బుధవారం 28 అక్టోబర్ 2020
Warangal-rural - Sep 25, 2020 , 05:37:22

పెట్రోల్‌ బంకు ఇప్పిస్తానంటూ ఘరానా మోసం

పెట్రోల్‌ బంకు ఇప్పిస్తానంటూ ఘరానా మోసం

  • రూ. 4.6 లక్షలకు టోకరా 

సుబేదారి, సెప్టెంబర్‌ 24 : అత్యాశ అసలుకే ఎసరు తెచ్చింది. కోటీశ్వరుడిని అవుతానని కలలుగన్న వ్యక్తి అడ్డంగా బుక్కయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. సుబేదారి పోలీసుస్టేషన్‌ పరిధిలోని రెవెన్యూ కాలనీకి చెందిన గాదె దేవేందర్‌రెడ్డి మొబైల్‌కు ఈనెల 15న 8697422627 సెల్‌ నంబర్‌ నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేశాడు. కేంద్ర ప్రభుత్వ స్కీం అయిన కిసాన్‌ సేవా కేంద్రం నుంచి పెట్రోల్‌ బంకు ఇప్పిస్తానని, దరఖాస్తు కోసం రూ. 10 వేలు పంపించాలని చెప్పాడు.

నమ్మిన దేవేందర్‌రెడ్డి యాక్సిస్‌ బ్యాంకు యాప్‌ నుంచి రూ. 10 వేలు పంపించాడు. దరఖాస్తు ఓకే అయింది, అప్రూవల్‌ ఫీజు కింద రూ. 50వేలు పంపించండి అని సదరు గుర్తు తెలియని వ్యక్తి మళ్లీ ఫోన్‌ చేయడంతో బాధితుడు దేవేందర్‌రెడ్డి రూ. 25వేల చొప్పున రెండుసార్లు పంపించాడు. ఈనెల 17న ఆ వ్యక్తి మళ్లీ ఫోన్‌ చేసి బంకు సెక్యూరిటీ డిపాజిట్‌ కోసం రూ. 4లక్షలు పంపించండి అని అతడి బ్యాంకు అకౌంట్‌ నంబర్‌ పంపించాడు. దీంతో దేవేందర్‌రెడ్డి తన హెచ్‌డీఎఫ్‌సీ ఖాతా నుంచి రూ. 4లక్షలు పంపించాడు. కొద్దిసేపటికి సదరు వ్యక్తి ఫోన్‌ చేసి డిపాజిట్‌ కోసం మరో రూ. 6లక్షలు పంపించాలని చెప్పడంతో దేవేందర్‌రెడ్డికి అనుమానం వచ్చి నిలదీశాడు. దీంతో గుర్తుతెలియని వ్యక్తి తన మొబైల్‌ను స్విచ్‌ఆఫ్‌ చేశాడు. కాగా, బాధితుడు దేవేందర్‌రెడ్డి గురువారం సుబేదారి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అజయ్‌ తెలిపారు.logo