బుధవారం 20 జనవరి 2021
Warangal-rural - Oct 06, 2020 , 04:42:03

రైతు వేదిక నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి : కలెక్టర్‌

రైతు వేదిక నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి : కలెక్టర్‌

నర్సంపేట రూరల్‌, అక్టోబర్‌ 5 : జిల్లాలో చేపట్టిన రైతు వేదిక భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ హరిత అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. సోమవారం మండలంలోని గురిజాలలో నిర్మాణంలో ఉన్న రైతు వేదిక భవనాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. నిధులను సద్వినియోగం చేసుకుని త్వరితగతిన రైతు వేదిక నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ఎలాంటి అలసత్వం వహించొద్దన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో పవన్‌కుమార్‌, ఏడీఏ తోట శ్రీనివాసరావు, డీఎల్‌పీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌ వాసం రా మ్మూర్తి, ఎంపీడీవో అజ్మీరా నాగేశ్వరరావు, ఎంపీవో అంబటి సునీల్‌కుమార్‌రాజ్‌, ఆర్‌ఐ గునిగంటి రాజ్‌కుమార్‌, సర్పంచ్‌ గొడిశాల మమత, రైతుబంధు సమితి గ్రామ కన్వీనర్‌ అన్న కో మల, పంచాయతీ కార్యదర్శి రాజమౌళి పాల్గొన్నారు. 

ఈనెల 9లోగా ప్రజలు తమ ఆస్తుల వివరాలను సంబంధిత అధికారులకు అందించాలని కలెక్టర్‌ అన్నారు. గురిజాలలో జరుగుతున్న ఆస్తుల వివరాల నమోదు కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. వివరాల నమోదుకు వచ్చే అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు. అలాగే గ్రామంలోని పలు ప్రధాన వీధుల్లో పారిశుధ్య పనులను కలెక్టర్‌ పరిశీలించారు.  

దుగ్గొండి : ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ హరిత అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని గిర్నిబావిలో జరుగుతున్న ఆస్తుల నమోదు ప్రక్రియను కలెక్టర్‌ పరిశీలించారు. ఆస్తుల నమోదులో కుటుంబసభ్యుల పూర్తి వివరాలను పారదర్శకంగా నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీధర్‌గౌడ్‌, తహసీల్దార్‌ జగన్‌మోహన్‌రెడ్డి, సర్పంచ్‌ కూస సమతారాజు, జీపీ కార్యదర్శి రాజు, జీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూరు : మండల కేంద్రంలోని సమాధుల స్థలంలో విలేజ్‌ పార్క్‌ ఏర్పాటు చేయవద్దని గ్రామస్తులు కలెక్టర్‌ను కోరా రు. సోమవారం వారు మాట్లాడుతూ.. గతంలో ఈ స్థలాన్ని ఆత్మకూరు, తిరుమలగిరి గ్రామానికి చెందిన వారు శ్మశానవాటికగా కోసం వాడుకున్నారని, అధికారులు, ప్రజాప్రతినిధులు హడావుడిగా ఆ స్థలాన్ని విలేజ్‌ పార్కు ఏర్పాటు కోసం చదును చేస్తున్నారన్నారు. పార్క్‌ ఏర్పాటు స్థలాన్ని మార్చాలని వారు కోరారు.

గీసుగొండ : 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు నులి పురుగుల నివారణ మాత్రలు వేయించాలని కలెక్టర్‌ హరిత అన్నారు. మండలంలోని ధర్మారం ప్రాథమిక హెల్త్‌ సబ్‌సెంటర్‌లో నులి పురుగుల నివారణ మాత్రలను చిన్నారికి వేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి చల్లా మధుసూదన్‌, డీఎల్‌వో ప్రకాశ్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో గోపాల్‌రావు, ప్రోగ్రాం అధికారి అశ్విని, వైద్యాధికారి మాధవీలత పాల్గొన్నారు.


logo