దుర్గమ్మా.. దీవించమ్మా..!!

- నేటి నుంచి శరన్నవరాత్రోత్సవాలు
- ముస్తాబైన అమ్మవారి ఆలయాలు
- ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు
సకల జగత్తుకు మూలం.. త్రిమూర్తులకు శక్తి ప్రదాత అయిన దుర్గాదేవి నవరాత్రోత్సవాలు శనివారం నుంచి ప్రారం భం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల కోసం ఆలయాలు ముస్తాబయ్యాయి. మహాలయ అమావాస్య మరుసటి రోజు నుంచి విజయదశమి వరకు తొమ్మిది రోజులు.. తొమ్మిది రూపాల్లో దర్శనమివ్వనుండగా దుర్గామాతను పూజిస్తే అంతా శుభం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్తులు పూజించే అమ్మవారి ఒక్కో రూపానికి ఒక్కో ప్రత్యేకత దాగి ఉంది. ఈ సందర్భంగా నవరాత్రి ఉత్సవాల పూజలు, నైవేద్యాలపై ప్రత్యేక కథనం.
- చెన్నారావుపేట/నర్సంపేట రూరల్
తొమ్మిది రోజులు-నైవేద్యాలు..
తొలి రోజు : శైలపుత్రి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈ రోజు పొంగలి లేదా పులగం నైవేద్యంగా అందిస్తారు.
రెండో రోజు : అన్నపూర్ణేశ్వరిగా దర్శనమిస్తారు. చిత్రాన్నం, పులిహోర
మూడో రోజు : చంద్రఘంట అనగా గాయత్రీ శ్రీదేవి రూపంలో అలంకరిస్తారు. కొబ్బరి పాయసం, కొబ్బరి అన్నం నైవేద్యంగా పెడతారు.
నాలుగో రోజు : కూష్మాండ శ్రీమహాలక్ష్మీదేవి అవతారంలో దుర్గామాత దర్శనమిస్తారు. చిల్లులేని గారెలు, మినప సున్నుండలు నైవేద్యంగా పెడతారు.
ఐదో రోజు : ఈ రోజు అమ్మవారిని స్కంధమాత సరస్వతీదేవిగా అలంకరిస్తారు. దద్దోజనం, పెరుగు గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు.
ఆరో రోజు : కాత్యాయనీ శ్రీలలితాదేవి రూపంలో అలంకరిస్తారు. నైవేద్యంగా కేసరిని ప్రసాదంగా పెడతారు. కేసరి బాత్, పెసరుపప్పు పునుగులు
ఏడో రోజు : కాలరాత్రి శ్రీదుర్గాదేవి రూపంలో అలంకరిస్తారు. సప్తమి రోజున అమ్మవారికి కూరగాయలతో కూడిన అన్నం నైవేద్యం పెడతారు.
ఎనిమిదో రోజు : మహాగౌరీ శ్రీమహిషాసురమర్ధిని గా అలంకరిస్తారు. రవ్వతో చేసిన చక్కెర పొంగలి, మినప గారెలు, హల్వాను ప్రసాదంగా పెడతారు.
తొమ్మిదో రోజు : సిద్ధిదాత్రి శ్రీరాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తారు. ఆరోజు పాయసానికి ప్రత్యేకం. సేమియా పాయసం, క్యారెట్ పా యసం, కొబ్బరి గసగసాల పాయ సం, అన్నం పరమాన్నం, పెసరపప్పు పాయసం, కొబ్బరి పాల పాయసాన్ని భక్తులు ప్రసాదంగా సమర్పిస్తారు.
దుర్గామాత అవతారం..
పూర్వం దుర్గుడు అనే అసురుడు(రాక్షసుడు) దేవతలను హింసించేవాడు. అతడిని అంతం చేసేందుకు దేవతలందరి శక్తి సరిపోలేదు. అందరూ కలిసి సర్వరూపాలకు అధిపతిగా శ్రీదేవి-దుర్గాదేవిని సృష్టించారు. శివుడి నుంచి శిరస్సు, విష్ణువు భుజాలు, బ్రహ్మ చరణాలు, ఇంద్రుని నడుము, వరుణుడి తొడలు, కుభేరుడి నాసిక, చంద్రుడి శిరోజాలు, పృథ్వీ పిరుదులు, యముడి కేశాలతో దుర్గామాత అవతరించి ఆ రాక్షసుడిని వధించింది.
బాలా త్రిపురసుందరి :
భారతి, భాగ్యవి, భవానీ అంశతో ఉద్భవించిన బాలా త్రిపుర సుందరిని ఆది శక్తిగా పిలుచుకుంటారు. సకల చరాచర సృష్టి, స్థితి, లయలను పర్యవేక్షిస్తుంది. లక్ష్మీ, పార్వతీ, సరస్వతీ ఈ ముగ్గురి అంశలను కలిగి ఉన్నదే బాలా త్రిపుర సుందరి. ఈ అమ్మవారిని పూజిస్తే మంచి జరుగుతుందని ప్రతి ఒక్కరి నమ్మకం.
అన్నపూర్ణాదేవి
అన్నపూర్ణాదేవి కాశీలో కొలువై ఉంటుంది. తన శక్తితో ఆ ప్రాంతంలోని వారందరికీ ఆకలి బాధ లేకుండా చూస్తుందనేది అక్కడి వారి నమ్మకం. జీవ కోటికి అవసరమైన ఆహారాన్ని ఆ అమ్మవారే అందిస్తుందం టారు. అన్నపూర్ణ రూపంలో ఉన్న అమ్మవారిని కొలిస్తే పంటలు సమృద్ధిగా పండుతాయని మరో నమ్మకం.
గాయత్రీదేవి
గాయత్రీ మంత్రంలో 24మంది దేవతల బీజాక్షరాలు ఉన్నాయి. ఈ బీజాక్షరాలను పఠించడం వల్ల మనిషి తేజో సంపన్నుడై సంఘంలో గుర్తింపు వస్తుంది. సమస్త వేద పారాయణిగా గాయత్రీ మాతకు మంచి పేరుంది. ఈ మంత్రం పఠిస్తే తిరుగు ఉండదంటారు. అంతేగాక సకల సౌఖ్యాలు కలుగుతాయనేది ప్రతి ఒక్కరి విశ్వాసం.
లక్ష్మీదేవి
క్షీరసముద్రరాజ తనయగా పద్మం నుంచి జన్మించిన తల్లిగా సర్వలోకాలకు బ్రహ్మాది దేవతలకు ఆరాధ్య రూపంగా లక్ష్మీదేవి కొలువబడు తోంది. ప్రతీ ఒక్కరి జీవితం లక్ష్మీ కటాక్షంపైనే ఆధారపడి ఉంటుందనేది నిజం. ధనం లేకపోతే బతుకు ఎంత దుర్భరమో చెప్పనక్కరలేదు. అందుకే అందరూ లక్ష్మీదేవిని పూజిస్తారు.
సరస్వతీదేవి :
సరస్వతీ సమస్తుభ్యం.. వరదే కామరూపిని అని చదువుతాం. విద్యకు మూలం సరస్వతీ దేవి. అమ్మవారి ఆశీస్సులు లేనిదే ఎవ్వరూ జ్ఞానులు కాలేరు. సకల విద్యాపారాయిణిగా ఆమె వెలుగొందింది. బాసరలోని సరస్వతీదేవి ఆలయం అందుకే భక్తులచే కొలవబడుతోంది. విద్యాసంపద కలుగాలని నవరాత్రుల సందర్భంగా సరస్వతీదేవిని కొలుస్తారు.
లలితాదేవి..
బండాసురుని సంహరించిన శక్తిగా శ్రీ లలితా దేవి అమ్మవారిని కొలుస్తారు. బండ అంటే మొద్దుబారుడు తనం. ఈ దేవిని పూజిస్తే మనిషిలో ఇలాంటి మొద్దుబారు డుతనం(సోమరితనం) పోతుందని నమ్మకం. అంతేగాక ఆత్మజ్ఞానం పెరుగుతుంది. మనిషిలో మొద్దుబారుడుతనం పోవడానికి శ్రీలలితా దేవిని భక్తులు ఎంతగానో పూజిస్తారు.
మహిషాసురమర్దిని :
శంభని శుంభ సంహారిణి, మధుకైట భనాశిని, బండా సురశినాశిని.. ఆ పేర్లు రాక్షసత్వానికి చెందినవి. నిజానికి ఈ పేర్లతో రాక్షసులెవరూ లేరు. కానీ ఈపేర్ల గుణాలు మాత్రం కొందరు మనుషు ల్లో మాత్రం ఉం టాయి. వాటినే తా మసరజోగుణాలని అంటారు. వీటిని జయించేందుకు మహిషాసుర మర్దినిని పూజిస్తారు.
రాజరాజేశ్వరీ దేవి..
ప్రాణకోటి రక్షణకు రాజరాజేశ్వరిగా అమ్మవారు ఉద్భవించారు. ఈ రూపంలో అమ్మవారిని కొలిస్తే సకల సౌఖ్యాలతో పాటు ధన ప్రాప్తి కలుగుతుందనేది భక్తుల నమ్మకం.
తాజావార్తలు
- ఐటీ అభివృద్ధికి బ్లూప్రింట్
- క్షిపణి సాంకేతికతలో ఆత్మ నిర్భరత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- అవార్డుతెచ్చిన ‘అమ్మమ్మ’ ఆవిష్కరణ
- 20.41 కోట్లతో దివ్యాంగులకు ఉపకరణాలు
- వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల ఆదేశం
- ప్లాస్మా పొడితో ప్రతిరక్షకాలు
- 20 వేల ప్రైవేట్ వైద్యసిబ్బందికి టీకా
- ఏపీ ‘పంచాయతీ’కి సుప్రీం ఓకే
- సత్యలోకం కోసం బలి!
- 8 ఎకరాల్లో పీవీ విజ్ఞానవేదిక