శనివారం 28 నవంబర్ 2020
Warangal-rural - Sep 05, 2020 , 02:23:12

పాల ఉత్పత్తి.. ఆర్థిక ప్రగతి..

పాల ఉత్పత్తి.. ఆర్థిక ప్రగతి..

  •  n జిల్లాల్లో మినీ డెయిరీల ఏర్పాటుకు సర్కారు ప్రణాళిక
  • n పేదలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ముందుకు
  • n ఒక్కో యూనిట్‌ విలువ రూ.4లక్షలు
  • n తొలి విడుత రూరల్‌ జిల్లాలో 611 మంది లబ్ధిదారుల ఎంపిక
  • n ‘డెయిరీ డెవలప్‌మెంట్‌ సొసైటీ’ల ఆవిర్భావం
  • n ప్రభుత్వం నుంచి రూ.14.66కోట్ల సబ్సిడీ విడుదల
  • n గేదెల కొనుగోలుకు అధికారుల సమాయత్తం 

తెలంగాణలో పశు సంపదను, పాల ఉత్పత్తులను మరింతగా పెంచి, పేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. జిల్లాల్లో మినీ డెయిరీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించి కొన్ని జిల్లాలను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. తొలి విడుత వరంగల్‌ రూరల్‌ జిల్లాలో మినీ డెయిరీల స్థాపన కోసం రూ.14.66కోట్లు విడుదల చేసింది. యూనిట్‌ వ్యయంలో అరవై శాతం సబ్సిడీ ఇవ్వనుండగా, ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక, సొసైటీల ఏర్పాటు పూర్తి చేసి, పాల సేకరణ కేంద్రాలు, రూట్లను ఖరారు చేసిన అధికారయంత్రాంగం, గేదెలు కొనుగోలు చేసి ఇచ్చేందుకు సమాయత్తమవుతున్నది. 

వరంగల్‌రూరల్‌, నమస్తేతెలంగాణ : రాష్ట్రంలో పాల ఉత్పత్తిని గణనీయంగా పెం చి, పేదలకు ఆర్థిక చేయూతనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు జిల్లాల్లో మినీ డెయిరీలను ఏర్పాటు చేయనున్నది. కొన్ని జిల్లాలను పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేయగా, ఇందులో వరంగల్‌ రూరల్‌ జిల్లా కూడా ఉంది. తొలి విడుత ఈ జిల్లాలో యూనిట్ల స్థాపన కోసం ప్రభుత్వం రూ.14.66 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు అధికారులు ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేసి, సొసైటీలను ఏర్పాటు చేశారు.  ముఖ్యంగా దళితులను ఉపాధి రంగంలో ప్రోత్సహించేందుకు వారికి మినీ డెయిరీ యూనిట్లు మంజూరు చేసేలా ప్రభుత్వం ఈ సరికొత్త పథకానికి రూపకల్పన చేసింది. యూనిట్‌ వ్యయం లో 60 శాతం సబ్సి డీ కింద, నలభై శాతం బాంకు రుణం ఇప్పించనుంది. ఎలాంటి ష్యూరిటీ లేకుండానే 40శాతం రుణాలు ఇస్తుండడం గమనార్హం.   

రూరల్‌ జిల్లాలో 611 మంది  లబ్ధిదారుల ఎంపిక

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో తొలి విడుత చెన్నారావుపేట, దుగ్గొండి, ఖానాపురం, నర్సంపేట, ఆత్మకూరు, దామెర మండలాల్లోని దళితులకు మినీ డెయిరీ యూనిట్లు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. నిబంధనల ప్రకారం మినీ డెయిరీపై అవగాహన కలిగి, 20 గుంటల భూమి ఉండి ఎస్సీ కార్పొరేషన్‌లో రుణం తీసుకోని వారు ఈ పథకానికి అర్హులు.  ఇటీవ ల ఆరు మండలాల నుంచి 1,136 మంది దీని కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. మండల స్థాయి కమిటీలు వాటిని పరిశీలించి అర్హులైన 611 మందిని ఎంపి క చేశాయి.  145 మం ది, దుగ్గొండిలో 148, ఖానాపురంలో 47, నర్సంపేటలో 95, ఆత్మకూరులో 115, దామెరలో 61 మంది ఎంపికయ్యా రు. మొత్తం 14 బ్యాంకులు రుణమిచ్చేందుకు అంగీకరించాయి. దీంతో సబ్సిడీ, రుణం కలిపి 611 మినీ డెయిరీ యూనిట్ల కు ప్రభుత్వం రూ.24.44 కోట్లు మంజూ రు చేసింది. ఇందులో సబ్సిడీ రూ.14.66 కోట్లు కాగా, రుణం రూ.9.77 కోట్లు బ్యాంకులు ఇవ్వనున్నాయి.

డెయిరీ డెవలప్‌మెంట్‌ సొసైటీలు

మినీ డెయిరీ యూనిట్ల స్థాపన కోసం ఆరు మండలాల్లో ఎంపికైన లబ్ధిదారులు 611 మందితో 25 డెయిరీ డెవలప్‌మెంట్‌ సొసైటీలు ఏర్పాటైనట్లు ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ సురేశ్‌కుమార్‌ తెలిపారు. ఆరు మం డలాల్లో పాల సేకరణ కోసం 72 సెంటర్లు ఏర్పాటు చేయాలని విజయ డెయిరీ డెవలప్‌మెంట్‌ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఏడు రూట్లు గుర్తించి మ్యాప్‌ రెడీ చేశారు. ఈ లబ్ధిదారులకు ప్రభుత్వం లీటరు పాలకు రూ.4 సబ్సిడీ ఇవ్వనుంది. ఇప్పటికే లబ్ధిదారులకు మినీ డెయిరీల నిర్వహణపై అవగాహన కల్పించారు.  

గేదెల కొనుగోలుకు సన్నాహాలు

మినీ డెయిరీ యూనిట్‌ విలువ రూ.4 లక్షలకు గాను అరవై శాతం సబ్సిడీ రూ.14.66 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఆగస్టు 15న ఈ సబ్సిడీని కలెక్టరేట్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్‌ హరితతో కలిసి బ్యాంకర్లకు అందజేశారు. దీంతో ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు కొద్ది రోజుల నుంచి లబ్ధిదారుల డాక్యుమెంట్లను తయారు చేస్తున్నా రు. ఇవి  అందగానే బ్యాంకర్లు రుణాన్ని లబ్ధిదారులకు అందజేస్తారు. సాధ్యమైనంత త్వరలో ఇది మొదలు కానుండడం తో లబ్ధిదారులకు గేదెలు కొనిచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మినీ డెయిరీ యూనిట్‌ కింద ఒక్కో లబ్ధిదారుకు నాలుగు గేదెలు కొనుగోలు చేసి ఇవ్వాల్సి ఉంది. వీటిలో తొలుత రెండు గేదెలు, ఆరు నెలల తర్వాత మరో రెండు గేదెలు కొని ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. ఇతర రాష్ర్టాల్లో కొనిచ్చిన గేదెలకు అధికారులే రవాణా చార్జీలతో పాటు బీమా కూడా చేయిస్తారు. ఇప్పటికే లబ్ధిదారులకు పశుసంవర్ధక శాఖ అధికారులు గడ్డి విత్తనాలు పంపిణీ చేశారు. రెండో విడుత జిల్లాలో రాయపర్తి, శాయంపేట మండలాల్లో ఈ మినీ డెయిరీ యూనిట్ల పంపిణీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు.