శనివారం 05 డిసెంబర్ 2020
Warangal-rural - Oct 23, 2020 , 02:03:02

చేను మేసిన కంచె!

చేను మేసిన కంచె!

  • వడ్ల కొనుగోలులో మోసం గుట్టు రట్టు!
  • కాంటా పెట్టిన ధాన్యం నుంచి 790 బస్తాలు కోత
  • బయట పడడంతో తక్కువ పడినరైతులకు రూ.5.80లక్షలు చెల్లింపు
  • ఐకేపీ జిల్లా పీడీ విచారణలో వెల్లడి

శాయంపేట, అక్టోబర్‌ 22 : మండలంలోని ప్రగతిసింగారం  ఐకేపీ ధాన్యం కొనుగోలులో అవినీతి కంచే చేనుమేసిన చందంగా మారింది. రైతులు ఆరుగాలం కష్టించి కేంద్రానికి తెచ్చిన ధాన్యాన్ని కాంటా పెట్టిన తర్వాత నిర్వాహకులు అవినీతికి తెరలేపారు. ధాన్యం బస్తాలను రైతులకు తెలియకుండా తక్కువ వేశారు. ఇలా 790 ధాన్యం బస్తాలను మిగిల్చుకుని రూ.5.80 లక్షలు ఖాతాలో జమ చేసుకున్నారు. అసలు బాగోతం తెలియక ధాన్యం అమ్మిన రైతులు తక్కువ డబ్బులు వచ్చాయని లబోదిబోమని  మొత్తుకున్నారు. అయితే,  కేంద్రంలో 15 క్వింటాళ్ల ధాన్యం తక్కువ రావడం, నిర్వాహకుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో గుట్టు రట్టయ్యింది. తమ  కొనుగోలు కేంద్రంలో అవినీతి జరిగిందని డీఆర్‌డీఏ పీడీకి వారే ఫిర్యాదు చేశారు. దీంతో ఐకేపీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ దయాకర్‌ను అధికారులు విచారణకు నియమించారు. గురువారం స్థానిక గ్రామ పంచాయతీలో రెండోసారి విచారణ చేపట్టి గట్టు రట్టు చేశారు. దీంతో నష్టపోయిన రైతులకు తిరిగి రూ.5.80లక్షలను చెల్లించినట్లు నిర్వాహకులు రసీదులను చూపించారు.   నివేదికను డీఆర్‌డీఏ పీడీకి అందిస్తానని డీపీఎం వెల్లడించారు. 

ప్రగతిసింగారంలో యాసంగిలో ఐకేపీ ఆధ్వర్యంలో గాయత్రి సంఘానికి ధాన్యం కొనుగోలు బాధ్యతలు అప్పగించారు. ఐదుగురు సభ్యులు దీన్ని నిర్వహించారు.    మొత్తంగా యాసంగిలో ఈ సెంటర్‌లో రూ.2.51కోట్ల విలువైన 13,703 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. అయితే, ఇక్కడ నిర్వాహకులు అంతా కలిసి అవినీతికి పాల్పడినట్లు డీపీఎం దయాకర్‌ వెల్లడించారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని కాంటా పెట్టి తర్వాత వాటిలో కోత పెట్టినట్లు తేలింది. ఒక్కో రైతు 20 క్వింటాళ్ల  ధాన్యం తెస్తే 15 క్వింటాళ్లుగా తక్కువగా వేశారు. ఇలా మొత్తం 790 బస్తాలను నిర్వాహకులు మిగిల్చుకున్నట్లు విచారణలో తేలిందని డీపీఎం తెలిపారు. అలాగే, దానికి సంబంధించిన డబ్బులు రూ.5.58లక్షలు కూడా వారి ఖాతాల్లోనే పడేటట్లు చేసుకున్నారన్నారు. ఈ క్రమంలో 51 మంది రైతులకు డబ్బులు తక్కువగా వచ్చాయి.  వారు నిర్వాహకులను నిలదీస్తే తరుగు వచ్చిందని సర్దిచెప్పారు. అయితే, కేంద్రంలో మొత్తం 15క్వింటాళ్ల ధాన్యం షార్టేజ్‌ రావడం, నిర్వాహకుల మధ్య భేదాభిప్రాయాలు, తేడాలు  రావడంతో ఈ విషయంపై వారే ఫిర్యాదు చేసుకున్నారు.  విషయం బయట పడడంతో  నష్టపోయిన రైతులకు నిర్వాహకులు తిరిగి రూ.5.80లక్షలు ఇచ్చారని, అందుకు సంబంధించిన రసీదులు కూడా చూపినట్లు డీపీఎం తెలిపారు. అయితే ఇంకా కొందరు  రైతులు ఉన్నారని, రూ.1.11లక్షలు  ఇవ్వాల్సి ఉన్నదని, వారికి కూడా చెల్లిస్తామని కమిటీ వాళ్లు చెప్పినట్లు తెలిపారు.   కొనుగోలు కమిటీలోని అధ్యక్ష, కార్యదర్శులే బుక్‌కీపర్‌పై ఫిర్యాదు చేశాని, ఈ మేరకు  6న విచారణ చేయడంతో రికార్డులు సరిగా లేక వాయిదా వేసినట్లు తెలిపారు. అయితే, సీఏ బుక్‌కీపర్‌గా చేయవద్దని సీఏ భర్తను పెట్టారని డీపీఎం తెలిపారు. ఐదుగురు కమిటీ సభ్యులే కలిసి బస్తాకు కొన్ని కిలోలు తక్కువ చేసినట్లు స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్లు  పేర్కొన్నారు.  సీఏ ఇందులో ఆమె భర్తను ఇన్‌వాల్వ్‌ చేసిందని, ఆమెపై చర్యలు తీసుకుంటామని, 15 క్వింటాళ్ల షార్టేజ్‌ని కమిటీ మెంబర్లే భరించాల్సి వస్తుందని తెలిపారు. నివేదికను డీఆర్‌డీఏ పీడీకి అందిస్తానని డీపీఎం దయాకర్‌ వెల్లడించారు. కాగా, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవినీతి గుట్టు రట్టు కావడంతో సర్వత్రా రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.