సోమవారం 26 అక్టోబర్ 2020
Warangal-rural - Sep 24, 2020 , 06:10:41

సకల సేవల టీ యాప్‌

సకల సేవల టీ యాప్‌

  • అరచేతిలో సాంకేతిక అద్భుతం
  •  ప్రభుత్వ సర్వీసులన్నీ ఒకే ప్లాట్‌ఫాంపై..
  •  ఇందులోనే ‘మీ సేవ’ సర్వీసులు
  •  సులభంగా బిల్లుల చెల్లింపు

చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు ‘మీసేవ’లో ఉండే సర్వీసులన్నీ పొందవచ్చు. సుమారు 150 రకాల ప్రభుత్వ సేవలు ఒక్కచోట ఉండేలా రూపొందిన ‘టీయాప్‌ ఫోలియో’తో దరఖాస్తులు, బిల్లులు సులభంగా చెల్లించడంతో పాటు ధ్రువీకరణ పత్రాలు పొందవచ్చు. పౌరుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సాంకేతికతతో ప్రజలకు కార్యాలయాల చుట్టూ తిరిగే పని తప్పింది.

పరకాల

‘మీసేవ’లో దరఖాస్తులు, ధ్రువీకరణ పత్రాలు, బిల్లుల చెల్లింపు వంటి సర్వీసులన్నీ పొందేందుకు ప్రభుత్వం టీయాప్‌ ఫోలియోలో యాప్‌ను రూపొందించింది. దీని వల్ల సుమారు 150 రకాల సేవలను పొందవచ్చు. నిల్చున్న చోటు నుంచే ఏ సర్వీసుకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దోస్త్‌ అప్లికేషన్‌, బిల్స్‌ పేమెంట్లు, పెన్షనర్‌ లైఫ్‌ అథెంటికేషన్‌, రిజిస్ట్రేషన్స్‌ అండ్‌ స్టాంప్స్‌, ఆర్టీఏ, ఆధార్‌ స్లాట్‌ బుకింగ్‌, పోలీస్‌.. ఇలా అన్ని సర్వీసులు ఇందులో ఉన్నాయి. గూగుల్‌ ప్లేస్టోర్‌లో ‘టీయాప్‌ ఫోలియో’ అని టైప్‌చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆ తర్వాత మొబైల్‌ నంబర్‌తో లాగిన్‌ కావాలి.

ఈజీగా రిజిస్ట్రేషన్స్‌, బిల్‌ పేమెంట్స్‌..

రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్‌ సర్వీసులను టీయాప్‌ ఫోలియోలో పొందుపర్చారు. పహాణీ, 1బీ, ల్యాండ్‌ మ్యుటేషన్‌, ఎఫ్‌ఎంబీ కాపీ, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ కాపీ, ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌(ఈసీ), ఎఫ్‌లైన్‌ పిటిషన్‌ సర్వీసులు ల్యాండ్‌ విభాగంలో ఉండగా సర్టిఫికెట్స్‌ విభాగంలో ఇన్‌కం, అగ్రికల్చర్‌ ఇన్‌కం, క మ్యూనిటీ అండ్‌ డేట్‌ ఆఫ్‌ బర్త్‌, బ్రాహ్మిణ్‌ కమ్యూనిటీ, నివాసం, ఓబీసీ, ఈబీసీ, ఫ్యామిలీ మెంబర్‌, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, వాహనాల కో సం పోలీస్‌ ఎన్‌వోసీ సర్టిఫికెట్‌ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. విద్యుత్‌, వాటర్‌, పోస్ట్‌పెయిడ్‌, ల్యాండ్‌లైన్‌, ఇంటర్నెట్‌ బిల్లులు చెల్లించవచ్చు. రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌లో వివాహ రిజిస్ట్రేషన్‌, సేల్‌ ఆఫ్‌ స్టాంప్స్‌, మార్కెట్‌ వ్యాల్యూ అసిస్టెన్స్‌, పెనాల్టీ, ప్రైవేట్‌ అటెండన్స్‌ ఫీ సర్వీసులు ఉన్నాయి.

ఆర్టీఏ, పోలీసు సర్వీసులు కూడా..

టీయాప్‌ ఫోలియోలో ఆర్టీసీ, పోలీసు సర్వీసులను కూడా ప్రభుత్వం పొందుపర్చింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌, డూప్లికేట్‌ లైసెన్స్‌, బ్యాడ్జ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ సరెండర్‌, చిరునామా మార్పు, టెస్ట్‌ డ్రైవింగ్‌ స్లాట్‌ బుకింగ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ టెస్ట్‌ ఫీ పేమెంట్‌, హజార్డస్‌ లైసెన్స్‌, హిస్టరీ సేవలు పొందవచ్చు. లెర్నర్‌ లైసెన్స్‌, లెర్నింగ్‌ లైసెన్స్‌ టెస్ట్‌ స్లాట్‌ బుకింగ్‌, క్లాస్‌ వెహికిల్‌ అడిషన్‌, లెర్నింగ్‌ లైసెన్స్‌ రీటెస్ట్‌ కూడా ఉన్నాయి. లైఫ్‌ టాక్స్‌, క్వార్టర్లీ టాక్స్‌ పేమెంట్‌, ఆర్టీఏ ఎం-వాలెట్‌ను ఉపయోగించవచ్చు. పోలీసుస్టేషన్‌ లొకేటర్‌, పోలీసుస్టేషన్‌ పరిధి, పిటిషన్‌(దరఖాస్తు) స్థితి, ఎఫ్‌ఐఆర్‌ ప్రింట్‌, ట్రాఫిక్‌ చలానాలు చెల్లించవచ్చు.

ఇంటి నుంచే దర్శనం టికెట్లు..

రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఆర్జిత సేవల ను, గదులను యాప్‌ద్వారా బుకింగ్‌ చేసుకోవచ్చు. నిర్ణీత సమయానికి దైవ దర్శనంతో పాటు గదులు కూడా సులభంగా దొరుకుతాయి. ఆయా దేవస్థానాలకు విరాళాలను కూడా ఇంట్లోనుంచే ఇవ్వవచ్చు.

ఎక్కడినుంచైనా వినియోగించుకునే వెసులుబాటు..

వినియోగదారులు సేవల కోసం మీసేవలను ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. వాటిలో నిర్ణీత రుసుం కంటే ఎక్కువ ఫీజు వసూలు చేస్తుంటారు. మీసేవ సెంటర్‌ తెరిచి ఉన్న సమయంలోనే సర్వీసులు పొందవచ్చు. అదే టీయాప్‌ ఫోలియోలో ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా సర్వీసులు పొందవచ్చు. ఇందుకోసం ముందుగా ఆధార్‌కార్డు నంబర్‌తో అనుసంధానం చేసుకోవాలి. దీంతో తహసీల్దార్‌, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు, మీసేవల చుట్టూ తిరిగే అవసరం ఉండదు. ఇక పెన్షన్‌దారులకు ఇదో వరమని చెప్పవచ్చు. వృద్ధులు ఇంట్లో ఉండి కేవలం ఒక్క సెల్ఫీతో లైఫ్‌ సర్టిఫికెట్‌ పొందవచ్చు.


logo