శుక్రవారం 30 అక్టోబర్ 2020
Warangal-rural - Sep 30, 2020 , 00:49:08

హరిహర క్షేత్రానికి కొత్త హంగులు

హరిహర క్షేత్రానికి కొత్త హంగులు

పాలకుర్తి రూరల్‌ : జనగామ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సోమేశ్వరాలయం రాష్ట్ర ప్రభుత్వ చొరవతో అభివృద్ధికి నోచుకున్నది. పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి కృషితో ఇప్పటికే ఆలయం చుట్టూ సీసీరోడ్డు, సెంట్రల్‌ లైటింగ్‌, గోపురం, సాలహారం నిర్మించగా ప్రస్తుతం రూ.70లక్షలతో గిరి ప్రదక్షిణ, ప్రధాన రోడ్డు పనులతో కొత్త హంగులు అద్దుకుంటున్నది. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంత్రి కాలినడకన గిరి ప్రదక్షిణ చేసిన సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీసీరోడ్డు కోసం డీఎంఎఫ్‌టీ నిధులు మంజూరు చేయించారు. జనగామ జిల్లా కలెక్టర్‌ నిఖిల, ఆర్‌అండ్‌బీ శాఖ ఎస్‌ఈ అల్లమనేని నాగేందర్‌రావు పర్యవేక్షణలో పనులు చురుగ్గా సాగుతున్నాయి.

యాదాద్రి తరహాలో తీర్చిదిద్దుతా..

హరిహరుల నిలయం, సుప్రసిద్ధ శ్రీ సోమేశ్వరాలయాన్ని యాదాద్రి తరహాలో తీర్చిదిద్దుతా. ఇప్పటికే రూ.50లక్షలతో గోపురం, సాలహారంతో పాటు పలు పనులను చేపట్టాం. పెండింగ్‌లో ఉన్నవి త్వరలో పూర్తి చేస్తాం. గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ(ప్రభ బండ్లు తిరుగడం కోసం)కు డబుల్‌ రోడ్డు మంజూరు చేయించా. పనులు జరుగుతున్నాయి. పాలకుర్తి ప్రాంతాన్ని పర్యాటక రంగంగా తీర్చిదిద్దుతా. - ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి 

మంత్రి సహకారం వల్లే..

మంత్రి దయాకర్‌రావు సహకారంతో ఆలయం అభివృద్ధి చెందుతున్నది. గతంలో ఆలయ గోపురం, సాలహారం, ఆలయం చుట్టూ సీసీ రోడ్డు, సెంట్రల్‌ లైటింగ్‌ పనులు చేపట్టి పూర్తి చేశాం. ప్రస్తుతం ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ కోసం రోడ్డు పనులకు రూ.70లక్షలు మంజూరు చేశారు. పనులు పూర్తి కావస్తున్నాయి.- మేకల వీరస్వామి, ఈవో పాలకుర్తి

కొత్త కళ వచ్చింది..

తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ పాలనలోనే ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయి. సమైక్య పాలనలో ఈ ఆలయాన్ని అస్సలు పట్టించుకోలేదు. మంత్రి ఎర్రబెల్లి సుమారు రూ.2కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. భక్తుల రాక పెరిగింది. వ్యాపారాలు బాగా నడుస్తోంది. ఆలయం కళకళలాడుతున్నది. - సింగ మహేందర్‌రాజు, భక్తుడు, పాలకుర్తి