ఆదివారం 24 జనవరి 2021
Warangal-rural - Sep 23, 2020 , 03:19:41

విస్తరణ దిశగా కాకతీయ కెనాల్‌

విస్తరణ దిశగా కాకతీయ కెనాల్‌

వరంగల్‌ రూరల్‌, నమస్తేతెలంగాణ : కాకతీయ ప్రధాన కాలువ విస్తరణకు అడుగులు పడుతున్నాయి. కరీంనగర్‌లోని ఎల్‌ఎండీ నుంచి హన్మకొండలోని చింతగట్టు వరకు 74 కి.మీ ఉన్న కాల్వను విస్తరించే ప్రతిపాదనకు తాజాగా సాంకేతిక కమిటీ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో జల వనరుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(ఈఎన్‌సీ) మురళీధర్‌ ఎస్సారెస్పీ ఇంజినీర్లతో కలిసి బుధవారం కెనాల్‌ను సందర్శించనున్నారు. విస్తరణ, ఇతర ప్రతిపాదనలపై 224 కి.మీ వద్ద పరిశీలించనున్నారు. కరీంనగర్‌లోని ఎల్‌ఎండీ నుంచి ఎస్సారెస్పీ తొలి, రెండో దశ ఆయకట్టుకు ప్రస్తుతం ఇస్తున్న నీటి విడుదలను మరింత పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జలవనరుల శాఖ నిపుణులతో టెక్నికల్‌ కమిటీని నియమించింది. ఇందులో ఈఎన్‌సీలు, వివిధ ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజినీర్లు ఉన్నారు. ఈ కమిటీ నాలుగు ప్రతిపాదనలను పరిశీలించింది. కాకతీయ మెయిన్‌ కెనాల్‌ను విస్తరించడం, లోతు చేయడం, ప్రత్యామ్నాయంగా దీని పక్కనే మరో కాల్వ నిర్మించడంతో పాటు మరొకటి ప్రతిపాదనల్లో ఉన్నట్లు తెలిసింది. వీటిలో కెనాల్‌ విస్తరణ ప్రతిపాదనకే ఈఎన్సీలు, సీఈలు మొగ్గుచూపారు. చివరకు కొద్దిరోజుల క్రితం నీటి సరఫరా సామర్థ్యం పెంచేందుకు మెయిన్‌ కెనాల్‌ విస్తరణకే కమిటీ ఆమోదం తెలిపింది.

మరో ఐదు మీటర్ల విస్తరణ..

కాకతీయ మెయిన్‌ కెనాల్‌ సామర్థ్యం 6 వేల క్యూసెక్కులు మాత్రమే. దీన్ని 9 వేలకు పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఎల్‌ఎండీ నుంచి కాకతీయ ప్రధాన కాల్వ ద్వారా 9 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తే ఎస్సారెస్పీ తొలి, రెండో దశ పరిధిలోని చివరి ఆయకట్టుకు సైతం నీరు చేరుతుంది. ఈ క్రమంలో ఎల్‌ఎండీ వద్ద ఉన్న 146వ కి.మీ నుంచి చింతగట్టు సమీపంలోని 220 కి.మీ వరకు అంటే 74 కి.మీ పొడవునా ఐదు మీటర్ల వెడల్పుతో విస్తరించే ప్రతిపాదనకు సాంకేతిక కమిటీ ఓకే చెప్పింది. ఈ కెనాల్‌ ప్రస్తుతం 23 నుంచి 25 మీటర్ల వెడల్పు ఉంది. విస్తరణతో ఇది 28 నుంచి 30 మీటర్లకు పెరుగనుంది. 74 కి.మీ పొడవునా కాల్వ విస్తరణకు ఎస్సారెస్పీ ఇంజినీర్లు ఇప్పటికే రూ.650 కోట్ల తో అంచనాలు తయారు చేశారు. టెక్నికల్‌ కమిటీ ఆమోదముద్ర వేసిన దరిమిలా ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఈఎన్‌సీ కాకతీయ ప్రధాన కాల్వను పరిశీలించేందుకు బుధవారం వస్తున్నట్లు సమాచారం. వీరి పర్యటన అనంతరం స్టేట్‌ లెవల్‌ స్టాండింగ్‌ కమిటీ ఆమోదంతో ప్రభుత్వానికి ఫైల్‌ చేరనుంది.

సీసీ వాల్‌కు ప్రతిపాదన

ఈ కెనాల్‌లో మూడున్నర కి.మీ పొడవునా సిమెంటు కాంక్రీట్‌(సీసీ) వాల్‌ నిర్మించే ప్రతిపాదన పరిశీ లిస్తున్నట్లు తెలిసింది. ప్రధాన కాలువలో 224 నుంచి 227.500 కి.మీ మధ్య అంటే హన్మకొండలోని గుండ్లసింగారం నుంచి వరంగల్‌ వరకు మట్టి కట్ట(బ్యాంకింగ్‌) ఉంది. కెనాల్‌లో ఎక్కువ నీరు విడుదల చేసిన సమయంలో, భారీ వర్షాలతో వరదలొచ్చినపుడు మట్టి కట్టతో ప్రమాదం పొంచి ఉంది. ఈ కట్ట వరంగల్‌ నగరంలోనే ఉండడంతో గతంలో కెనాల్‌ నుంచి నీరు బయటకు వెళ్లి స్థానికంగా తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో కెనాల్‌ను మూడున్నర కి.మీ దూరంలోని కాల్వకు రెండు వైపులా సీసీ వాల్‌ నిర్మించాలని ఎస్సారెస్పీ ఇంజినీర్లు ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం ఉన్న మట్టి కట్టను తొలగించకుం డా సీసీ వాల్‌ నిర్మించే అవకాశం ఉన్న నేపథ్యంలో బుధవారం ఇంజినీరింగ్‌ ఉన్నతాధికారులు సందర్శనకు రానున్నారు.


logo