ఆదివారం 29 నవంబర్ 2020
Warangal-rural - Sep 24, 2020 , 05:41:28

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని..

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని..

  • పక్కా ప్లాన్‌తో  హోంగార్డును హత్య చేసిన భార్య, ఆమె ప్రియుడు
  • వివరాలు వెల్లడించిన నెక్కొండ సీఐ

నెక్కొండ, సెప్టెంబర్‌23: వివాహేతర సంబంధానికి అడ్డువస్తు న్నాడని భార్య, ఆమె ప్రియుడు కలిసి పక్కా ప్లాన్‌తో హోంగార్డు ధర్యావత్‌సింగ్‌(42)ను హతమార్చారని నెక్కొం డ సీఐ పుప్పాల తిరుమల్‌ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నెక్కొండ, చెన్నారావు పేట ఎస్సైలు నాగరాజు, రవితో కలిసి వివరాలను వెల్లడించారు. మండలంలోని గొల్లపల్లి శివారు గేట్‌పల్లికి చెందిన ధర్యావత్‌సింగ్‌ వరంగల్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డ్‌గా పనిచేస్తూ నెక్కొండలో నివాసముంటున్నాడు. అతని భార్య జ్యోతి, సాంబరాజుతో నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నది. ఈ విషయం భర్తకు తెలియడంతో భార్యను మద్యం తాగి వచ్చి తరచూ వేధించేవాడు.

ఈ క్రమంలో ధర్యావత్‌సింగ్‌కు గత నెల 21 నుంచి సెలవుపై ఇంటి వద్దనే ఉంటున్నాడు. తమ సంబం ధానికి అడ్డుపడుతున్నాడని భర్తను హత్య చేయాలని భార్య, ఆమె ప్రియుడు నిర్ణయించుకున్నారు. ఈ నెల 14వ తేదీ రాత్రి ధర్యావత్‌ సింగ్‌ మద్యం మత్తులో పడుకొని ఉండగా సాంబరాజుకు జ్యోతి సమాచారం అందించింది. వెంటనే సాంబరాజు ట్రాలీ ఆటోను తీసుకుని రాగా, ఇద్దరు కలిసి అతని గొంతుకు తాడు బిగించి హత్య చేశారు. ట్రాలీలో అ ప్పల్‌రావుపేట గ్రామ శివారుకు మృతదేహాన్ని తరలించిన సాంబరాజు, అతని తమ్ముడు సురేశ్‌, తండ్రి యాకయ్య సాయంతో పెట్రోల్‌ పోసి దహనం చేశారు. 

ఆనవాళ్లు లేకుండా మృతదేహాన్ని రెండుసార్లు దహనం

అనంతరం ఈ నెల 15వ తేదీ ఉదయం నిందితులు అక్కడికి వెళ్లి చూడగా శవం పూ ర్తిగా కాలిపోలేదు. దీంతో అదే రోజు రాత్రి మళ్లీ దహనం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా బూడిద, ఎముకలను బస్తాల్లో నింపి కేసముద్రం దర్గా ప్రాంతంలోని చెరువులో కలిపారు. హోంగార్డ్‌ అన్న ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కాల్‌డాటా, ఆమె కదలికలపై నిఘా పెట్టడంతో హత్య గుట్టురట్టయింది. హోంగార్డు భార్య బదావత్‌ జ్యోతి, ఆమె ప్రియుడు సాంబరాజును బుధవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. మిగతా ఇద్దరు నిందితులు జిల్లా యాకయ్య, జిల్లా సురేశ్‌ పరారీలో ఉన్నారని, త్వరలో పట్టుకుంటామని సీఐ తెలిపారు.