శుక్రవారం 04 డిసెంబర్ 2020
Warangal-rural - Oct 24, 2020 , 02:55:10

వాన నష్టం.. వంద కోట్లు

వాన నష్టం.. వంద కోట్లు

వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సీజన్‌ ముగిసిన తర్వాత కూడా వచ్చిన జోరు వానలు తీవ్ర నష్టం కలిగించాయి. అక్టోబర్‌లో 11 నుంచి వరుసగా పడిన భారీ వర్షాలతో జరిగిన నష్టంపై అధికారయంత్రాంగం అంచనాలు రూపొందించింది. ఆరు జిల్లా ల్లో రూ.105 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు పేర్కొంది.  వరదలు, ప్రమాదాలతో నలుగురు చనిపోయారు. 51 మూగజీవాలు బలయ్యాయి. ఆరు ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 422 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పంచాయతీరాజ్‌, రోడ్లు-భవనాలు, మున్సిపల్‌ శాఖ పరిధిలో 206 కిలో మీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. పంట నష్టం కూడా ఎక్కువగా జరిగింది.  

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో.. ఎనిమిది మూగ జీవాలు చనిపోయా యి. ఒక చెరువు తెగింది. 138కిలో మీటర్ల మేర రోడ్డు దెబ్బతినడంతో రూ.24.27 కోట్ల నష్టం జరిగింది. 10.2 కిలోమీటర్ల నా లాలు దెబ్బతిన్నాయి. ఆరు ఇండ్లు పూర్తిగా, 52 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 96 విద్యుత్‌ స్తంభాలు విరిగి పోయాయి. 9వేల417 ఎకరాల్లో వరి, 2503 ఎకరాల్లో పత్తి దెబ్బతిన్నది. పంట నష్టం విలువ రూ.6.52కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. 

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో.. రెండు మూగ జీవాలు చనిపోయా యి. 251 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రూ.8.03 లక్షల నష్టం జరిగింది. ఒక చెరువు తెగింది. దీంతో రూ.50.02 లక్షల నష్టం వాటిల్లింది. 24కిలో మీటర్ల మేర రోడ్లు దెబ్బతిని రూ. 11.74కోట్ల నష్టం వాటిల్లింది. రెండు ట్రాన్స్‌ఫార్మర్లు పాడయ్యా యి. 54 స్తంభాలు విరిగిపోయాయి. 5671 ఎకరాల్లో వరి, రూ. 55వేల438 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం జరిగింది. పంట నష్టం విలువ రూ.37.84 కోట్లుగా అధికారులు అంచనా వేశారు.

జనగామ జిల్లాలో.. నష్టం ఎక్కువగా జరిగింది. ఒకరు చనిపోగా రెండు మూగ జీవాలు బలయ్యాయి. 16వేల673 ఎకరాల్లో వరి, 10వేల 15ఎకరాల్లో పత్తికి నష్టం జరిగింది. పంట నష్టం రూ.10 కోట్ల దాకా ఉంటుందని అంచనా వేశారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌, మున్సిపల్‌ శాఖల పరిధిలో 12.2కిలో మీట ర్ల మేరకు రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో రూ.3.45 కోట్ల వరకు న ష్టం జరిగింది. వరదతో 85 మీటర్ల మేర నాలాలు దెబ్బతిని రూ. 2.25 లక్షల నష్టం జరిగింది. 52 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిని రూ. 15 లక్షల నష్టం వాటిల్లింది. 195 విద్యుత్‌స్తంభాలు విరిగిపోయి 5.79 లక్షల నష్టం జరిగింది. 

మహబూబాబాద్‌ జిల్లాలో.. 2వేలా590 ఎకరాల్లో వరి, 1,620 ఎకరాల్లో పత్తి దెబ్బతిన్నాయి. పంట నష్టం అంచనా రూ.2.23 కోట్లుగా అధికారులు నిర్ధారించారు. 24.5 కిలో మీటర్ల రోడ్లు దెబ్బతిని రూ.3.50 కోట్ల నష్టం వాటిల్లింది. 53 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 

భూపాలపల్లి జిల్లాలో.. అధిక వర్షాలతో ముగ్గురు చనిపోయారు. 39 మూగజీవాలు మృతిచెందాయి. చెరువులు తెగిపోవడం, కాలువలు దెబ్బతినడం వల్ల జరిగిన నష్టం రూ.1.56 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఏడు ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. విద్యుత్‌ స్తంభాలు, తీగల నష్టం రూ.75వేలు ఉంది. 

ములుగు జిల్లాలో.. 8.4 కిలో మీటర్ల మేర రెండు రోడ్లు దెబ్బతిన్నాయి. మరమ్మతుల కోసం రూ.ఐదు కోట్లు అవసరమని అధికార యంత్రాంగం అంచనా వేసింది.