గురువారం 22 అక్టోబర్ 2020
Warangal-rural - Oct 17, 2020 , 01:57:42

చేపల వేటకు వెళ్లి.. మృత్యు ఒడిలోకి

చేపల వేటకు వెళ్లి.. మృత్యు ఒడిలోకి

  • వాగులో పడి ఒకరు, భద్రకాళి చెరువులో పడి మరొకరు మృతి

నెక్కొండ, అక్టోబర్‌ 16 : వట్టెవాగులో చేపలు పట్టేందుకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందాడు. ఈ ఘటన నెక్కొండ మండలం నాగారంలో శుక్రవారం జరిగింది. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. కేసముద్రం మండలం వెంకటగిరికి చెందిన వాంకుడోతు బాలు-వీరమ్మల చిన్న కొడుకు  వినోద్‌(23) నెక్కొండ మండలం నాగారం శివారులోని వట్టెవాగు వద్దకు చేపలు పట్టేందుకు ఉదయం వెళ్లాడు. చేపలు పట్టే క్రమంలో వాగులో పడి గల్లంతయ్యాడు. వినోద్‌ను తోటి మిత్రులు కాపాడేందుకు యత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. వాగులో గల్లంతైన యువకుడి కోసం రెండు గంటలకు పైగా గాలించారు. ఘటనా స్థలానికి కొద్దిదూరంలో వినోద్‌ శవాన్ని గుర్తించి వాగు నుంచి బయటకు తీసుకువచ్చినట్లు తెలిపారు. శవ పంచనామా చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.  

మట్టెవాడ : నగరంలోని పాపయ్యపేటకు చెందిన ఎండీ ఖలీల్‌(35) భద్రకాళి చెరువు వద్దకు చేపల వేటకు వెళ్లి ఫిట్స్‌ రావడంతో కింద పడిపోయాడు. దీంతో అక్కడున్న వారు ఎంజీఎం దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. అతడి భార్య ఎండీ సల్మా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మట్టెవాడ సీఐ గణేశ్‌ వివరించారు. logo