బుధవారం 02 డిసెంబర్ 2020
Warangal-rural - Oct 21, 2020 , 01:56:36

భక్తిశ్రద్ధలతో దుర్గామాతకు పూజలు

భక్తిశ్రద్ధలతో దుర్గామాతకు పూజలు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళవారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా కొలువుదీరిన దుర్గామాతను భక్తులు వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. చెన్నారావుపేటలోని శ్రీసిద్ధేశ్వరాలయంలో మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్‌ కంది గోపాల్‌రెడ్డి-విజయ, గట్ల కృష్ణయ్య పూజలు చేశారు. దుగ్గొండి మండలంలోని మహ్మదాపురం, దుగ్గొండి, తొగర్రాయి, మల్లంపల్లిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 

తిమ్మంపేటలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, నాచినపల్లిలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో ఉత్సవ కమిటీ సభ్యులు దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. నర్సంపేట పట్టణంలోని వాసవీమాత ఆలయంలో చండీహోమాలు చేశారు. అనంతరం దాతలు కొడకండ్ల నాగేశ్వర్‌రావు కుసుమ దంపతులు మహాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు శింగిరికొండ మాధవశంకర్‌, వంగేటి గోవర్ధన్‌, మాదారపు చంద్రశేఖర్‌, ఇరుకుల వీరలింగం తదితరులు పాల్గొన్నారు. 

నర్సంపేట మండలంలోని ఇటుకాలపల్లి, ద్వారకపేట, మాదన్నపేట, లక్నేపల్లి బిట్స్‌ కళాశాల, ముత్తోజిపేటలో దుర్గామాత భక్తులకు మహాలక్ష్మీ అవతారంలో దర్శనమిచ్చారు. వర్ధన్నపేట మండలకేంద్రంతోపాటు ఇల్లంద, కొత్తపల్లిలో అమ్మవారు కాత్యాయనీ అవతారంలో పూజలందుకున్నారు. పరకాల పట్టణంలోని శ్రీకుంకుమేశ్వర ఆలయంలో దుర్గామాత శ్రీఅన్నపూర్ణేశ్వరీదేవిగా దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్‌ గందె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆత్మకూరులోని పోచమ్మ సెంటర్‌ వద్ద అమ్మవారిని అన్నపూర్ణదేవిగా అలంకరించారు. నల్లబెల్లిలో ముదిరాజ్‌ కులస్తులు దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేసి, ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. టీఆర్‌ఎస్‌ నాయకుడు పాండవుల రాంబాబు, ఆలయ పూజారి శ్రీను, భూక్యా బానోతి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.