గురువారం 26 నవంబర్ 2020
Warangal-rural - Oct 19, 2020 , 05:41:19

మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్‌ అంబేద్కర్‌

మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్‌ అంబేద్కర్‌

  • జీడబ్ల్యూఎంసీ మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు

న్యూశాయంపేట, అక్టోబర్‌ 18 : మహోన్నత వ్యక్తి డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ అని జీడబ్ల్యూఎంసీ మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు అన్నారు. 32వ డివిజన్‌ దర్గాకాజీపేటలో ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ విగ్రహాన్ని మేయర్‌ ఆదివారం ఆవిష్కరించి మాట్లాడారు. పేద, బడుగుబలహీన వర్గాలకు అంబేద్కర్‌ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మాడిశెట్టి అరుణ, జోరిక రమేశ్‌, అబూబక్కర్‌, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ బన్న అయిలయ్య తదితరులు పాల్గొన్నారు.  

ఇందిరమ్మ కాలనీ సమస్యలు పరిష్కరిస్తా

 వరంగల్‌ : గ్రేటర్‌ 58వ డివిజన్‌లోని గుండ్లసింగారం ఇందిరమ్మ కాలనీలోసమస్యలను పరిష్కరిస్తానని మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు అన్నారు. ఇందిరమ్మ కాలనీవాసులు ఆదివారం మేయర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు, శ్మశానవాటిక లాంటి కనీస వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని  హామీ ఇచ్చారు. కార్పొరేటర్‌ బానోతు కల్పన, సింగూలాల్‌, కాలనీవాసులు నాగెల్లి సునీత, చల్లా అనిత, లీల, సుజాత, రమాదేవి, గౌతమి లక్ష్మి తదితరులు మేయర్‌ను కలిశారు. 

వరదల నివారణకు ప్రత్యేక చర్యలు

 హన్మకొండ : వరదల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతుతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 47వ డివిజన్‌లోని అమరావతినగర్‌, టీవీనగర్‌ తదితర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని తెలిపారు. రూ.వంద కోట్లతో నాలాలపై బ్రిడ్జిల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు స్మార్ట్‌సిటీ, మున్సిపల్‌ నిధులు వెచ్చిస్తామన్నారు. ఈ సమగ్ర ప్రణాళికపై త్వరలో మంత్రి, స్థానిక ఎమ్మెల్యేలతో చర్చించిన తర్వాత పూర్తిస్థాయి నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ రిటైర్డ్‌ ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్‌ నల్లా స్వరూపారాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

    ఆరోగ్యకర జీవనవిధానం అవసరం

వరంగల్‌ చౌరస్తా : ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిఒక్కరికీ ఆరోగ్యకర జీవనవిధానం అవసరమని మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు అన్నారు. వాసవీ క్లబ్‌ వరంగల్‌ ఆధ్వర్యంలో ములుగు రోడ్డులోని వాసవీ మాతా దేవాలయం నుంచి పిన్నావారి వీధిలోని వాసవీ భవన్‌ వరకు ముగింపు 3కే రన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజూ యోగా, వ్యాయామం చేయాలని సూచించారు. 3కే రన్‌లో పాల్గొన్న వాసవీ క్లబ్‌ సభ్యులకు శాలువాలు కప్పి, డ్రై ఫ్రూట్స్‌, పండ్ల రసాలు, స్నాక్స్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో వాసవీ క్లబ్‌ వరంగల్‌ విభాగం సభ్యులు వల్లాల పృథ్వీరాజ్‌, గాదె వాసుదేవ్‌, హరిప్రకాశ్‌, నాగరాజు, సదాశివరావు, నవీన్‌కుమార్‌, శశిధర్‌రావు, గుండా సంతోష్‌కుమార్‌, వెంకటేశ్వర్లు, కిశోర్‌, వీర మల్లయ్య పాల్గొన్నారు.

యువతి వివాహానికి ఆర్థికసాయం

  పేద ఆర్యవైశ్య యువతి వివాహానికి ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు, మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు ఆర్థికసాయం చేశారు. పిన్నావారి వీధికి చెందిన కందిమల్ల మాధవి-రాజయ్య దంపతుల కూతురు భవాని వివాహానికి కల్యాణమస్తు పథకం ద్వారా మంగళసూత్రాలు, మట్టెలు, రూ.2,516 నగదును మేయర్‌ అందజేశారు. చిదిర రమాదేవి, వేముల ప్రవీణ, నిహారిక, లావణ్య, ఆకుతోట అజయ్‌, లక్ష్మణ్‌ పాల్గొన్నారు. 

  శ్వేతార్క ఆలయ కళాతోరణానికి శంకుస్థాపన

కాజీపేట : శ్రీశ్వేతార్క మూల గణపతి దేవాలయ కళా తోరణానికి శంకుస్థాపన చేయడం అదృష్టమని మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు అన్నారు. విష్ణుపురి రహదారిపై కళాతోరణ నిర్మాణానికి ఆయన భూమిపూజ  చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళా తోరణానికి భక్తులు ఆర్థిక చేయూతనివ్వాలని కోరారు. 52, 33 డివిజన్ల కార్పొరేటర్లు జక్కుల రమ, తొట్ల రాజు, ఆలయ వ్యవస్థాపకుడు అయినవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి, వెంకటేశ్వరశర్మ, వేదపండితులు రాధాకృష్ణశర్మ, సాయికృష్ణశర్మ, తిగుళ్ల శ్రీనివాస్‌శర్మ, మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ లక్క రవి, దుర్గం సుధీర్‌, పీఆర్వో మణిదీప్‌ పాల్గొన్నారు.