మంగళవారం 19 జనవరి 2021
Warangal-rural - Sep 05, 2020 , 02:23:12

హసన్‌పర్తి ఎస్సై సస్పెన్షన్‌

హసన్‌పర్తి ఎస్సై సస్పెన్షన్‌

  • ముగ్గురు కానిస్టేబుళ్లపైనా వేటు
  • పేకాట కేసుల్లో అవినీతి ఫలితం
  • సీపీ ప్రమోద్‌కుమార్‌ ఉత్తర్వులు

హసన్‌పర్తి: హసన్‌పర్తి ఠాణాలో పోలీసులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ పీ ప్రమోద్‌కుమార్‌ సీరియస్‌గా స్పందించారు. సమగ్ర విచారణ అనంతరం ఎస్సైని, ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేస్తూ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. వేర్వేరు పేకాట కేసుల్లో అవినీతికి పాల్పడ్డారన్న కారణంగా ఎస్సై పవన్‌కుమార్‌తో పాటు మరో ముగ్గురు కానిస్టేబుళ్లు టీ సంతోష్‌, ఎస్‌ తిరుపతి, ఎన్‌ మొగిలిని సస్పెండ్‌ చేశారు. సదరు ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు సంతోష్‌, తిరుపతి కలిసి గత నెల 20న ఆరెపల్లిలో పేకాట శిబిరంపై దాడి చేశారు. అక్కడ స్వాధీనం చేసుకున్న డబ్బుకంటే చాలా తక్కువ మొత్తాన్ని ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయడంతో పాటు ఇద్దరు నిందితులను కేసు నుంచి తప్పించినట్లు ఆరోపణలు వచ్చాయి.

విచారణ అనంతరం నివేదిక ఆధారంగా ఎస్సై పవన్‌కుమార్‌, కానిస్టేబుళ్లు సంతోష్‌, తిరుపతిని సస్పెన్షన్‌ చేస్తూ సీపీ ఉత్తర్వులిచ్చారు. ఇక కానిస్టేబుల్‌ మొగిలి మరో ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి జూన్‌ 30న హసన్‌పర్తి మండలం జయగిరి హిల్స్‌ ప్రాంతంలో పేకాట శిబిరంపై దాడి చేశారు. స్వాధీనం చేసుకున్న డబ్బుతోపాటు నిందితుల్లో ఒకరి నుంచి వసూలు చేసిన రూ. 7 వేలను ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయకపోవడంపై ఆరోపణలు రాగా ఉన్నతాధికారులు విచారణ జరిపి నివేదిక ఇవ్వడంతో మొగిలిని సైతం సస్పెండ్‌ చేస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు. కాగా, మరింత మందిపైనా సస్పెన్షన్‌ వేటు పడనున్నట్లు విశ్వసనీయ సమాచారం.