బుధవారం 20 జనవరి 2021
Warangal-rural - Oct 06, 2020 , 04:06:43

పేదింటికి పెద్దకొడుకు కేసీఆర్‌

పేదింటికి పెద్దకొడుకు కేసీఆర్‌

 •  ఇంటింటికీ సంక్షేమ ఫలాల అందజేత
 •  ‘ఆత్మగౌరవ’ నినాదమే ముఖ్యమంత్రి విధానం
 •  ప్రజాదరణ చూసి ప్రతిపక్షాల కండ్లు మండుతున్నయ్‌
 • నూతన రెవెన్యూ చట్టంతో రైతులకు పట్టాభిషేకం  
 • ఇక భూముల సమస్యలు ఉండవు..
 • ఆస్తుల భద్రతకే వ్యవసాయేతర పట్టా పాస్‌పుస్తకాలు
 • అన్నదాతల నోట్లో మట్టికొట్టేలా కేంద్ర పథకాలు
 •  రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
 • రాయపర్తి మండలంలో సుడిగాలి పర్యటన
 •  ‘డబుల్‌' ఇండ్లకు శంకుస్థాపన.. బతుకమ్మ తల్లి విగ్రహావిష్కరణ
 • తొర్రూరులో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ

రాయపర్తి/ పెద్దవంగర (తొర్రూరు) : ప్రతి పేదింటికి పెద్ద కొడుకులా మారి సీఎం కేసీఆర్‌ ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండలంలో సోమవారం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లకు శంకుస్థాపన చేయడంతో పాటు బతుకమ్మ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు డివిజన్‌ కేంద్రంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు, పట్టదారు పాస్‌ పుస్తకాలను పంపిణీ చేశారు. రాయపర్తి మండలం బంధన్‌పల్లి, కొత్తూరు, గట్టికల్‌, ఊకల్‌, బాలాజీ తండా గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటించారు. బంధన్‌పల్లి పంచాయతీ ఆవరణలో గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణాలు ఎందుకు చేపట్టలేదో అడిగి తెలుసుకున్నారు. పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి బతుకమ్మ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కొత్తూరు పంచాయతీ ఆవరణలో గ్రామస్తులతో మాట్లాడుతూ డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను ఎస్సీ కాలనీవాసులకే కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఎస్సీలంతా ఐక్యతతో ముందుకు సాగి ఇండ్లను వేగవంతంగా పూర్తి చేయించుకోవాలని సూచించారు. గట్టికల్‌లో నిర్మాణంలో ఉన్న ఇండ్ల సముదాయాన్ని పరిశీలించి గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. ఊకల్‌లో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. బాలాజీ తండాకు మంజూరైన 25 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పనులకు తండాకు చెందిన మహబూబాబాద్‌ ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్‌తో కలిసి భూమిపూజ చేశారు.

ఆయా గ్రామాల్లో మంత్రి మాట్లాడుతూ సీమాంధ్రుల పాలనలో తెలంగాణను చిన్నచూపు చూస్తూ ఇక్కడి ప్రజలను పట్టించుకోకపోవడం మూలంగానే సీఎం కేసీఆర్‌ ఆత్మగౌరవాన్ని చంపుకోలేక టీఆర్‌ఎస్‌ పార్టీకి పురుడు పోశారని గుర్తు చేశారు. తెలంగాణలో ప్రజలంతా ఆత్మగౌరవంతో బతకాలన్న అభిమతంతో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆధునిక హంగులు, సకల సౌకర్యాలతో కడుతున్న డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను చూస్తుంటేనే పేదల కడుపులు నిండుతున్నాయన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి సబ్బండ వర్గాల నుంచి వస్తున్న విశేష ఆదరణను చూసి ప్రతిపక్షాల కండ్లు మండుతున్నాయని ఎద్దేవా చేశారు. కొత్త రెవెన్యూ చట్టంతో అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాభిషేకం చేసిందన్నారు. ఇండ్లు, పల్లె ప్రగతి పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. logo