బుధవారం 28 అక్టోబర్ 2020
Warangal-rural - Sep 26, 2020 , 02:33:23

రైతుల కీర్తి, ప్రతిష్టలు పెంచుతాం..

రైతుల కీర్తి, ప్రతిష్టలు పెంచుతాం..

  • కర్షకుల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్‌ ఆరాటం
  • అన్నదాతల నోట్లో మట్టి కొట్టేలా కేంద్రం బిల్లులు
  • రాష్ట్ర పంచాయతీరాజ్‌,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

రాయపర్తి : ఆరుగాలం కష్టపడే రైతుల కీర్తి ప్రతిష్టలను మరింత పెంచేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌.. కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చారని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. టీఆర్‌ఎస్‌ రాయపర్తి మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మండలకేంద్రంలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ చట్టం అమలుతో రాష్ట్ర రైతాంగానికి ‘పటా’్టభిషేకం చేసినట్లవుతుందన్నారు. నిజాం కాలం నాటి రెవెన్యూ దస్ర్తాలతో రైతులు పడుతున్న ఇబ్బందులు, దయనీయ స్థితులను ఆసరాగా చేసుకుని రెవెన్యూ యంత్రాంగం చేస్తున్న ఆర్థిక, అక్రమ దోపిడీకి అడ్డుకట్ట వేసే సంకల్పంతోనే కేసీఆర్‌ కొత్త చట్టం తెచ్చారని పేర్కొన్నారు. వీఆర్‌వో వ్యవస్థ రద్దయిన తర్వాత రైతుల కండ్లల్లో ఆనందం కనిపిస్తున్నదని చెప్పారు.

కేంద్ర బిల్లులను ప్రజలు వ్యతిరేకించాలి

ప్రధాని మోదీ సర్కారు ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ బిల్లులు రైతుల నోట్లో మట్టి కొట్టేలా ఉన్నాయని ఎర్రబెల్లి విమర్శించారు. కర్షకులు కష్టపడి పండించిన ఉత్పత్తులను మధ్యవర్తులు, దళారులకు అంటగట్టేలా బిల్లు తెచ్చారని చెప్పారు. కేంద్రం తెచ్చే కొత్త బిల్లులన్నింటినీ ప్రజలు, రైతులు ముక్తంఠంతో వ్యతిరేకించాలని కోరారు. ప్రజా సంక్షేమమే ఎజెండాగా సాగుతున్న టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రతిపక్షాలకు ప్రజాదరణ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ఊరికొక్క కార్యకర్త లేని బీజేపీ, అభ్యర్థులే కానరాని కాంగ్రెస్‌ పార్టీలు టీఆర్‌ఎస్‌ పాలనపై విమర్శలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు.

శాసనమండలి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వారు చేస్తున్న కుయుక్తులను ప్రజలు తిప్పికొట్టాలని కోరారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లా చరిత్రలో పురాతన, పెద్ద మండలంగా ఉన్న రాయపర్తి మండలకేంద్ర ముఖచిత్రాన్ని సమగ్రంగా మార్చడమే తన లక్ష్యమని మంత్రి తెలిపారు. మండలకేంద్రం మీదుగా ఉన్న పాలకుర్తి-అన్నారం రోడ్డు విస్తరణ, వరంగల్‌-ఖమ్మం జాతీయ ప్రధాన రహదారిపై డివైడర్ల ఏర్పాటు, సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం, నూతన సీసీ రోడ్లు, సైడ్‌ కాల్వల నిర్మాణాలకు ఎంతటి ఖర్చుకైనా తాను వెనుకాడేది లేదని, మండల కేంద్ర అభివృద్ధి పనులకు మండలకేంద్రవాసులు స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు.


logo