ఆదివారం 29 నవంబర్ 2020
Warangal-rural - Oct 19, 2020 , 05:19:59

ట్రయల్‌ చేసి.. ట్రైనింగ్‌ ఇచ్చి..

ట్రయల్‌ చేసి.. ట్రైనింగ్‌ ఇచ్చి..

  •  ధరణి పోర్టల్‌పై కలెక్టర్ల కసరత్తు
  •  డమ్మీ పాస్‌బుక్‌లతో రిజిస్ట్రేషన్లు
  •  తహసీల్దార్‌ కార్యాలయాల్లో మొదలైన ప్రక్రియ
  •  ప్రయోగాత్మకంగా పది లావాదేవీలు
  •  చిన్నచిన్న సాంకేతిక సమస్యల గుర్తింపు
  •  క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు

దసరాకు ధరణి పోర్టల్‌ అందుబాటులోకి రానున్న క్రమంలో ఆదివారం ఉమ్మడి జిల్లాలోని పలువురు కలెక్టర్లు ట్రయల్‌ రన్‌ చేశారు. ఈమేరకు తహసీల్దార్‌ కార్యాలయాల్లో డమ్మీ రిజిస్ట్రేషన్లు చేయడంతో పాటు సిబ్బందికి అవగాహన కల్పించారు. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశాల మేరకు ప్రయోగాత్మకంగా పది లావాదేవీలు నిర్వహించడంతో పాటు పలు సాంకేతిక సమస్యలను గుర్తించారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేట తహసీల్దార్‌ కార్యాలయంలో కలెక్టర్‌ ఆర్జీ హన్మంతు, రూరల్‌ జిల్లా సంగెంలో హరిత, జయశంకర్‌ భూపాలపల్లి కలెక్టరేట్‌లో మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌, మహబూబాబాద్‌ జిల్లా కురవి తహసీల్దార్‌ కార్యాలయంలో వీపీ గౌతమ్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పరిశీలించారు.

హన్మకొండ : వ్యవసాయ, వ్యవసాయేతర భూములు రిజిస్ట్రేషన్‌ చేసేందుకు ఏర్పాటుచేసిన ధరణి పోర్టల్‌ ట్రయల్‌ రన్‌ నిర్వహించగా దాదాపు విజయవంతమైంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లావ్యాప్తంగా ఆయా తహసీల్దార్‌ కార్యాలయాల్లో డమ్మీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను నిర్వహించారు. రెవెన్యూ శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలను రూపుమాపేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందించి అమలులోకి తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం వ్యవసాయ భూముల మాదిరిగానే, ఇండ్లు, ఇతర నిర్మాణాలకు కూడా భద్రత కల్పిస్తూ పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించింది. అందుకు ‘ధరణి’ పోర్టల్‌ ద్వారా భూ సమస్యలు అన్ని చక్కదిద్దాలని సర్కారు భావించింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకోవడంతోపాటు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది.

ఈ నెల 25వ తేదీన ‘ధరణి’ పోర్టల్‌ను సీఎం కేసీఆర్‌ అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించి ఏ విధమైన సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు 10 డమ్మీ రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశించారు. దీంతో ఆదివారం తహసీల్దార్‌ కార్యాలయాల్లో ధరణి పోర్టల్‌ ద్వారా పది డమ్మీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. చిన్న చిన్న సమస్యలు తప్ప ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈ సమస్యలతో పెద్దగా ఇబ్బంది ఉండబోదని, త్వరలోనే పరిష్కరించి ఈ నెల 25న సీఎం ప్రారంభిస్తారన్నారు. కాగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు కాజీపేట తహసీల్‌లో డమ్మీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పరిశీలించారు. తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌, ఇతర రెవెన్యూ అధికారులకు ఈ సేవలపై అవగాహన కల్పించారు. రూరల్‌ జిల్లా సంగెం మండలంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో కలెక్టర్‌ హరిత ధరణి ట్రయల్‌ రన్‌ను పర్యవేక్షించారు. నల్లబెల్లిలో అదనపు కలెక్టర్‌ మహేందర్‌రెడ్డి, పరకాలలో ఆర్డీవో లావుడ్య కిషన్‌ పరిశీలించారు.

మహబూబాబాద్‌ జిల్లాలోని కురవి, మరిపెడ తహసీల్దార్‌ కార్యాలయాలను కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ సందర్శించి, డమ్మీ రిజిస్ట్రేషన్లు చేయించారు. గార్లలో ధరణి పోర్టల్‌పై ఈ-సెక్షన్‌ అధికారి అనురాధ సిబ్బందికి అవగాహన కల్పించారు. నెల్లికుదురులో ఇన్‌చార్జి ఆర్డీవో కొమురయ్య ట్రయల్‌ రన్‌ను పరిశీలించారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో అదనపు జేసీ భాస్కర్‌రావు డమ్మీ క్రయవిక్రయాలను తనిఖీ చేశారు. జయశంకర్‌ భూపాలపల్లి కలెక్టరేట్‌లో తహసీల్దార్లు, ధరణి ఆపరేటర్లకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో కలెక్టర్‌ అబ్దుల్‌ అజీం దగ్గరుండి తహసీల్దార్ల తో డమ్మీ రిజిస్ట్రేషన్లు చేయించారు.