య ఆరెపల్లి నుంచి గూడెప్పాడ్‌, నీరుకుళ్ల క్రాస్‌ నుంచి గట్టమ్మ టెంపుల్‌ వరకు ఫోర్‌లేన్‌ రోడ్డు నిర్మాణం కోసం డీపీఆర్‌ తయారు చేసి ఇచ్చే పనిని ఓ కన్సల్టెన్సీకి అప్పగించారు.

వరంగల్‌- ములుగు రూటులో ప్రస్తుతం ఎన్‌హెచ్‌ పది మీటర్ల వెడల్పుతో ఉంది. ఇటీవల వరంగల్‌, ములుగు మధ్య ఫోర్‌లేన్‌ రోడ్డు నిర్మాణం కోసం కన్సల్టెన్సీ ప్రతినిధులు సర్వే జరిపారు. 30 కి.మీ నాలుగు వరుసల రోడ్డు, కటాక్షపురం చెరువు వద్ద సుమారు వంద మీటర్ల పొడవుతో హైలెవల్‌ వంతెన నిర్మాణానికి అంచనాలు వేశారు. రోడ్డు మధ్యలో మీటరున్నర వెడల్పుతో డివైడర్‌, రెండు వైపులా ఎనిమిదిన్నర మీట ర్ల వెడల్పుతో రహదారి, కొన్ని గ్రామాల వద్ద డ్రైనేజీ, రెయిలింగ్‌, ఫుట్‌పాత్‌లు, సెంట్రల్‌ లైటింగ్‌, 25 మీటర్ల వెడల్పుతో కటాక్షపురం వద్ద హైలెవల్‌ వంతెన కోసం రూ.300 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్‌ తయారు చేశారు. దీన్ని సదరు కన్సల్టెన్సీ కొద్ది రోజుల క్రితం ఎన్‌హెచ్‌ అధికారులకు అందజేయగా క్షేత్ర స్థాయి అధికారులు పరిశీలిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ డీపీఆర్‌ హైదరాబాద్‌లోని ఎన్‌హెచ్‌ ఈఎన్‌సీ కి అందనుంది. ఆ తర్వాత రీజినల్‌ అధికారి ద్వారా ఢిల్లీకి చేరనుంది. రూ.300 కోట్లు మంజూరు కాగానే టెండర్ల ప్రక్రియ చేపడుతారు. 2021లో వరంగల్‌, ములుగు మధ్య 163 ఎన్‌హెచ్‌ విస్తరణ, ఫోర్‌లేన్‌ రోడ్డు, కటాక్షపురం చెరువు వద్ద హైలెవల్‌ వంతెన నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.