మంగళవారం 24 నవంబర్ 2020
Warangal-rural - Oct 02, 2020 , 06:21:48

దసరా నుంచి పత్తి కొనుగోళ్లు

దసరా నుంచి పత్తి కొనుగోళ్లు

  • పక్కా ప్రణాళికతో సర్కారు ముందుకు
  •  ప్రభుత్వ ఆదేశాలతో మార్కెటింగ్‌ శాఖ ముందస్తు ఏర్పాట్లు
  • జిన్నింగ్‌ మిల్లుల గుర్తింపు.. కొవిడ్‌ నివారణకు ప్రత్యేక చర్యలు
  • క్వింటాలుకు రూ.5825 మద్దతు ధర
  •  48 గంటల్లో రైతు ఖాతాలో డబ్బులు
  • 8 నుంచి 12శాతం తేమకు అనుమతి
  •  ‘నియంత్రిత’ విధానంతో పెరిగిన సాగు
  •  రూరల్‌ జిల్లాలో 2,03,794, అర్బన్‌లో 82,854 ఎకరాలు
  • గతంతో పోలిస్తే రెండింతలు
  • భారీగా దిగుబడి వచ్చే అవకాశాలు

నియంత్రిత విధానానికి జై కొట్టిన రైతాంగం, ఈ సారి మక్కను పూర్తిగా పక్కనబెట్టి గణనీయంగా పత్తి సాగు చేసింది. ఈ యేడు దిగుబడులు ముంచెత్తనున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తుగా కొనుగోళ్లకు అధికారయంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. దసరా నుంచి కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ద్వారా ‘తెల్లబంగారా’న్ని కొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మేరకు జిల్లాల్లో జిన్నింగ్‌ మిల్లులను గుర్తించి మౌలిక వసతులు కల్పిస్తున్నది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే పత్తిని కొనేలా చర్యలు తీసుకుంటున్నది.

- వరంగల్‌ రూరల్‌, నమస్తే తెలంగాణ/ వరంగల్‌ సబర్బన్‌

వరంగల్‌ రూరల్‌, నమస్తే తెలంగాణ/ వరంగల్‌ సబర్బన్‌ : ఈ యేడాది రైతులు పండించిన పత్తి పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది. క్వింటాలుకు మద్ద ధర రూ.5825 చెల్లించి జిన్నింగ్‌ మిల్లుల్లోనే పత్తి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండి యా (సీసీఐ) సన్నాహాలు చేస్తున్నది. నియంత్రిత సాగు తో ఈ సారి పత్తి సాగు గణనీయంగా పెరిగింది. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో గతేడాది 1,73,770 ఎకరాల్లో పత్తి సాగు కాగా, ఈ ఏడాది 2,03,794 ఎకరాలకు పె రిగింది. సుమారు 18,84,590 క్వింటాళ్ల పత్తి దిగుబడులు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వే శారు. అర్బన్‌ జిల్లాలో 82,854 ఎకరాల్లో పత్తి వేశారు. సాగు పెరిగిన నేపథ్యంలో వ్యాపారులు కొనకుంటే త మ పరిస్థితి ఏంటని రైతుల్లో ఒకింత అనుమానాలు నెలకొన్నాయి. పత్తి ఏరి అమ్మేందుకు సమాయత్తమవుతు న్న తరుణంలో వారి అనుమానాలను పటాపంచలు చే స్తూ ప్రభుత్వం ముందస్తు కొనుగోళ్లకు ప్రణాళికలు వే సింది. అధికారులను రంగంలోకి దింపింది.            

జిన్నింగ్‌ మిల్లుల గుర్తింపు..

అర్బన్‌ జిల్లాలో 52 వేల మంది రైతులు 82,854 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. వర్షధార సాగులో ఎకరాకు నాలుగు క్వింటాళ్లు, నీటి ఆధారంగా 11క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేశా రు. జిల్లాలో మొత్తం 79వేల మెట్రిక్‌ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని మార్కెటింగ్‌ శాఖకు నివేదిక ఇచ్చారు. ఈ మేరకు మార్కెటింగ్‌ శాఖ 28 జిన్నింగ్‌ మిల్లులను గుర్తించి సీసీఐకి నివేదిక ఇచ్చింది. రూరల్‌ జిల్లాలో పత్తి కొనుగోలుకు జిల్లా స్థాయిలో కమిటీ వేసి, పక్కా ప్రణాళికలు రూపొందించారు. కలెక్టర్‌ హరిత చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీకి మార్కెటింగ్‌ శాఖ జిల్లా అధికారి పాలకుర్తి ప్రసాదరావు కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. వ్యవసా య, అగ్ని మాపక, తూనికల కొలతలు, ఎన్పీడీసీఎల్‌, రవాణా, పోలీస్‌ అధికారులు కమిటీలో సభ్యులుగా ఉ న్నారు. ఇటీవలే కమిటీ సభ్యులతో అదనపు కలెక్టర్‌ మ హేందర్‌రెడ్డి సమావేశం నిర్వహించి మరో పదిహేను రో జుల్లో రైతులు పత్తి దిగుబడులు అమ్మేందుకు మార్కెట్‌ కు తెచ్చే అవకాశమున్నందున కొనుగోళ్లపై చర్చించారు. రూరల్‌ జిల్లాలో ఈ ఏడాది పది సెంటర్లు ఏర్పాటు చే యాలని నిర్ణయించారు. పరకాల, నెక్కొండలో మూడు చొప్పున, నర్సంపేట, వర్దన్నపేటలో రెండు చొప్పున కేంద్రాల ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు.       

మద్దతు ధర రూ.5825.. 

కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే మద్దతు ధర విషయంలో ఈ సారి పత్తి పంటపై చిన్న చూపే చూసింది. గతేడాది క్వింటాలుకు రూ.5550 ఇవ్వగా ఈ సారి కేవ లం రూ.275 పెంచి రూ.5825గా నిర్ణయించింది. సీసీ ఐ నిబంధనల మేరకు పత్తిని తీసుకొస్తే మద్దతు ధర పొందవచ్చు. పత్తిలో తేమ శాతం 8 నుంచి 12 వరకే అనుమతిస్తారు. బస్తాల్లో కాకుండా లూజుగానే తేవాల్సి ఉంటుంది. మిల్లులోకి వెళ్లే ముందు, తిరిగి దిగుమతి అయ్యేటప్పుడు తేమను పరీక్షిస్తారు. రెండు సార్లు తేమ శాతం తేడా లేకుండా ఉంటేనే అనుమతిస్తారు. 8 శా తం తేమ వరకే పూర్తి మద్ధతు ధర ఉంటుంది. ఒక్కో శాతం పెరిగే కొద్దీ రూ.52.50 ధర తగ్గుతుంది. 12 శా తం కంటే ఎక్కువ ఉంటే పత్తిని కొనరు. 

ఆన్‌లైన్‌లో చెక్‌ చేసుకోవాల్సిందే..

సంబంధిత జిన్నింగ్‌ మిల్లుల్లో అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. తూనికలు, కొలతలు, ఫైర్‌ సేప్టీ అధికారులు ఆయా మిల్లులను తనిఖీ చేసి భద్రతా ప్ర మాణాలు పరిశీలిస్తారు. దసరా నుంచి కొనుగోళ్లు మొ దలు కానున్నాయి. రైతులు విధిగా భూమి పట్టాదారు పాస్‌ పుస్తకం, బ్యాంకు ఖాతా పాస్‌ బుక్కు మొదటి రెం డు పేజీలు, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీలను వెంట తెచ్చుకోవాలి. అమ్మకానికి ముందే స్థానిక వ్యవపాయ శాఖ కార్యాయానికి వెళ్లి తమ పంటను ఆన్‌లైన్‌లో నమోదు చేశారా? లేదా?, చేసిఉంటే ఎంత పంట అమ్మేందుకు అర్హత ఉందో తెలుసుకొని వెళ్లాలి. వ్యవసాయ శాఖ జా బితాలో రైతు పేరు లేకుంటే కొనడం వీలుకాదు. చెల్లుబాటయ్యే బ్యాంకు ఖాతానే తేవాలి. జన్‌ధన్‌ ఖాతాను అంగీకరించరు. అన్ని కేంద్రాల్లో కొవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి రెండు రోజులకోసారి సోడియం హైపో క్లోరైట్‌తో మిల్లును శుద్ధి చేస్తారు. పత్తి కొనుగోలు చేసిన 48గంటల్లో రైతు ఖాతా లో డబ్బు జమచేయనున్నారు.       

నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

- పాలకుర్తి ప్రసాదరావు, డిప్యూటీ డైరెక్టర్‌, మార్కెటింగ్‌ శాఖ
రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించి పత్తిని మిల్లులకు తేవాలి. తేమ 8శాతం లోపు ఉంటేనే మద్దతు ధర లభిస్తుంది. పెరిగే కొద్దీ ధర తగ్గుతుంది. 12శాతం దాటితే సీసీఐ కొనదు. రైతులు ఇది గమనించి పత్తిని ఆరబెట్టి తేవాలి. అర్బన్‌ జిల్లాలో 28, రూరల్‌లో 10మిల్లులు ఎంపిక చేశాం. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నాం.