సోమవారం 26 అక్టోబర్ 2020
Warangal-rural - Sep 25, 2020 , 04:55:32

ఆస్తి వివరాలు నమోదు చేసుకోవాలినూతన రెవెన్యూ చట్టంపై అవగాహన

ఆస్తి వివరాలు నమోదు చేసుకోవాలినూతన రెవెన్యూ చట్టంపై అవగాహన

  • సదస్సులో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి

నర్సంపేటటౌన్‌, సెప్టెంబర్‌24: నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో ఇళ్లు ఉన్న ప్రతి ఒక్కరూ ఆస్తుల వివరాలు నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన రెవెన్యూ చట్టంపై గురువారం మున్సిపాలిటీ సమావేశ మందిరంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ స్థలాల వివరాలు, ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారి వివరాలు, అందులో ఏపీఎల్‌, బీపీఎల్‌కు చెందిన వారి వివరాలు అధికారులు వారం రోజుల్లో సేకరించాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 600 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. పేదల ఆధీనంలో ఉన్న అసైన్డ్‌ భూములు రెగ్యులరైజ్‌ చేయించుకోవాలని సూచించారు. నర్సంపేట పరిధిలో 111 సర్వే నంబర్‌లో పరిధి ఏఏ వార్డులు విస్తరించి ఉన్నాయో ఆయా వార్డుల కౌన్సిలర్లు సమావేశాలు నిర్వహించి వివరాలు సేకరించాలని తెలిపారు. ధరణి వెబ్‌సైట్‌ ప్రాముఖ్యతను వివరించారు. మున్సిపల్‌ పరిధిలోని వ్యవసాయేతర భూములతోపాటు ఇంటి స్థలాల వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని అన్నారు. జీవో నంబర్‌ 58, 59 ప్రకారం ఒక వ్యక్తికి 125 గజాల స్థలం ఉండి, అందులో ఇల్లు  నిర్మించి ఉంటే ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేస్తుందని తెలిపారు. పట్టాభూములతోపాటు లేఅవుట్‌ లేని భూములు క్రమబద్ధీకరించుకోవడానికి ఎల్‌ఆర్‌ఎస్‌ ఉపయోగపడుతుందన్నారు. పేదల భూముల ఆక్రమణ, తప్పుడు దస్తావేజుల నమోదు తదితర అక్రమాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదన్నారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుంటి రజిని, వైస్‌ చైర్మన్‌ మునిగాల వెంకట్‌రెడ్డి, తహసీల్దార్‌, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పరిహారం చెక్కుల పంపిణీ

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నర్సంపేట పట్టణంతోపాటు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఇళ్లు కోల్పోయి నిరాశ్రాయులైన 135 కుటుంబాలకు పరిహారంగా రూ.3200 చొప్పున ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో పంపిణీ చేశారు. ఎన్‌టీఆర్‌ నగర్‌ పరిధిలో వరద ముంపుతో నష్టపోయిన 35 కుటుంబాలకు రూ.3800 వంతున అందించారు. పట్టణంలో చెత్తసేకరణ, ఇతర అవసరాల కోసం ఇటీవల కొనుగోలు చేసిన రెండు ట్రాక్టర్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. 

బాధిత కుటుంబాలకు టీఆర్‌ఎస్‌ అండ

దుగ్గొండి: టీఆర్‌ఎస్‌ అభివృద్ధిలో భాగస్వాములై వివిధ కారణాలతో నాయకులు, కార్యకర్తలు మృతి చెందితే బాధిత కుటుంబాలకు పార్టీ అండగా నిలుస్తుందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. దుగ్గొండి మండలంలోని నాచినపల్లి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు ఊకంటి తిరుపతిరెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా మృతుడి భార్య లక్ష్మికి టీఆర్‌ఎస్‌ సభ్యత్వం ద్వారా వచ్చిన రూ.రెండు లక్షల బీమా చెక్కును గురువారం ఎమ్మెల్యే స్థానిక పార్టీ నాయకులతో కలిసి అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమమే పార్టీ ధ్యేయమన్నారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు, నాచినపల్లి ఉప సర్పంచ్‌ జంగా రాజిరెడ్డి,  టీఆర్‌ఎస్‌ నాచినపల్లి గ్రామ అధ్యక్షుడు మామిడాల వేణు, పార్టీ మండల ఉపాధ్యక్షుడు భూంపెల్లి రజినీకర్‌రెడ్డి, నాచినపల్లి పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ గుడిపెల్లి ధర్మారెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


logo