మంగళవారం 01 డిసెంబర్ 2020
Warangal-rural - Sep 15, 2020 , 07:43:17

ధాన్యం కొనుగోళ్ల కోసం ప్రణాళిక సిద్ధం

ధాన్యం కొనుగోళ్ల కోసం ప్రణాళిక సిద్ధం

  • ఈసారి దిగుబడి అంచనా 2.81 లక్షల మెట్రిక్‌ టన్నులు
  •  గతేడాది కంటే పెరిగిన వరి సాగు విస్తీర్ణం
  •  వచ్చే నెల నుంచి కొనుగోళ్లు ప్రారంభం
  • కొవిడ్‌తో పెరుగనున్న కేంద్రాలు
  • ఏఎంసీలకు కేటాయించే అవకాశం
  •  మద్దతు ధర క్వింటాల్‌కు రూ.53 పెంపు

వానకాలం సీజన్‌ ధాన్యం కొనుగోళ్ల కోసం ప్రణాళిక సిద్ధమైంది. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా వస్తున్న కాళేశ్వర జలాలకు తోడు వర్షాలు విస్తారంగా కురవడంతో ఈసారి వరి సాగు గణనీయంగా పెరిగింది. ఫలితంగా వరంగల్‌ రూరల్‌ జిల్లాలో రూ.2.81 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి రానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గతేడాది కంటే 30వేల టన్నులు ఎక్కువగా వడ్లు రానుండడంతో, కొవిడ్‌ కారణంగా 145 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. వీటిలో కొన్నింటిని ఏఎంసీలకు కేటాయించే అవకాశముంది. వచ్చే నెల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుండగా  గన్నీ సంచులను సమకూర్చే పనిలో సివిల్‌ సప్లయ్‌ శాఖ నిమగ్నమైంది.

- వరంగల్‌ రూరల్‌, నమస్తే తెలంగాణ

 వరంగల్‌ రూరల్‌, నమస్తే తెలంగాణ

వానకాలం ధాన్యం కొనుగోలుకు యాక్షన్‌ ప్లాన్‌ రెడీ అయ్యింది. కాళేశ్వర జలాలతో పాటు ప్రాజెక్టులు, చెరువుల కిందే కాకుండా భూగర్భ జలమట్టం పెరగడం వల్ల రైతులు బోరుబావుల కింద కూడా వరినాట్లు వేశారు. దీంతో ఈ సీజన్‌లో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈమేరకు రైతులు ఎన్ని ఎకరాల్లో వరి సాగు చేశారు? దిగుబడి ఎంత రానుందనే వివరాలు సేకరించిన అధికారులు 2.81లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వచ్చే అవకాశముందని ప్రాథమికంగా అంచనా వేశా రు. వచ్చే నెల నుంచి కొనుగోళ్లు ప్రారంభించనున్నారు.

రూరల్‌ జిల్లాలో 52వేల ఎకరాల్లో..

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో వానకాలం సీజన్‌లో 52,418 ఎకరాల్లో వరి సాగులోకి వచ్చింది. ఈ మేరకు 2.81 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని పౌర సరఫరాల సంస్థ అధికారులు అంచనా వేశారు. ఇందులో సుమారు 71 వేల టన్నులు స్థానిక అవసరాలకు పోను, మిగతా 2.10 లక్షల మెట్రిక్‌ టన్నులను రైతుల నుంచి కొనుగోలు చేయాల్సి ఉందని ప్రభుత్వానికి నివేదించారు. ఇటీవల జిల్లా అదనపు కలెక్టర్‌ ఆర్‌.మహేందర్‌రెడ్డి పౌర సరఫరాల, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ అధికారులతో సమావేశమై వరి సాగు, దిగుబడి అంచనా, ధాన్యం కొనుగోళ్లు, గన్నీ సంచులు, కొనుగోలు కేంద్రాలతో పాటు స్థానిక అవసరాలకు అవసరమయ్యే ధాన్యం, తదితర వివరాలు తీసుకొని ధాన్యం కొనుగోలుకు యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేయాలని సూచించారు. గత వానకాలం సీజన్‌లో రైతుల నుంచి నేరుగా 1.77 లక్షల టన్నులు కొనుగోలు చేయగా ఈసారి 2.10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించనుంది. గతేడాది కంటే అదనంగా 33వేల టన్నులు కొనుగోలు చేయనుంది. ఈ మేరకు పౌర సరఫరాల అధికారులు గన్నీ సంచులను సమకూర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

పెరుగనున్న కేంద్రాలు..

పెరిగిన సాగు విస్తీర్ణంతో పాటు కొవిడ్‌ నేపథ్యంలో ఈ సారి ధాన్యం కేంద్రాలు పెరుగనున్నాయి. వైరస్‌ వ్యాపించకుం డా ముందుజాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాలో గత వానకాలం సీజన్‌లో గ్రామాల్లో 119 కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ సారి మరో 25 నుంచి 30 పెంచి సుమారు 145 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈసారి కొత్తగా కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్‌లు, ఐకేపీతో పాటు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ(ఏఎంసీ)లకు కేటాయించనున్న ట్లు అదనపు కలెక్టర్‌ వెల్లడించారు. 20 కేంద్రాలను ఏఎంసీలకు కేటాయించే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు ‘నమస్తేతెలంగాణ’కు చెప్పారు.

ధాన్యం మద్దతు ధర పెంపు

ధాన్యం మద్దతు ధర ఈసారి క్వింటాల్‌కు రూ.53 పెరిగింది. గతేడాది క్వింటాల్‌ మద్దతు ధర గ్రేడ్‌ ‘ఎ’ రకం రూ.1,835, కామన్‌ రకం రూ.1,815 అమలైంది. ఈ ధర ఇటీవల గ్రేడ్‌ ‘ఎ’ రకం రూ.1,888, కామన్‌ రకం రూ.1,868 కి పెరిగింది. కొత్త మద్దతు ధరపై ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయనుంది. రైతులకు మద్దతు ధర దక్కాలనేదే ప్రభుత్వ లక్ష్యం. రైతుల నుంచి నేరుగా కొనే ధాన్యాన్ని కస్టమ్‌ మిల్ట్‌డ్‌ రైస్‌ (సీఎంఆర్‌) విధానంపై ప్రభుత్వం రైస్‌మిల్లులకు కేటాయించనుంది. జిల్లాలో అక్టోబరులో మొదలయ్యే వానకాలం సీజన్‌ ధాన్యం కొనుగోలు నవంబరు నెలాఖరు వరకు కొనసాగనుంది.