మంగళవారం 24 నవంబర్ 2020
Warangal-rural - Sep 20, 2020 , 06:09:33

పుడ‌మి త‌ల్లికి పున‌రుజ్జీవం

పుడ‌మి త‌ల్లికి పున‌రుజ్జీవం

 • ‘హరితహారం’తో పెంపొందిన పచ్చదనం
 • మిషన్‌ కాకతీయ’తో చెరువులు, కుంటలు బలోపేతం 
 • పెరిగిన అడవులు, నీటి వసతితో జీవజాలానికి ఊతం
 • అంతరించాయనుకున్న ప్రాణులు సైతం కళ్లెదుట సాక్షాత్కారం
 • వృద్ధిచెందుతున్న అరుదైన జీవరాశులు
 • స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ సర్కారు కృషి ఫలితం 
 • ప్రభుత్వ ఉక్కు సంకల్పంతో జీవ వైవిధ్య శోభితం
 • భూపాలపల్లి అడవులకు పెద్దపులి రాక శుభ సంకేతం
 • పాకాల అభయారణ్యానికి ‘డస్కీ ఈగల్‌'
 • రెండేళ్ల తర్వాత చిన్నమడూరుకు సైబీరియన్‌ పక్షులు
 • పంట చేలు, ఇండ్లపై గుంపులుగా ఊర పిచ్చుకలు
 • తెలతెలవారంగనే ఊరూరా పక్షుల కిలకిలలు

 సమైక్య రాష్ట్రంలో తరిగిపోయి వెలవెలబోయిన అడవులు.. స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ సర్కారు చొరవతో ఇప్పుడు నిండైన పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. సీమాంధ్ర పాలనలో వట్టి పోయిన చెరువులు, కుంటలు.. స్వపరిపాలనలో బలోపేతమై జలకళతో ఉట్టిపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ‘హరితహారం’, ‘మిషన్‌ కాకతీయ’ను మహాయజ్ఞంలా అమలు చేయడంతో వాటి ఫలితాలు ఇదిగో.. ఇలా కళ్లెదుట కనిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ‘అవుట్‌ సైడ్‌ ఫారెస్ట్‌'తో పాటు, ‘ఇన్‌సైడ్‌ ఫారెస్ట్‌' అధికంగా పెరిగి ఇక కనుమరుగయ్యానుకున్న అనేక జీవరాశులు తిరిగి వనాల ఒడికి చేరుకుంటున్నాయి. వాటితో పాటు సహజంగా పెరిగే ప్రాణులు గుంపులుగా సందడి చేస్తున్నాయి. నిన్న  మొన్నటిదాకా ఉనికి కోల్పోయిన ఊర పిచ్చుకలు, మిత్ర పురుగులు, కీటకాలు మళ్లీ మనుగడ సాగిస్తున్నాయి. ప్రాజెక్టులు, చెరువుల్లో నిండా నీరుండి జలచరాలు నిశ్చింతగా జీవిస్తున్నాయి. వీటి ఆధారంగా రకరకాల పక్షులు జీవనం సాగిస్తుండగా, మనవద్ద అల్లుకున్న అనువైన వాతావరణంతో ఇతర ప్రాంతాల నుంచీ కొంగొత్త జాతులు వలసవస్తున్నాయి. 

- వరంగల్‌ రూరల్‌/జయశంకర్‌ భూపాలపల్లి/మహబూబాబాద్‌/నమస్తే తెలంగాణ/ వరంగల్‌ సబర్బన్‌/ఖానాపురం/దేవరుప్పుల  


మన చెరువుల్లో..

పర్కలు, కొడిపెలు, చందమామలు, చిన్న జెల్లలు, సాల కొర్ర  మట్టలు, మాల పంకిరి గాళ్లు, ఉడిశెలు, మార్పులు, మలుగుమీనులు, కొత్తకొత్త కప్పలు, నక్షత్ర తాబేళ్లు, నత్తగుల్లలు..

 మన అడవుల్లో.. 

దుప్పులు, అడవి పందులు, నక్కలు, ముంగీసలు, అడవి పిల్లులు, కుందేళ్లు, ఉడుములు, కొండ గొర్రెలు, పునుగు పిల్లులు.. తోడేళ్లు, నక్కలు, ఎలుగుబంట్లు..

 మన పొలాల్లో..

సీతాకోక చిలుకలు, వాన పాములు, ఆరుద్రలు, కుమ్మరి, గొంగలి, బంగారు పురుగులు, చెదలు, మిత్ర పురుగులు, అప్పులోని గుర్రాలు, అరుదైన కీటకాలు, పాములు..

 మన చెట్లు.. గట్లపై

రామచిలుకలు, కోయిలలు, గొర్రెంకలు, గీకురుగాళ్లు, ఊర పిచ్చుకలు, కాకులు, వింతైన కొంగలు.. రకరకాల.. రంగురంగుల పిట్టలు..

  మన అతిథులు

పెద్దపులి, నార్తర్న్‌ పిన్‌ టేల్‌, నార్తర్న్‌ షోలర్‌, స్పాట్‌ బిల్‌డక్‌, సీ గల్‌, బార్‌ హేడెడ్‌ గూస్‌, పెయింటెడ్‌ స్టార్క్‌, ఓపెన్‌ బిల్‌ స్టార్క్‌, బ్లాక్‌ వింగ్డ్‌ స్టిల్ట్‌, రెడ్‌ క్రెస్టెడ్‌ పోచర్డ్‌, కామన్‌ శాండ్‌ పైపర్‌, విజిలింగ్‌ డక్స్‌, తఫ్టేడ్‌ డక్‌, గ్రీబ్స్‌ పక్షులు.. పైడికంటి, బార్న్‌, బ్రౌన్‌ ఫిష్‌,  మోటిల్డ్‌, డస్కీ ఈగల్‌ గుడ్లగూబలు..

20 ఏళ్లకు పెద్దపులి రాక


ఇరవై ఏళ్ల నుంచి పులుల జాడ లేని ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఇటీవల పులి జాడ కనిపించింది. పొరుగున ఉన్న మహారాష్ట్ర లేదా ఛత్తీస్‌గఢ్‌ అడవు ల నుంచి మొదట ములుగు జిల్లాలోని ఏటూరునాగారం అభయారణ్యంలోకి ప్రవేశించింది. గోదావరి దాటి ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చేరిన టైగర్‌, కన్నాయిగూడెం మండలం ఐలాపూర్‌ అడవుల నుంచి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం, ఆజంనగర్‌ అడవుల మీదుగా పరకాల- భూపాలపల్లి ప్రధాన రహదారి దాటింది. ఆ తర్వాత మల్హర్‌, చిట్యాల మండలాల్లో సంచరించి చివరకు వెంచరామి మీదుగా మానేరు నది దాటి పొరుగున ఉన్న పెద్దపల్లి జిల్లాలో ప్రవేశించింది. ఇప్పటికీ పెద్దపల్లి జిల్లాలోని రామగిరి అడవుల్లో ఉన్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఇరవై ఏళ్లుగా లేని పులి ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు వచ్చిందంటేనే ఇక్కడ పర్యావరణం, జీవావరణంలో మార్పులు జరిగాయనడానికి సంకేతమని చెప్పవచ్చు. పచ్చదనం పెరగడం, క్షీణించిన అడవులు వృద్ధి చెందడం వల్లే పొరుగు రాష్ర్టాల నుంచి పులి వరంగల్‌ అడవులకు వచ్చిందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు.

పాకాలకు డస్కీ ఈగల్‌


వరంగల్‌ రూరల్‌ జిల్లా ఖానాపురం మండలం పాకాల ప్రాంతంలో ప్రధానంగా నీటి పక్షులు, మైదాన ప్రాంతాల్లో నివసించే పక్షులు, చెట్లపై నివసించే పక్షులు, నిషాచర పక్షులు ఇలా నాలుగు వర్గాలుగా ఉన్నాయి. ఇక్కడికి వలస పక్షుల సంఖ్య రెండు మూడేళ్ల నుంచి క్రమేణా పెరుగుతున్నది. నార్టర్న్‌ పిన్‌ టేల్‌, నార్తర్న్‌ షోలర్‌, స్పాట్‌ బిల్‌డక్‌, సీ గల్‌, బార్‌ హేడెడ్‌ గూస్‌, పెయింటెడ్‌ స్టార్క్‌, ఓపెన్‌ బిల్‌ స్టార్క్‌, బ్లాక్‌ వింగ్డ్‌ స్టిల్ట్‌, రెడ్‌ క్రెస్టెడ్‌ పోచర్డ్‌, కామన్‌ సాండ్‌ పైపర్‌, విజిలింగ్‌ డక్స్‌, తఫ్టేడ్‌ డక్‌, గ్రీబ్స్‌ వంటి పక్షులు ప్రతి శీతాకాలం, వేసవిలో పాకాల ప్రాంతానికి వలస వచ్చి ఆహార వేట కొనసాగిస్తున్నాయి. జీవ వైవిధ్యం అనుకూలంగా ఉంటేనే ఇలా పక్షులు వస్తున్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. సమైక్య రాష్ట్రంలో జిల్లాలో కేవలం నాలుగు శాతమే ఉన్న అడవులు స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఆరు శాతానికి పెరిగాయి. ఒక్క పాకాల అభయారణ్యంలోనే వెయ్యి ఎకరాల్లో ప్లాంటేషన్‌ పనులు చేపట్టారు. దీంతో మైదాన ప్రాంతంలో సంచరించే, చెట్లపై సంచరించే పక్షులకూ పాకాల ప్రాంతం నెలవుగా మారింది. నిషాచర పక్షులకూ పాకాల కేరాఫ్‌ అయింది. గతంలో ఇక్కడ రెండు రకాల గుడ్లగూబలు మాత్రమే దర్శనమిచ్చేవి. ఇప్పుడు ఏడు రకాల గుడ్ల గూబ జాతులు కనువిందు చేస్తుండడం విశేషం. వీటిలో ఉత్తర భారత దేశంలో మాత్రమే కనపడే ‘డస్కీ ఈగల్‌' గుడ్లగూబ దక్షిణ భారత దేశంలో కేవలం పాకాలలోనే కనపడుతుంది. రెండేళ్ల నుంచి ఇదిక్కడ పర్యాటకులను ఆకట్టుకుంటున్నది. దీన్ని చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. జీవ వైవిధ్యానికి ఇది మచ్చుతునక అని చెప్పవచ్చు. డస్కీ ఈగల్‌ గుడ్లగూబతో పాటు పైడికంటి, బార్న్‌ గుడ్లగూబలు, అడవి గుడ్లగూబలు, బ్రౌన్‌ ఫిష్‌ గుడ్లగూబలు, మోటిల్డ్‌ గుడ్లగూబలు వివిధ ప్రాంతాల నుంచి పాకాల అభయారణ్యానికి చేరుకున్నాయి. దట్టమైన అడవులు ఉండడం వల్ల పాకాలలో అరుదైన జీవ వైవిధ్యం విలసిల్లుతున్నది.  

పెరిగిన పచ్చదనం.. జల వనరులు బలోపేతం

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో హరితహారంలో భాగంగా ఇప్పటివరకు 64,57,050 మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా 1032 చెరువులకు 928 చెరువులను అభివృద్ధి చేశారు. చోల్పూర్‌ మాటు, మోరంచ వాగులపై లిఫ్ట్‌లు, చోట్ల చెక్‌డ్యాంలు ఏర్పాటు చేశారు. దీంతో నీటి లభ్యత గణనీయంగా పెరిగింది. జిల్లాలో 1,69,245.21 హెక్టార్లలో (73శాతం) అడవులు విస్తరించి ఉన్నాయి. స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో జిల్లాలో పచ్చదనం గణనీయంగా పెరిగింది. ఇక అంతరించి పోయాయనుకున్న పలు రకాల జంతువులు, కీటకాలు, పక్షులు ఇప్పుడు విరివిగా కనిపిస్తున్నాయి. 20ఏళ్లుగా జాడలేని పెద్దపులి సైతం ఇటవీల భూపాలపల్లి అడవుల్లో సంచరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక్కడి అడవులు, నీటి వసతి జీవ జాతులకు అనుకూలంగా ఉండడం వల్లే పెద్దపులి ఇటుగా వచ్చిందని, జీవ వైవిధ్యం పెంపొందింది అనేందుకు పులి రాకే సాక్ష్యమని స్థానిక అటవీ అధికారులు చెబుతున్నారు. ములుగు జిల్లాలోనూ 3లక్షల 580 హెక్టార్లలో (71.9శాతం) అటవీ ప్రాంతం విస్తరించి ఉన్నది. జిల్లాలో ఆరు విడుతల్లో 53లక్షల 65వేలు మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. 916 చెరువులు, కుంటలుండగా 628 చెరువులు, కుంటలను అభివృద్ధి చేయడం, 9మండలాల పరిధిలో 79 చెక్‌డ్యాంలు నిర్మించి జలాలను ఒడిసి పట్టడంతో ఇప్పుడా ప్రాంతాలన్నీ వివిధ రకాల జంతువులు, పక్షులకు సంరక్షణ కేంద్రాలుగా మారాయి.  మహబూబాబాద్‌ జిల్లాలో ఆరు విడుతల్లో 4.89కోట్ల మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1560 చెరువులుండగా 1080 చెరువులు మిషన్‌ కాకతీయ ద్వారా బాగు చేశారు. ఎనిమిది చెక్‌ డ్యాంలు నీటితో కళకళలాడుతున్నాయి. జిల్లాలో 1,39,353 హెక్టార్లలో అటవీ భూమి ఉండగా కొత్తగా హరితహారం ద్వారా బల్క్‌ ప్లాంటేషన్‌ చేయడంతో అటవీ ప్రాంతం పెరుగుతూ వస్తున్నది. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఆరు విడుతల్లో హరితహారంలో భాగంగా కోట్లాది మొక్కలు నాటారు. 1050 చెరువులను మిషన్‌ కాకతీయతో బాగు చేయడంతో పాటు, పాకాల, చలివాగు, మైలారం రిజర్వాయర్ల అభివృద్ధి పనులు చేపట్టడంతో జిల్లా సస్యశ్యామలంగా మారింది. సమైక్య రాష్ట్రంలో జిల్లాలో కేవలం నాలుగు శాతమే ఉన్న అడవులు స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఆరు శాతానికి పెరిగాయి. ఒక్క పాకాల అభయారణ్యంలోనే వెయ్యి ఎకరాల్లో ప్లాంటేషన్‌ పనులు చేపట్టారు. 

మత్స్యకారులకు సముద్రపు చేపలు

సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు మహబూబాబాద్‌జిల్లా నర్సింహులపేట మండలంలో కనిపిస్తున్నాయి. గతంలో కంటే భిన్నంగా అధిక వర్షపాతం నమోదు కావడం, జలాశయాలు నిండు కుండల్లా మారడం, పచ్చదనం విరివిగా పెరగడంతో మండలంలోని కొమ్ములవంచ శివారు పాత చెరువు, కొత్తచెరువు, ఆకేరు అనకట్ట మత్తడి వద్ద మత్సకారుల వలలకు ఇటీవల సముద్రపు చేపలు చిక్కడం స్థానికంగా ఆశ్చర్యంగొలిపింది. నర్సింహులపేటలో మయూరాలు సందడి చేస్తూ ప్రజలకు ఆహ్లాదం అందిస్తున్నాయి. వరి చేలలో పిచ్చుకలు, కొంగలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. 

దేవాదుల నీటితో మళ్లీ సైబీరియన్‌ పక్షులు

 మండలంలోని చినమడూరు, వేల కిలోమీటర్ల దూరంలోని సైబీరియన్‌ పక్షుల (పెయింటెడ్‌ స్టార్క్స్‌)కు దశాబ్దాలుగా సంతాన సాఫల్య కేంద్రంగా నిలుస్తున్నది. వేలాది కిలోమీటర్ల దూరం నుంచి వందలాది రంగురంగుల రెక్కల కొంగలు సంక్రాంతి వేళ గ్రామానికి చేరి, ఇక్కడే నెలలపాటు విడిది చేసి తమ సంతానాన్ని పెంపొందించుకొని పిల్లలతో తమ ప్రాంతానికి తిరిగి వెళ్తాయి. గ్రామంలోని గోపి చెరువును ఆధారం చేసుకొని ఏటా నవంబర్‌, డిసెంబర్‌లో నివాసం ఏర్పరుచుకుంటాయి. నాలుగేళ్ల క్రితం ఈ చెరువు ఎండిపోవడంతో పక్షులు రాలేదు. రెండేళ్ల నుంచి దేవాదుల నీటితో చెరువు నిండుతుండడంతో సైబీరియన్‌ పక్షులు మళ్లీ వస్తున్నాయి. దేవరుప్పుల వాగుపై చౌడూరు, పెదమడూరు, కడవెండి, దేవరుప్పుల వద్ద కట్టిన చెక్‌డ్యాంలు నిండు కుండలా ఉండడంతో 12 కిలోమీటర్ల మేర నీరు నిలవడంతో అన్ని రకాల పక్షులకు చేపల వేటకు ఇక్కడి వాతావరణం అనుకూలంగా మారింది.

జమాండ్ల పల్లి శివారులో కొంగర గిద్ద పక్షి

మహబూబాబాద్‌ మండలం జమాండ్ల పల్లి శివారులో కొంగర గిద్ద పక్షి కనిపించింది. ఇలాంటి పక్షి కనిపించక 20 ఏళ్ల పైనే అయ్యిందని స్థానికులు తెలిపారు. కురవి మండల శివారులో వడ్రంగి పిట్టలు సుమారు పదిహేనేళ్ల తర్వాత కనిపించాయని చెప్పారు.

దేవునూర్‌లో పునుగుపిల్లి

వరంగల్‌ అర్బన్‌ జిల్లా ధర్మసాగర్‌ మండలం దేవునూర్‌లో ఈనెల 14న ఓ రైతుకు చెందిన బావిలో పునుగు పిల్లి కనిపించింది. అటవీశాఖ అధికారులు దానిని బయటకు తీసి ఇది అత్యంత అరుదైన జంతువని గుర్తించారు. ఎక్కువగా ఇవి తిరుమల తిరుపతి అటవీ ప్రాంతంలో ఉంటాయని చెప్పారు. ఈ జంతువు దేవునూర్‌ అటవీ ప్రాంతంలో కనిపించడం చాలా అరుదు అని వివరించారు. సుంగంధ ద్రవ్యాల మొక్కల పూల వాసన చూస్తుందని, కాఫీ కాయలు తిని గింజలను విసర్జిస్తాయని, ఈ గింజల నుంచి కాఫీని తయారు చేస్తారని, ఇది అత్యంత ఖరీదైనదని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వ చొరవతోనే..


దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని రీతిలో తెలంగాణలో పచ్చదనం పెరుగుతున్నది. మైదాన ప్రాంతాలు కూడా గ్రీనరీగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ విధానాలే ఇందుకు దోహదపడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అడవుల పెంపుదలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. పలుచబడిన అడవుల స్థానంలో హరితహారం ద్వారా ప్లాంటేషన్‌ చేస్తున్నది. 20ఏళ్ల తర్వాత ఇక్కడికి పులి వచ్చిందంటే ఇక్కడ దట్టమైన అడవులు తయారయ్యాయనేందుకు నిదర్శనం. ఇన్నాళ్లూ ఉత్తర భారతానికే పరిమితమైన డస్క్‌ ఈగల్‌ మన పాకాల ప్రాంతానికి రావడం విశేషం.

 - ఎంజే అక్బర్‌, అటవీశాఖ వరంగల్‌ సర్కిల్‌ కన్జర్వేటర్‌