గురువారం 22 అక్టోబర్ 2020
Warangal-rural - Sep 17, 2020 , 02:22:10

దైన్యం నుంచి ద‌ర్జా వైపు...

దైన్యం నుంచి ద‌ర్జా వైపు...

  • ఆ నౌకరంటెనే నరకం..!
  • నాడు హీనంగా వీఆర్‌ఏ కొలువు
  • వ్యవస్థ రద్దుతో తప్పిన వెట్టిచాకిరీ
  • కాంగ్రెస్‌ హయాం నుంచీ తిప్పలే
  • కేసీఆర్‌ ప్రభుత్వంలో రూ.6500 నుంచి రూ.10,500కు వేతనం పెంపు
  • ఇప్పుడు పే స్కేల్‌, ఉద్యోగ భద్రత ప్రకటనపై హర్షాతిరేకాలు
  • కుటుంబాల్లో వెల్లివిరుస్తున్న ఆనందం

 నాడు హీనంగా.. బానిసల్లా బతుకీడ్చిన మస్కూరి (వీఆర్‌ఏ)ల కొలువుల్లో కొత్త వెలుగు వచ్చింది. ఓ వైపు పట్వారీల పెత్తనం.. అధికారుల సూటిపోటిమాటలు.. మోయలేని పనిభారం కలగలిపి ‘రెవెన్యూ చట్రం’ కింద నలిగి.. తాతలు, తండ్రులు.. వారి వారసులు అనుభవించిన అంతులేని ఆవేదనకు తెరపడింది. అవినీతిలో కూరుకుపోయిన ‘వీఆర్వో వ్యవస్థ’ రద్దు కావడం, పే స్కేల్‌ ఉద్యోగంతో పాటు ఉద్యోగోన్నతులు కల్పిస్తామనే సర్కారు ప్రకటన.. వారి బతుకులకు కొండంత భరోసా, ఆ ఇంట సంతోషాన్నిచ్చింది. ప్రభుత్వాలు మారినా తమ తలరాత మారడం లేదంటూ ఇన్నాళ్లూ నిట్టూర్చిన దైన్యం నుంచి ఇప్పుడు దర్జాగా పనిచేస్తామనే ధీమా వారిలో కనిపిస్తున్నది. చాలీచాలని వేతనాలతో నెట్టుకొచ్చిన వీఆర్‌ఏలకు తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే రూ.6వేల నుంచి రూ.10,500 పెంచగా, ప్రస్తుతం ఉద్యోగ భద్రత కల్పించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.    

 - లింగాలఘనపురం

      వీఆర్‌ఏలకు స్కేల్‌ పోస్టు ఇస్తాం..


వీఆర్వో, వీఆర్‌ఏలకు ఉద్యోగ భద్రత ఉంటుంది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అధికారులు అందరూ ఉంటరు. ఎవర్నీ తీసేయం. వీఆర్వో వ్యవస్థను తీసేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో చేశారు. ఇప్పుడూ అనివార్యమై చేస్తున్నం. ప్రభుత్వం మీద ఏడాదికి రూ.260 కోట్ల ఆర్థిక భారం పడుతున్నా వారికి స్కేల్‌ ఉద్యోగం కల్పిస్తున్నం. తరతరాలుగా వారందించిన సేవలకు గుర్తుగా నిర్ణయం తీసుకున్నం.

- ఈ నెల 9న అసెంబ్లీలో కొత్త రెవెన్యూ చట్టం బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం కేసీఆర్‌


లింగాలఘనపురం : నాటినుంచి దుర్భర పరిస్థితులను అనుభవించిన వీఆర్‌ఏలకు మంచిరోజులొచ్చాయి. వీఆర్వో వ్యవస్థ రద్దుతో వీఆర్వో, వీఆర్‌ఏ కొలువులకు మంగళం పాడిన సర్కారు.. వారిని ప్రత్యామ్నాయంగా సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. పేస్కేల్‌తో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తూ సీఎం కేసీఆర్‌ స్పష్టమైన ప్రకటన చేయడంపై వంశపారంపర్యంగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. 

నాడు దుర్భరంగా కొలువు..

గ్రామాల్లో ఏ ప్రభుత్వ కార్యక్రమమైనా వీఆర్‌ఏలదే ప్రధాన పాత్ర. టెంట్‌హౌస్‌లకు వెళ్లి బల్లలు తేవాలన్నా.. కుర్చీలు వేయాలన్నా వారే కావాలి. ముఖ్యంగా రెవెన్యూ అధికారులు ఏక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లాల్సిందే. బంట్రోతు కంటే హీనంగా పనులు చేయాల్సిన దుస్థితి ఉండేది. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ పథకాల ప్రచారాలు చేసేందుకు గ్రామానికి ఏ అధికారి వచ్చినా.. ‘జీ హుజూర్‌' అంటూ సెల్యూట్‌ కొట్టాల్సిందే. ఇక రోడ్డు ప్రమాదాలు జరిగినా, ఆత్మహత్యలు చేసుకున్నా.. పంచనామా తతంగం ముగిసేదాకా వీఆర్‌ఏలు మృతదేహాల వద్ద జాగారం షరామామూలే. కొన్ని సందర్భాల్లో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దేహం ఛిద్రమైతే.. వాహనంలోకి తరలించాలంటే.. ఆ మృతదేహాన్ని పట్టుకోవాలంటే జనం జంకుతారు. వీఆర్‌ఏలకు మాత్రం ఆ విధి తప్పదు. గ్రామాల్లో కొన్ని కులాలకు చెందిన వారు వంశపారంపర్యంగా వీఆర్‌ఏలుగా పనులు చేస్తున్నారు. తాతముత్తాతల కాలం నుంచి చాలీచాలని వేతనాలతో బతుకుబండిని లాక్కొస్తున్నారు. కనీస వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని టెంట్లు వేసి నెలల తరబడి సమ్మెలు చేసినా ఇప్పటివరకూ ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాతే వారి ఉద్యోగాలకు వెలుగు వచ్చింది. వేతనాలు పెరగడంతో పాటు ప్రస్తుతం ఉద్యోగోన్నతులు దక్కుతున్నాయి.

టీఆ ర్‌ఎస్‌ హయాంలోనే  పెరిగిన వేతనం..

కాంగ్రెస్‌ హయంలో వీరి వేతనం రూ.6500 ఉండేది. గ్రామస్థాయిలో పడుతున్న కష్టాలు, పనిభారం, ఇతర అంశాలను గుర్తించిన టీఆర్‌ఎస్‌ సర్కారు ఒకేసారి వీరి వేతనాన్ని రూ.10500కు పెంచింది. ఇప్పుడు అడుగకముందే వరాలిచ్చిన దేవుడంటూ వీఆర్‌ఏలు సీఎం కేసీఆర్‌ను తమ గుండెల్లో పెట్టుకుంటున్నారు. వీఆర్వో వ్యవస్ధ రద్దుతో తమకు సముచిత స్థానం దక్కనుందంటూ సంబురపడుతున్నారు. వీఆర్‌ఏలను జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం కలిగిస్తామని, పేస్కేలు చెల్లిస్తామని, విద్యార్హతను బట్టి పదోన్నతులు కలిగిస్తామని, వారసులకు ఉద్యోగావకాశాలు కలిగిస్తామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించడంపై వారిలో సంతోషం రెట్టింపయ్యింది. జనగామ జిల్లాలో ప్రభుత్వం రిక్రూర్‌మెంట్‌ ద్వారా 130 మందిని నియమించగా, వారసత్వంగా 480 మంది వీఆర్‌ఏలుగా పనిచేస్తున్నారు. లింగాలఘనపురం మండలంలో 12 మంది రిక్రూర్‌మెంట్‌ ద్వారా 25మంది వారసత్వంగా పనిచేస్తున్నారు. ఫలితంగా మొత్తం జిల్లాలో 610 కుటుంబాల్లో వెలుగులు నిండనుండడంతో వారు ఆనందంలో మునిగితేలుతున్నారు.

పేస్కేల్‌ ఇస్తామనడం ఆనందంగా ఉంది..

నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్న ఈ రోజుల్లో విధిలేక చాలీచాలని వేతనంతో పనిచేస్తున్నాం. పేస్కేల్‌ ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. అంతేగాకుండా డిగ్రీ చదివినా విధిలేక ఉద్యోగం చేస్తున్నాం. మా విద్యార్హత బట్టి పదోన్నతులిస్తామనడం చాలా ఆనందంగా ఉంది.

- దాసరి భాగ్య, రిక్రూట్‌మెంట్‌ వీఆర్‌ఏ,  బండ్లగూడెం

ఆ నౌకరంటెనే నరకం..!


మా తాతల కాన్నుంచి ఇదే నౌకరీ. కొలువు పేరు మారింది తప్ప ఏం ఫాయిదా లేదు. మా తాత పాశం బాలయ్య ఏలోడిగా పనిచేశిండట. మస్కూరీ అంటరు. అప్పుడు ఆయినె జీతం 20 రూపాయలు. పట్వారీలైతే అసలు మనిషి లెక్కనే చూడకపోయేది. మంచిగ తెల్లబట్టలు వేసుకోవద్దు.. కాళ్లకు చెప్పులుండద్దు. పట్వారీ కాన్నుంచి గిర్దావర్‌, తాసిల్దార్‌, ఏ ఆఫీసరచ్చినా బాంచెన్‌ కాల్మొక్తా అని దండం పెట్టాలె. లేకుంటె బలి.. ందా?

లం.. కొడుకా అని తిట్టెటోళ్లు. కిలోమీటర్ల కొద్దివోయి రైతులను పట్వారీ దగ్గరికి తోల్కపోవాలె. ఆమ రకాలు (భూ శిస్తు) కట్టియ్యాలన్నట్టు. అప్పుడు రైతులు దొర్కకున్నా.. వాళ్ల దగ్గర పైసలు వసూలు చెయ్యకున్నా ఇగ మా పనైనట్టే. మోటు మాటలు ఇడిశేది.. అవి చెప్పరాదు. ఆయినే గట్లంటే ఇగ బ్యాంకోల్లది ఇంకోతీరు. వాళ్లు ఊళ్లెకు వచ్చిన్రంటే బాకీలున్నోళ్ల ఇండ్లు ఎక్కడున్నయే మేమే సూపెట్టాలె. అత్తరు చూసి అడిగిపోతరు.. అంత బారాబరే గానీ..

అటెన్క ఆ రైతులు మమ్ముల తిట్టిపోస్తరు. ఎందుకు చూపెట్టినవ్‌రా ...కొడుకా(?) అని. అదైనంక దొంగ సార కాశెటోళ్ల గురించి చెప్పుమని పోలీసోళ్లు హుకుం ఇచ్చేటోళ్లు. గిట్లనే వాళ్లు అచ్చుడు.. మేం చూపిచ్చుడు.. మేం తిట్లవడుడు. మా అన్న పాశం భిక్షపతి రూ.200 జీతానికి పనిచేశిండు. ఊళ్లె ఏ మీటింగైనా ఆడికి పోవుడేనాయె. కొత్తోళ్లు (సంచారజాతులు) ఎవలు వచ్చినా వీఆర్వో దగ్గరికి తీస్కపోయి వాళ్ల వివరం రాయించాలె.

ఇది సాలదన్నట్టు ఎవలన్న ఉరేసుకున్నా, పురుగుల మందు తాగినా, ఇంకెట్ల సచ్చినా మా సావుకచ్చేది. పంచనామా అయ్యేదాన్క శవంతోనే జాగారం జెయ్యాలె. ఒక్కోసారి వాసన బాగా అత్తాందని శవాన్ని వాళ్ల ఇంట్లోల్లే బండ్లె ఎక్కియ్యడాన్కి ఎన్కముందయ్యేటోళ్లు. మళ్లా అప్పుడు మేమే ముంగట వడి మోస్కపోయేది. గిట్ల ఎంతమందితోటి ఏగినమో గీ కొల్వు చేసినోళ్లకే తెల్తది. మా తాత, మా అన్న, ఇప్పుడు నేను నాటినుంచి గీ నౌకర్ల ఎన్ని తిప్పలవడాల్నో అన్నివడ్డం. ఇగ నేను కొలువులజేరినప్పుడు రూ.6200 వస్తుండె. పని బాగున్నది సారూ పెంచుమని ఎన్నిసార్ల మొత్తుకున్నా, టెంట్లు ఏశినా పట్టించుకోలే. మళ్ల తెలంగాణ అచ్చి కేసీఆర్‌ సారు ముఖ్యమంత్రి అవుట్ల మా జీతం 10వేల 500 అయ్యింది.

ఇగ మొన్న వీఆర్వో వ్యవస్థ మొత్తం బంద్‌జేసుడుతోటి సంబురమైంది. గీ కొలువుల ఎంత గోసపడ్డమో మాకే ఎరుక. మమ్ముల వేరే డిపార్ట్‌మెంట్లకు మార్చుతరట. జూనియర్‌ అసిస్టెంట్‌ ఇస్తరని తెల్వంగనే పానం లేశచ్చినట్టయ్యింది. మా తాత గిట్ల బానిస లెక్క బతికిన్రు. గొడ్డు చాకిరి జేశిన్రు. ఇగ రంది వోయింది. గిదంత కేసీఆర్‌ సార్‌ పుణ్యమే. ఆయనకు గీ ఆలోచన అచ్చుడు మా అదృష్టం. నిజంగ దేవునిలెక్క మా మీద దయజూపిండు. మా బతకులు మార్చడానికే చేసిండనిపిస్తాంది. ఇప్పుడిగ మంచిగ కొలువు చేసుకుంటం. దర్జాగ బతుకుతం.

- పాశం యాకయ్య, వంశపారంపర్య వీఆర్‌ఏ, గుమ్మడవెల్లి (జనగామ జిల్లా)

logo