బుధవారం 25 నవంబర్ 2020
Warangal-rural - Sep 30, 2020 , 00:44:21

ఇక స్మార్ట్‌గా రైల్వేస్టేషన్‌ జంక్షన్‌

ఇక స్మార్ట్‌గా రైల్వేస్టేషన్‌ జంక్షన్‌

వరంగల్‌ : వరంగల్‌ రైల్వేస్టేషన్‌ జంక్షన్‌ ఇక కొత్తరూపు సంతరించుకోనుంది. నిత్యం వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే ప్రాంతాన్ని స్మార్ట్‌సిటీలో భాగంగా అభివృద్ధి చేసేందుకు ‘గ్రేటర్‌' అధికారుల బృందం ప్రణాళికలు రూపొందిస్తున్నది. శిథిలావస్థకు చేరి, అధ్వానంగా మారిన షాపింగ్‌ కాంప్లెక్స్‌, మున్సిపల్‌ కాంప్లెక్స్‌ వెనుక నిరుపయోగంగా ఉన్న పార్క్‌ స్థలంలో కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మించనుంది. ఆర్టీసీ బస్‌స్టేషన్‌తో పాటు అక్కడి రహదారులను తీర్చిదిద్దనుండడంతో బల్దియాకు ఆదాయమూ సమకూరనుంది.

రైల్వేస్టేషన్‌ జంక్షన్‌లో దశాబ్దాల కాలం క్రితం నిర్మించిన బల్దియా షాపింగ్‌ కాంపెక్స్‌ శిథిలావస్థకు చేరుకోగా అందులో కొన్ని షట్టర్లు ఖాళీగానే ఉంటున్నాయి. దీంతో కార్పొరేషన్‌కు ఆదాయం కూడా రావడం లేదు. అదీగాక పక్కనే ఉన్న రైల్వేస్టేషన్‌కు దేశ, విదేశాల నుంచి వేలాది మంది ప్రయాణికులు వచ్చి వెళ్తుంటారు. చారిత్రక నేపథ్యమున్న నగరంలోకి అడుగుపెట్టగానే అధ్వానమైన జంక్షన్‌, శిథిలావస్థలో ఉన్న కాంప్లెక్స్‌లు దర్శనమిస్తుండడంతో నగరం ప్రతిష్ట మసకబారే పరిస్థితి ఉందని భావిం చి అందంగా తీర్చిదిద్దబోతున్నారు. అందుకే పాత కాంప్లెక్స్‌ను కూల్చేసి ఆ స్థానంలో కొత్తగా కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణంతో పాటు అందులోనే హోటల్‌, రెస్టారెంట్‌, ఉండేలా ప్రణాళికలు రూ పొందిస్తున్నారు.  మున్సిపల్‌ కాంప్లెక్స్‌ వెనుక ఉన్న పార్క్‌ నిరుపయోగంగా ఉంది. రెవెన్యూ శాఖకు చెందిన ఈ 22 గుంటల స్థలంలో కొంత భాగంలో పార్కు ఉండగా దీనిని మున్సిపల్‌ శాఖకు అప్పగిస్తే అందులో కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మించాలని అధికారులు యోచిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన కూడలిని అనుసంధానం చేసే రహదారులు అభివృద్ధి చెందుతున్నాయి. స్మార్ట్‌సిటీలో భాగంగా ఆర్టీసీ బస్‌స్టేషన్‌ను కూడా అభివృద్ధి చేయబోతున్నారు.

కాంప్లెక్స్‌ నిర్మాణంతో నయా లుక్‌..

వరంగల్‌రైల్వేస్టేషన్‌ జంక్షన్‌ అభివృద్ధిపై తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. మున్సిపల్‌ షట్టర్ల స్థానంలో కొత్త కమర్షియల్‌ కాంపెక్స్‌ నిర్మించాలని ఇటీవల గ్రేటర్‌ అధికారులకు సూచించారు. రెండు రోజుల క్రితం కమిషనర్‌ పమేలా సత్పతితో కాంప్లెక్స్‌ నిర్మాణంపై చర్చించారు. వరంగల్‌లో ఉన్న ప్రధాన జంక్షన్‌ అభివృద్ధి చేస్తే నగరానికి కొత్త అందం వస్తుందని ఆయన కమిషనర్‌కు చెప్పారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి 22 గుంటల స్థలం కార్పొరేషన్‌కు అప్పగించేలా చూస్తానన్నారు. ఎకరం స్థలంలో అన్ని హంగులతో కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తే ఆదాయంతో పాటు జంక్షన్‌కు లుక్‌ వస్తుందని వివరించడంతో త్వరలోనే ప్రణాళికలు రూపొందిస్తామని కమిషనర్‌ ఎమ్మెల్యేకు తెలిపారు.