శుక్రవారం 30 అక్టోబర్ 2020
Warangal-rural - Sep 30, 2020 , 00:56:03

ఆన్‌లైన్‌లో చేనేత బిజినెస్‌

ఆన్‌లైన్‌లో చేనేత బిజినెస్‌

కాలానుగుణంగా వ్యాపార ధోరణిలోనూ మార్పు వస్తున్నది. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో ఏ చిన్న వ్యాపారానికైనా ఆన్‌లైనే వేదిక అవుతున్నది. ప్రస్తుతం నేతన్నలు సైతం కొత్త సాంతికేతికను అందిపుచ్చుకుంటూ చేనేత ఉత్పత్తులతో ఆన్‌లైన్‌లో ఈజీగా బిజినెస్‌ చేస్తున్నారు. తాము నేసిన కార్పెట్లు, డోర్‌ మ్యాట్స్‌, కలంకారి మ్యాట్స్‌, యోగా మ్యాట్స్‌.. ఇలా డిమాండ్‌ ఉన్న వాటిపై వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ ద్వారా ప్రచారం చేస్తూ విదేశాల నుంచీ ఆర్డర్లు పొందుతున్నారు. పోస్టాఫీస్‌, కొరియర్‌ ద్వారా ఉత్పత్తులను చేరవేస్తూ అతి తక్కువ కాలంలోనే ఆరు లక్షల వ్యాపారం చేసినట్లు కొత్తవాడ నేతన్నలు తెలిపారు.- పోచమ్మమైదాన్‌

కాలంతో నేతన్నలు పోటీపడుతున్నారు. తాము తయారుచేసిన ఉత్పత్తులకు ఇక్కడే గాక విదేశాల్లోనూ డిమాండ్‌ ఉండడంతో వాటికి ఎలాగైనా ప్రచారం చేయాలనుకున్నారు. దీనికి ఆన్‌లైన్‌ వ్యాపారమే మార్గమని భావించి ప్రస్తుతం క్షణాల్లో సమాచారం చేరవేసే వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ను ఎంచుకున్నారు. అందులో ఫొటోలు, మోడల్‌, ధరతో పాటు నాణ్యత వివరాలను చేర్చి ఫార్వర్డ్‌ చేసేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సంఘాల్లో నిల్వ ఉన్న ఉత్పత్తుల కొనుగోలు ప్రక్రియ చేపట్టినా, చిన్న చిన్న కార్మికులు తాము నేసిన ఉత్పత్తులతో చిరు వ్యాపారం చేస్తున్నారు. చిల్లర, యారన్‌ కొనుగోలు ఖర్చుల కోసం ఉపయోగపడుతున్నదని చెబుతున్నారు.  

పోస్టాఫీస్‌, కొరియర్‌ ద్వారా చేరవేత..

చిరు చేనేత వ్యాపారానికి పోస్టాఫీస్‌, కొరియర్‌ సర్వీసులు అండగా నిలుస్తున్నాయి. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా తాము తయారుచేస్తున్న కార్పెట్లు, డోర్‌ మ్యాట్స్‌, కలంకారి మ్యాట్స్‌, యోగా మ్యాట్స్‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తున్నారు. డబ్బులను గూగుల్‌ పే, ఫోన్‌పే ద్వారా పంపుతుండడంతో వినియోగదారులు కోరిన విధంగా వాటిని ప్యాక్‌ చేసి పోస్టాఫీస్‌, కొరియర్‌ సర్వీసు పార్సిల్‌ ద్వారా చేరవేస్తున్నారు. సర్వీసు చార్జీలు కూడా వినియోగదారులు భరిస్తుండడంతో కార్మికులపై ఎలాంటి భారం పడడం లేదు. దీని వల్ల పరోక్షంగా పోస్టాఫీస్‌లు, కొరియర్‌ సంస్థలకూ ఆదాయం చేకూరుతున్నది.  

దేశ, విదేశాల్లో పెరుగుతున్న డిమాండ్‌..

దేశ, విదేశాల్లో చేనేత ఉత్పత్తుల డిమాండ్‌ నేత కార్మికులకు కలిసి వస్తున్నది. ఎలాంటి బేరసారాలకు తావు లేకుండా ముందుగానే ప్రైజ్‌ లిస్ట్‌ పంపుతున్నారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, బెంగళూరు, చెన్నై, పుణె, షోలాపూర్‌తో పాటు దుబాయ్‌, యూఎస్‌ఏ ప్రాంతాల్లో చేనేత విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. స్వదేశంలోని ప్రాంతాలకు మూడు రోజులు, ఇతర దేశాలకు వారం రోజులు పడుతున్నది.

చేనేత కార్మికులకు భరోసా..

ఆన్‌లైన్‌ ద్వారా చేస్తున్న చిరు వ్యాపారం నేత కార్మికులకు ఊరటనిస్తున్నది. కార్మికులు తయారు చేసిన ఉత్పత్తులు ఎప్పటికప్పుడు అమ్ముకునేందుకు వీలు కలుగుతున్నది. కొత్తవాడలో 20మంది కార్మికులు పోస్టాఫీస్‌, డీఎస్‌ఎల్‌ కొరియర్‌ ద్వారా ఉత్పత్తులను పంపుతున్నారు. కరోనా కాలంలో జరిపిన విక్రయాలు వీరికి ఆర్థికంగా తోడ్పడ్డాయి. మూడు నెలల కాలంలో దాదాపు రూ.6 లక్షల వ్యాపారం జరగడం మాకెంతో ఆనందంగా ఉంది. ప్రభుత్వ కొనుగోళ్లతో పాటు ఇలాంటి చిన్న వ్యాపారాలతో నేతన్నలకు భరోసా ఉంటుంది. - చిప్ప వెంకటేశ్వర్లు, హ్యాండ్లూమ్‌ వీవర్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షుడు