శనివారం 28 నవంబర్ 2020
Warangal-rural - Sep 11, 2020 , 06:31:43

నిజాం కాలంలో భూ సర్వే

నిజాం కాలంలో భూ సర్వే

  •  అప్పట్లో అంతా మహారాష్ట్ర సిస్టం
  •  95 ఏండ్ల నుంచి మళ్లీ ఇక్కడ సర్వే లేదు
  • ఒక ఊరి సర్వేకు పాతికేళ్లు పట్టేది
  •  కొత్త రెవెన్యూ చట్టం రావడం శుభపరిణామం
  •  సీఎం కేసీఆర్‌ నిర్ణయం హర్షణీయం
  •  సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ రిటైర్డ్‌ ఇన్‌స్పెక్టర్‌ కొమురెల్లి

వరంగల్‌ రూరల్‌, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్‌ తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టంతో భవిష్యత్తులో ఇక భూ వివాదాలకు తావుండదు. గ్రామాల్లో భూమి పంచాయతీలకు తెరపడుతుంది. ఎక్కడికక్కడ సర్వే చేసి భూములకు హద్దులు పెడుతారు గనుక అన్నీ రికార్డుల్లో పక్కాగా ఉంటాయి. ఒకరిద్దరు అభ్యంతరం చెప్పినా పరిష్కరించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్‌ ఉంది కదా. ఇక సమస్యే ఉండదు. తెలంగాణలో నిజాం కాలంలో అంటే దాదాపు 95 ఏండ్ల కింద భూసర్వే జరిగింది. ఇప్పుడున్న రికార్డులన్నీ నాడు మహారాష్ట్ర సిస్టమ్‌తో చేసినవే. ఆ నక్ష కాగితాలతో ఇన్నాళ్లు కొలిచారు. అప్పటికీ ఇప్పటికే ఎన్నోమార్పులు జరిగాయి. రోడ్లు, భవనాల నిర్మాణం వాగులు, వంకల వల్ల కొన్ని భూములు రికార్డుల్లోకి ఎక్కలేదు. సర్వే ల్యాండ్‌ రికార్డు యాక్టు ప్రకారం ప్రతి 25 ఏండ్లకోసారి సర్వే చేయాల్సి ఉన్నా అలా జరగలేదు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కొన్ని చోట్ల రీసర్వే చేసినా చాలాచోట్ల అమలుకాలేదు. కార్యరూపం దాల్చడానికి పాతికేళ్లు పట్టింది. ఉదాహరణకు హన్మకొండ వడ్డేపల్లిలో 1948 సంవత్సరంలో రీసర్వే చేస్తే 1975నుంచి అమల్లోకి వచ్చింది. ఈ 27 ఏండ్లలో ఇక్కడ ఎన్నో మార్పులు జరిగాయి. రోడ్లు, భవనాలు వెలిశాయి. అలాగే వరంగల్‌ శివారు మడికొండలో కూడా 1948లో రీసర్వే చేసినా అమలు చేయలేదు. చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి. నర్సంపేట ఏరియాలోనూ రీసర్వే జరిగినప్పటికీ అమల్లోకి రాలేదు. నిజాం కాలంలో ఒక ఊరిలో సర్వే చేసేందుకు 20 నుంచి 25 ఏండ్లు పట్టినట్లు పూర్వీకులు చెప్పారు. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. సర్వే కోసం కొత్త కొత్త మిషన్లొచ్చినయ్‌. జీపీఎస్‌, ఈటీఎస్‌, డీజీపీఎస్‌.. అదీగాక డ్రోన్‌తోనూ సర్వే చేస్తున్నారు. గూగుల్‌ సర్వే కూడా జరుగుతోంది. సీఎం కేసీఆర్‌ కొత్త రెవెన్యూ చట్టం తేవడం వల్ల మళ్లీ ఇన్నాళ్లకు సర్వే జరగనుంది.

నాలుగైదేళ్ల కింద కరీంనగర్‌తో పాటు ఇతర జిల్లాల్లోనూ ప్రయోగాత్మకంగా సర్వే చేశారు. ప్రస్తుతం ఉన్న గెట్ల ప్రకారం, ఫిజికల్‌గా ఉన్న భూములను సర్వే చేసి రైతుల సమక్షంలో కొలుస్తారు. వెంటనే కొలతల ప్రింట్‌ కాపీని వారికి అందజేస్తారు. సర్వే, కొలతల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తేడా రాదు. గెట్ల వద్ద ఏమైనా వివాదాలు వస్తే ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి త్వరలోనే పరిష్కరించుకోవచ్చు.

99శాతం సర్వే సాఫీగా జరుగుతుంది. విలేజీల్లో కన్వర్ట్‌ చేసుకోకుండా పట్టా భూముల్లో కట్టిన ఇండ్లు కూడా ఈసారి సర్వేలో తేలుతాయి. అంతేకాదు పట్టా భూముల్లో నిర్మించిన రోడ్లు, భవనాలు, సబ్‌స్టేషన్లు, ఇతర కట్టడాలన్నీ బయటపడుతాయి. పట్టా భూములను కొలిస్తే ప్రభు త్వ, పోరంబోకు, చెరువు శిఖాలు, గుట్టల భూముల హద్దుల లెక్కలు తెలుస్తాయి. గతంలో మాదిరి కాకుండా సాధ్యమైనంత తొందరగా సర్వే పూర్తవుతుంది. సర్వేతో గ్రామం వారీగా కొత్త నక్షలు తయారైతయి. ధరణి పోర్టల్‌లో టీపన్లు, నక్షలు సైతం ఉంటాయి. ఎప్పుడైనా చూసుకోవచ్చు.