బుధవారం 02 డిసెంబర్ 2020
Warangal-rural - Sep 28, 2020 , 01:59:33

రెవె‘న్యూ’కు సన్నద్ధం..!

 రెవె‘న్యూ’కు సన్నద్ధం..!

  • ధరణి పోర్టల్‌ కోసం చురుగ్గా ఏర్పాట్లు..
  • కొత్త చట్టం అమలుకు అధికార యంత్రాంగం బిజీబిజీ..
  • తహసీల్దార్‌ ఆఫీసుల్లో  రిజిస్ట్రేషన్లకు సన్నాహాలు
  • ఓ కంపెనీకి మౌలిక వసతులు  కల్పించే బాధ్యతలు
  • కొత్తగా ఇంటర్నెట్‌, కంప్యూటర్లు,  సీసీ, వెబ్‌ కెమెరాలు
  • స్వయంగా పర్యవేక్షిస్తున్న తహసీల్దార్లు
  • రిజిస్ట్రేషన్లపై త్వరలో రెవెన్యూ    సిబ్బందికి శిక్షణ
  • రెవెన్యూశాఖలో పదోన్నతులకూ కసరత్తు

దసరాకు ధరణి పోర్టల్‌ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో కొత్త రెవెన్యూ చట్టం అమలుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ కోసం అవసరమైన సాఫ్ట్‌వేర్‌, కంప్యూటర్లు, సీసీ, వెబ్‌ కెమెరాలు, ఇంటర్నెట్‌ (హై బ్యాండ్‌ విడ్త్‌)ను సమకూర్చుతోంది. రిజిస్ట్రేషన్‌తో పాటు మ్యుటేషన్‌, ఆ వెంటనే పట్టా పాస్‌ పుస్తకం.. ఇలా అన్నీ ఒకేచోట అది కూడా క్షణాల్లో అందజేసేలా సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానుంది. రిజిస్ట్రేషన్‌ తీరుపై త్వరలో తహసీల్దార్లకు, ఇతర సిబ్బంది శిక్షణ ఇవ్వనుంది.

 వరంగల్‌ రూరల్‌, నమస్తే తెలంగాణ : కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తెచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోం ది. రెవెన్యూ సేవలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ ఇకపై ప్రతి భూ లావాదేవీని ఆన్‌లైన్‌లోనే నిక్షిప్తం చేయనుండడం ద్వారా ధరణి సేవలను విస్తృతం చేయనుంది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు వేర్వేరుగా రెండు విభాగాల్లో ధరణి పోర్టల్‌ పనిచేయనుంది. దసరా రోజున దీనిని ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్‌ శనివారం ప్రకటించిన నేపథ్యంలో అధికారులు ఈలోగా అన్ని ఏర్పాట్లుచేస్తున్నారు.

ఈమేరకు అన్ని రకాల ఆస్తుల సమాచారాన్ని పోర్టల్‌లో ఎంటర్‌ చే యాలని ఆదేశాలు రావడంతో అవసరమైన సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌, బ్యాండ్‌ విడ్త్‌లను సిద్ధం చేస్తున్నారు. తహసీల్దార్‌ కా ర్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌(భూ బదలాయింపు), పట్టాదారు పాస్‌ పుస్తకం జారీ, ధరణి పోర్టల్‌లో రికార్డుల నమోదు కోసం రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం ఇక నుంచి వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌ కోసం ఒక చోట కు, మ్యుటేషన్‌కు మరోచోటకు వెళ్లాల్సిన అవసరం లేదు. జాయింట్‌ రిజిస్ట్రార్ల హోదాలో తహసీల్దార్లే ఈ రెండు పను లు చేసి రైతుకు వెంటనే పాస్‌ పుస్తకం అందజేస్తారు. దీంతో యాజమాన్య హక్కుల బదలాయింపు, పాస్‌ పుస్తకాల కో సం తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరిగే పని తప్పనుం ది.

రిజిస్ట్రేషన్‌ పూర్తయిన కొన్ని క్షణాల వ్యవధిలోనే తహసీల్దార్‌ కార్యాలయంలోనే మ్యుటేషన్‌, పాస్‌ పుస్తకం చేతికి రానుంది. రిజిస్ట్రేషన్‌ మొదలు పాస్‌ పుస్తకం పంపిణీ, ధరణి పోర్టల్‌లో రికార్డుల నమోదు వరకు అంతా చిటికెలో అయిపోతుంది. భూ లావాదేవీలకు వెబ్‌సైట్‌ ద్వారా స్లాట్‌ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనిని పరిశీలించి తహసీల్దార్‌ కేటాయించే సమయానికి పత్రాలిచ్చి సేవలు పొందాలి.

చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు..

తహసీల్దార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు కోసం అవసరమైన వసతులను కల్పించేందుకు ప్రభుత్వం రెవెన్యూ అధికారుల నుంచి ముందుగానే సమాచారం సేకరించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి, కావాల్సినవి ఏమిటనే విషయమై నివేదికలు తెప్పించుకుంది. ఈ మేరకు వీటిని కల్పించే బాధ్యతలను తాజాగా ఓ కంపెనీకి అప్పగించగా రెండు మూడు రోజుల నుంచి సదరు ప్రతినిధులు ప్రతి తహసీల్దార్‌ ఆఫీస్‌లో ఇంటర్నెట్‌తో పాటు కంప్యూటర్లు, మానిటర్లు, సీసీ, వెబ్‌ కెమెరాలు, బయోమెట్రిక్‌ యంత్రాలను అమర్చుతున్నారు. ఇన్నాళ్లు ఉపయోగించకుండా పక్కన పెట్టిన కంప్యూటర్లు, సీసీ కెమెరాలు, ఇతర పరికరాలకు మరమ్మతులు చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త కంప్యూటర్లు, సీసీ, వెబ్‌ కెమెరాలు, బయోమెట్రిక్‌ యంత్రాలు, ఇంటర్నెట్‌ వసతిని ఏర్పాటు చేస్తున్నారు. తహసీల్దార్లు స్వయంగా ఈ పనులను పర్యవేక్షిస్తుండగా ఒకటీరెండు రోజుల్లో పూర్తి కానున్నాయి. రిజిస్ట్రేషన్ల వ్యవస్థ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నందున సాధ్యమైనంత త్వరలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌పై తాసిల్దార్లు, ఇతర సిబ్బందికి శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

పదోన్నతులకు కసరత్తు

కొత్త రెవెన్యూ చట్టం అమలు నేపథ్యంలో పదోన్నతులకు కసరత్తు కూడా మొదలైంది. తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ తహసీల్దార్లరకు తహసీల్దార్లుగా పదోన్నతి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మొదట తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించి ఆ తర్వాత డిప్యూటీ త హసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతులు ఇచ్చే యో చనలో ఉందని తెలుస్తోంది. లేకపోతే మొదట డీటీలకే తహసీల్దార్లుగా పదోన్నతి ఇచ్చి ఆ తర్వాతే తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి ఇచ్చే అవకాశముందని ఆ శాఖలో జోరుగా చర్చ జరుగుతోంది. డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి పొందే వారి జాబితాలో వరంగల్‌ రూరల్‌ జిల్లా నుంచి ఐదుగురు ఉన్నట్లు తెలిసింది. వీరిలో నర్సంపేట, శాయంపేట, నెక్కొండ, ఖానాపురం, గీసుగొండ తహసీల్దార్లు రామ్మూర్తి, హరికృష్ణ, వెంకన్న, సుహాసిని, సుభాషిణి ఉన్నారు. తహసీల్దార్లుగా పదోన్నతి పొందేవారి జాబితాలో ఈ జిల్లా నుంచి తొమ్మిది మంది ఉంటే వీరిలో విక్రమ్‌కుమార్‌, వివేక్‌, రాజ్‌కుమార్‌ మొదటివరుసలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం విక్రమ్‌కుమార్‌ ఆత్మకూరు, వివేక్‌ నల్లబెల్లి, రాజ్‌కుమార్‌ నడికూడ తహసీల్దార్లుగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.