బుధవారం 02 డిసెంబర్ 2020
Warangal-rural - Sep 19, 2020 , 05:43:44

ఆన్‌లైన్‌ క్లాసులతో మొబైల్‌, ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌లకు ఫుల్‌ డిమాండ్‌

ఆన్‌లైన్‌ క్లాసులతో మొబైల్‌, ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌లకు ఫుల్‌ డిమాండ్‌

  • ఆర్థికభారమైనా పిల్లల కోసం కొంటున్న తల్లిదండ్రులు
  • పాత ఫోన్లు, కంప్యూటర్లకూ రిపేర్లు
  • ఇదే అదునుగా పెరిగిన రేట్లు

కరోనా.. కొత్త జీవన శైలిని తెచ్చిపెట్టింది. దూరభారాలు తగ్గించినా ఆర్థిక, మానసిక భారాన్ని మోపుతున్నది. ఆఫ్‌లైన్‌ జీవితాలను సైతం ఆన్‌లైన్‌లోకి నెట్టింది. ముఖ్యంగా విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ రంగంలో అనేక మార్పులు వచ్చాయి. ఇప్పటికీ పాఠశాలలు ప్రారంభించే అవకాశాలు లేకపోవడంతో విద్యార్థులు ఇంట్లోనే ఆన్‌లైన్‌ తరగతులు వినాల్సి వస్తున్నది. ఈ క్రమంలో కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు, టీవీలు, ట్యాబ్‌లకు మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగింది. ఆర్థిక భారమైనా పిల్లల కోసం తల్లిదండ్రులు కొనాల్సి వస్తున్నది. ఇక ఇంట్లో ఇద్దరు, ముగ్గురు పిల్లలుంటే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. 

 - రెడ్డికాలనీ  

కొవిడ్‌ -19.. ఎక్కడివారినక్కడ కట్టిపడేసింది. ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న ఈ వైరస్‌ మూలంగా పాఠశాలలు మూతపడి, స్కూళ్లు ఆన్‌లైన్‌ క్లాసులకు మళ్లాయి. దూరదర్శన్‌, టీ-శాట్‌ ద్వారా ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు టీవీల్లో తరగతులు బోధిస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు ఆన్‌లైన్‌ క్లాసులు నడుపుతున్నాయి. కాగా ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివే పిల్లలకు కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు నిత్యావసరాలయ్యాయి. 

 20 నుంచి 30 శాతం పెరిగిన రేట్లు..

ఆన్‌లైన్‌ క్లాసుల కోసం కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు అవసరం కావడంతో వాటి విక్రయాలు అమాంతం పెరిగాయి. వాటి ధరలకు కూడా రెక్కలొచ్చాయి. ఒక్కసారిగా 20 నుంచి 30 శాతం అదనంగా పెరిగినట్లు షాపుల నిర్వాహకులు చెబుతున్నారు. సెల్‌ఫోన్ల రేట్లు పెంచి వివిధ రకాల ఫ్రీ గిఫ్ట్స్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటున్నారని ఇటు తల్లిదండ్రులు వాపోతున్నారు. 

కంప్యూటర్‌, సెల్‌ఫోన్లకు గిరాకీ 

జిల్లాలో ఇప్పుడు కంప్యూటర్‌, సెల్‌ఫోన్లకు ఫుల్‌ గిరాకీ ఏర్పడింది. ప్రైవేట్‌ పాఠశాలలు ప్రత్యేకంగా జూమ్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ తరగతులు బోధిస్తున్నాయి. ఇందుకు ప్రత్యేక టైం టేబుల్‌ ఏర్పాటు చేశాయి. తల్లిదండ్రులు కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోన్లలో జూమ్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. ఈ క్రమంలో వాటి కొనుగోళ్లు సైతం ఒక్కసారిగా పెరిగాయి. కంప్యూటర్‌తో పాటు, కెమెరా తదితర పరికరాల కోసం ఇప్పుడు షాపులకు క్యూకడుతున్నారు. దీంతో మార్కెట్లు సందడిగా కనిపిస్తున్నాయి.