శుక్రవారం 30 అక్టోబర్ 2020
Warangal-rural - Oct 18, 2020 , 04:33:50

దసరా నుంచి ‘ధరణి’

దసరా నుంచి ‘ధరణి’

  • 25 నుంచి అందుబాటులోకి సేవలు
  • రంగంలోకి తహసీల్దార్లు, నాయబ్‌ తహసీల్దార్లు
  • డమ్మీ పాస్‌ పుస్తకాలతో  రిజిస్ట్రేషన్లు ప్రారంభం
  • నేడు ప్రతి తహసీల్దార్‌ కార్యాలయంలో పది లావాదేవీలు
  • పోర్టల్‌ పనితీరుపై సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌

వరంగల్‌రూరల్‌, నమస్తేతెలంగాణ/హన్మకొండ : దసరా నుంచి ధరణి పోర్టల్‌ సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే ఈ పోర్టల్‌ ద్వారా వ్యవసాయ, వ్యవసాయేతర భూములు రిజిస్ట్రేషన్‌ చేసేందుకు తహసీల్దార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను సిద్ధం చేసింది. అవసరమైన హార్డ్‌వేర్‌ సౌకర్యాలను సమకూర్చింది. సేవల్లో అంతరాయం కలగకుండా డిస్కం, బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లను అందుబాటులోకి తెచ్చింది. అన్ని తహసీల్దార్‌ ఆఫీసులకు కంప్యూటర్లు, సీసీ టీవీలు, కెమెరాలు, స్కానర్లు, సాధారణ, కలర్‌ ప్రింటర్లు అందజేసింది. పట్టాదారు పాస్‌ పుస్తకాల ముద్రణ కోసం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రింటర్లు ఏర్పాటు చేసింది. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శనివారం హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లు, నాయబ్‌ తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీఆర్డీవోలు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, నాయబ్‌ తహసీల్దార్లకు ధరణి పోర్టల్‌ పనితీరుపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. విజయదశమిని పురస్కరించుకుని ఈ నెల 25న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ను లాంఛనంగా ప్రారంభిస్తారని సోమేశ్‌కుమార్‌ చెప్పారు. ధరణి పోర్టల్‌ సేవలు పారదర్శకం, జవాబుదారీతనం, భద్రత, రక్షణ, సులభతరంగా, విచక్షణాధికారాలు లేకుండా ఉంటాయన్నారు.

ఇది వినూత్నమైనదని, దేశంలోనే ట్రెండ్‌ సెట్టర్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు. తహసీల్దార్లు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్లుగా వ్యవసాయ భూములను, సబ్‌ రిజిస్ట్రార్లు వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేస్తారని స్పష్టం చేశారు. పోర్టల్‌ కార్యకలాపాలకు కావాల్సిన సిబ్బంది, వసతులతో వంద శాతం సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్లకు చెప్పారు. ఆదివారంలోగా తహసీల్దార్లంతా ప్రయోగాత్మకంగా ధరణి పోర్టల్‌ ద్వారా కనీసం పది లావాదేవీలు చేపట్టాలని ఆదేశించారు. వీసీలో అర్బన్‌, రూరల్‌, జనగామ, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు ఆర్జీ హన్మంతు, హరిత, నిఖిల, వీపీ గౌతం, కృష్ణ ఆదిత్య, అబ్దుల్‌ అజీమ్‌ పాల్గొని పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. అన్ని మండలాల్లో 25 నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభానికి ఏర్పాట్లు చేశామన్నారు. ఈ మేరకు తహసీల్దార్లకు రెండు మూడు రోజుల నుంచి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం పలువురు తహసీల్దార్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు పనిచేస్తామని, పోర్టల్‌ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని అభిప్రాయపడ్డారు. 

ఆచరణాత్మక లావాదేవీలు..

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలతో తహసీల్దార్లు, నాయబ్‌ తహసీల్దార్లు రంగంలోకి దిగారు. ధరణి పోర్టల్‌ సేవల కోసం ఆచరణాత్మక లావీదేవీలు చేపట్టారు. వీసీ అనంతరం తహసీల్దార్లు, నాయబ్‌ తహసీల్దార్లతో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు సమావేశమై ఆదివారం ప్రతి తహసీల్దార్‌ ఆఫీసులో పది లావాదేవీలు నిర్వహించాలని చెప్పారు. ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్‌ చేసేందుకు డమ్మీ పట్టాదారు పాస్‌ పుస్తకాలను వారికి అందజేశారు. రాత్రి పొద్దుపోయే వరకు ఆయా జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఈ- డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ ప్రాక్టికల్‌గా రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, అప్‌డేషన్‌ వంటివి తహసీల్దార్లు, నాయబ్‌ తహసీల్దార్ల సమక్షంలో చేశారు. ప్రయోగాత్మకంగా ఆదివారం తమ ఆఫీసులో ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, అప్‌డేషన్‌ చేసేందుకు డమ్మీ పట్టాదారు పాస్‌ పుస్తకాలను వెంట తీసుకెళ్లారు. సాంకేతిక సమస్యలు తలెత్తిన తహసీల్దార్‌ ఆఫీసుల్లో సోమవారం కచ్చితంగా పది లావాదేవీలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.