మంగళవారం 20 అక్టోబర్ 2020
Warangal-rural - Sep 27, 2020 , 06:13:33

మరోసారి భారీ వ‌ర్షం

మరోసారి  భారీ వ‌ర్షం

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని చెరువులు, కుంటలు మరోసారి మత్తళ్లు దుంకుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు శనివారం రాకపోకలు స్తంభించాయి. సంగెం మండలంలోని చెరువులన్నీ మళ్లీ అలుగు పోస్తున్నాయి. జిల్లాలోనే పెద్దదైన ఎల్గూర్‌చెరువు నాలుగోసారి మత్తడి పోస్తున్నది. నర్సంపేట మండలంలోని మాదన్నపేట పెద్ద చెరువు 17 అడుగుల పూర్తి నీటిసామర్థ్యంతో నిండి అరఫీటు ఎత్తులో మత్తడి దుంకుతున్నది. పాతముగ్ధుంపురం శివారులోని ఊరచెరువు, మహేశ్వరం పెద్ద చెరువు కూడా మత్తడి పోస్తున్నాయి.

శాయంపేట మండలం జోగంపల్లి శివారులోని చలివాగు రిజర్వాయర్‌ నీటిమట్టం 609 ఎంసీఎఫ్‌టీకి చేరినట్లు దేవాదుల అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోకి వరద చేరుతుండడంతో భారీగా మత్తడి పడుతున్నది. మండలంలో భారీ వర్షం పడడంతో పసుపు, పత్తి, వరి పంటలో వరద నీరు చేరింది. రాయపర్తిలోని రామచంద్రుని చెరువు, మంచినీళ్ల చెరువు, కొత్త చెరువు (దొర చెరువు, ఘణపురం చెరువు, కోమటికుంట, బండ్లకుంట, మోరోనికుంట, స్వామికుంట, పెర్కవేడు పరిధిలోని నాగిరెడ్డి చెరువు, దేవుని చెరువు, రాగన్నగూడెం సమీపంలోని వనంవారిమాటు అలుగు పోస్తున్నాయి. చెన్నారావుపేట మండలంలోని పాకాల వాగు, వట్టెవాగు, మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కోపాకుల, పాపయ్యపేట, జల్లి, అమీన్‌సాగర్‌ ఊరచెరువులు పాపయ్యపేట శివారులోని సుద్ధరేవుల ఆనకట్ట అలుగు పోస్తున్నాయి.


logo