ఆదివారం 29 నవంబర్ 2020
Warangal-rural - Sep 04, 2020 , 07:01:11

ఇక నుంచి.. ఏఎంసీలకు

ఇక నుంచి.. ఏఎంసీలకు

  • వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు 
  • ఈ వానకాలం సీజన్‌ నుంచే కేటాయింపు
  • కేంద్ర ఆర్డినెన్స్‌తో మనుగడ కోల్పోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
  • l ఆదాయం సమకూర్చే లక్ష్యంతో చర్యలు  
  • l తాజాగా ఉత్తర్వులు.. మొదలైన కసరత్తు 
  • l కొనుగోళ్లకు సిద్ధమవుతున్న ‘మార్కెట్లు’

వరంగల్‌రూరల్‌, నమస్తే తెలంగాణ : కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌లతో ఆర్థికంగా నష్టపోతున్న మార్కెటింగ్‌ శాఖ ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నది. ఈ నేపథ్యంలో కమీషన్‌ పద్ధ్దతిన రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తాజా గా ప్రభుత్వం ఉత్తర్వులు కూడా విడుదల చేయడంతో వానకాలం సీజన్‌ నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు సమాయత్తమవుతున్నది. ఇప్పటికే మార్కెటింగ్‌ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ(ఏఎంసీ)లకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కేటాయించాలని కోరుతూ ధాన్యం ప్రొక్యూర్‌మెంట్‌ కమిటీకి నేతృత్వం వహిస్తున్న అదనపు కలెక్టర్లను కలిశారు.  పంట ల కొనుగోలుకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్‌ జారీ చేసింది. దీంతో ఎక్కడైనా ఎవరైనా కొనే అవకాశం ఏర్పడడంతో వ్యవసాయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో మార్కెటింగ్‌ శాఖ పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోతున్న విషయం తెలిసిందే. ఒక దశలో వ్యవసాయ మార్కెట్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న దృష్ట్యా మార్కెటింగ్‌ శాఖ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది. ఆదాయాన్ని సమకూర్చుకునే దిశలో పీఏసీఎస్‌ల మాదిరి ఏఎంసీల ద్వారా కమీషన్‌ పద్ధతిపై నేరుగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. అన్నదాతకు మద్దతు ధర దక్కాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం వానకాలం, యాసంగి సీజన్లలో ప్రభుత్వమే రైతుల నుంచి ధాన్యం కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయా జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇన్నాళ్లు పీఏసీఎస్‌లు, ఐకేపీకి కేటాయించింది. గిరిజనులు ఎక్కువగా ఉన్న కొన్ని జిల్లాల్లో జీసీసీకి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను అలాట్‌ చేసింది. ఈ కేంద్రాల్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన పీఏసీఎస్‌లు, ఐకేపీ, జీసీసీకి ఒక్కో క్వింటాలుకు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం పౌరసరఫరాల సంస్థ కమీషన్‌ చెల్లిస్తుంది.

ఇక నుంచి మార్కెట్‌ కమిటీలకు.. 

ఆదాయం సమకూర్చుకునేందుకు ఏఎంసీల ద్వారా కమీషన్‌ పద్ధ్దతిన రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనడానికి కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు(జీవో నంబర్‌ 376) విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రతులను మార్కెటింగ్‌ శాఖ అధికారులు ఆయా జిల్లాల్లో ధాన్యం ప్రొక్యూర్‌మెంట్‌ కమిటీకి నేతృత్వం వహిస్తున్న అదనపు కలెక్టర్లను కలిసి అందజేశారు. ఈ వానకాలం సీజన్‌ నుంచి ప్రతి సీజన్‌లో ఏఎంసీలకూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు కేటాయించాలని కోరారు. ఈ కేంద్రాల నిర్వహణకు ప్రతి ఏఎంసీలో అధికారులు, సిబ్బంది ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో అదనపు కలెక్టర్లు ఈ సీజన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొన్నింటిని ఏఎంసీలకు కేటాయించడంపై పౌరసరఫరాల సంస్థ అధికారులతో చర్చిస్తున్నారు. ఈ వానకాలంలో వరి పంట సాగు విస్తీర్ణం పెరిగినందున ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య కూడా పెరుగనుందని, ఈ నేపథ్యంలో ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది, వాటిలో ఏఎంసీలకు ఎన్ని కేటాయించాలనే అంశంపై ప్రతి జిల్లాలో కసరత్తు జరుగుతోంది. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఇప్పటికే అదనపు కలెక్టర్‌ మహేందర్‌రెడ్డిని కలిసి వానకాలం సీజ న్‌ నుంచి ఏఎంసీలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కేటాయించాలని కోరినట్లు మార్కెటింగ్‌ శాఖ ఉప సంచాలకులు(డీడీ) ప్రసాదరావు ‘నమస్తేతెలంగాణ’కు చెప్పారు. ప్రతి జిల్లాలోనూ ఆయా మార్కెట్‌ కమిటీ పరిధిలో ఉన్న అధికారులు, సిబ్బందిని పరిగణనలోకి తీసుకుని ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తామని, ఏఎంసీలు ఆదా యం సమకూర్చుకోవడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

మార్కెట్లలో రైతు వేదికలు

కొన్ని వ్యవసాయ మార్కెట్ల ఆవరణలో రైతు వేదికల నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలాలు కేటాయిస్తోంది. ఒక్కో రైతు వేదికకు 14 నుంచి 20 గుంటల వరకు మార్కెట్‌ స్థలాన్ని ఇస్తున్నది. కొద్ది రోజుల క్రితం పరకాలలోని వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలో రైతు వేదికకు స్థలం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అక్కడ పనులకు స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శంకుస్థాపన చేశారు. తాజాగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చొరవతో నెక్కొండలోని మార్కెట్‌ ఆవరణలో రైతు వేదిక నిర్మాణానికి 20 గుంటల స్థలం కేటాయింపునకు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు(ఏడీఏ) శ్రీనివాసరావు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపా రు. దీంతో కలెక్టర్‌ హరిత గురువారం  మార్కెట్‌ను సందర్శించి రైతు వేదిక కోసం ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. వెంటనే పనులు ప్రారంభించాలని ఆమె పంచాయతీరాజ్‌ ఇంజినీర్లను ఆదేశించారు.