మంగళవారం 24 నవంబర్ 2020
Warangal-rural - Oct 19, 2020 , 05:41:22

నత్తనడకన సీఎంఆర్‌

నత్తనడకన సీఎంఆర్‌

  • మరోసారి గడువు పెంచిన ప్రభుత్వం

హన్మకొండ, అక్టోబర్‌ 18 : జిల్లాలో కస్టం మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) సరఫరా నత్తనడకన సాగుతున్నది. 2019-20 వాన కాలం, యాసంగికి సంబంధించిన సీఎంఆర్‌ గడువు పూర్తయినా రైస్‌ మిల్లుల నుంచి రాకపోవడంతో సర్కారు ఈనెలాఖరు వరకు గడువు మరోసారి పెంచింది. సివిల్‌ సప్లయ్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 2019-20 సంవత్సరం వాన కాలం సంబంధించి 22,788.673 (84.25శాతం) మెట్రిక్‌ టన్నులు, యాసంగికి సంబంధించి 80,294.830 (51 శాతం) మెట్రిక్‌ టన్నుల బియ్యం మిల్లర్లు బకాయిలు ఉన్నారు. కస్టం మిల్లింగ్‌ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఇప్పటికే పలుమార్లు కలెక్టర్‌ మిల్లర్లతో సమావేశం నిర్వహించి గడువులోగా అందజేయాలని ఆదేశించారు.  అంతేకాకుండా సీఎంఆర్‌ పర్యవేక్షణకు రెగ్యులర్‌ డీటీసీఎస్‌లతోపాటు కలెక్టర్‌ ఆదేశాల మేరకు తహసీల్దార్లు, వీఆర్‌వోలు, వీఆర్‌ఏలను కూడా నియమించారు. అయినా లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. త్వరలోనే మళ్లీ 2020-21 వానకాలం సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో పెండింగ్‌ సీఎంఆర్‌ను ఈ లోగా పూర్తి చేయించాలని ప్రభుత్వం జిల్లా యాంత్రాంగాన్ని ఆదేశించింది. గడువులోగా సీఎంఆర్‌ను మిల్లర్లు అందించకపోతే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. 

 63 మిల్లులకు ధాన్యం కేటాయింపు 

ప్రతి సంవత్సరం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని సామర్థ్యం ఆధారంగా జిల్లాలోని రైస్‌ మిల్లులకు కేటాయించి సీఎంఆర్‌ బియ్యంగా మార్పిస్తారు. అందులో భాగంగా 2019-20 సంవత్సరంలో పండిన ధాన్యాన్ని జిల్లాలోని 63 రైస్‌ మిల్లులకు కేటాయించారు. వాన కాలానికి సంబంధించి 29 బాయిల్డ్‌ మిల్లులు, 34 రా రైస్‌ మిల్లులకు కలిపి మొత్తం 2,14,863.094 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని పంపించారు. బాయిల్డ్‌ బియ్యం 68 శాతం, రా రైస్‌ 67 శాతం చొప్పున కలిపి మొత్తం 1,44,732.621 మెట్రిక్‌ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 7వ తేదీ వరకు 1,21,943.948 మెట్రిక్‌ టన్నులు (84.25 శాతం) మాత్రమే సీఎంఆర్‌ ఇవ్వగా.. ఇంకా 18 మంది రైస్‌ మిల్లర్ల నుంచి 22,788.673 మెట్రిక్‌ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. అలాగే, యాసంగి సీజన్‌లో 36 మిల్లులకు వరంగల్‌ అర్బన్‌ జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన 24,100.320 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని బాయిల్డ్‌, రారైస్‌ మిల్లులకు కేటాయించారు. బాయిల్డ్‌ బియ్యం 68 శాతం, రా రైస్‌ 67 శాతం చొప్పున కలిపి మొత్తం1,63,873.531 మెట్రిక్‌ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. ఈ నెల 7వ తేదీ వరకు 8,33,578.701 మెట్రిక్‌ టన్నులు (51 శాతం) మాత్రమే సీఎంఆర్‌ ఇచ్చారు. ఇంకా 33 మంది రైస్‌ మిల్లర్ల నుంచి 8,17,294.830 మెట్రిక్‌ టన్నులు బియ్యం రావాల్సి ఉంది. 

 ఈ నెలాఖరు వరకు గడువు పొడిగింపు

రైస్‌మిల్లర్లు కస్టం మిల్లింగ్‌ (సీఎంఆర్‌) పూర్తి చేసేందుకు ఈనెలాఖరు వరకు ప్రభుత్వం మరోసారి గడువు ఇచ్చింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2019-20 సంవత్సరం వాన కాలం సీజన్‌కు అక్టోబర్‌ నుంచి 2020 మార్చి 31 వరకు, యాసంగి సీజన్‌ ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ నెలాఖరులోగా పూర్తవుతుంది. దీనిప్రకారం వాన కాలం సీజన్‌లో ధాన్యం సీఎంఆర్‌ను మార్చి నెలాఖరులోగా, యాసంగి సీఎంఆర్‌ను సెప్టెంబర్‌ నెలాఖరులోగా రైస్‌ మిల్లర్లు పూర్తి చేయాల్పి ఉంటుంది.  త్వరలో వాన కాలం పంట కోతలు మొదలై ధాన్యం కొనుగోళ్లు చేపట్టాల్సి ఉంటుంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు తరలించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న ధాన్యాన్ని త్వరగా మరాడించి ప్రభుత్వానికి బియ్యం అప్పగిస్తే వాన కాలం ధాన్యం నిల్వ చేసుకునేందుకు స్థల ప్రభావ సమస్య ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. 

  గడువులోగా పూర్తి చేయాలి

 గత సంవత్సరానికి సంబంధించిన సీఎంఆర్‌ను గడువులోగా పూర్తి చేయాల్సిందే. అధికారుల ఆదేశాల మేరకు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు మరోసారి గడువు ఇచ్చింది. ప్రతి రోజూ పర్యవేక్షించి ఏ మిల్లు నుంచి ఎంత సీఎంఆర్‌ వస్తుందనే వివరాలు నివేదిస్తున్నాం. ఈ నెల 31వ తేదీలోగా సీఎంఆర్‌ను పూర్తిగా అందించాలని రైస్‌ మిల్లర్లను ఇప్పటికే ఆదేశించాం. గడువులోగా ఇవ్వని రైస్‌ మిల్లర్లపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.

 -ఎస్‌ కృష్ణవేణి, జిల్లా సివిల్‌ సప్లయ్‌ 

కార్పొరేషన్‌ ఇన్‌చార్జి డీఎం