సోమవారం 26 అక్టోబర్ 2020
Warangal-rural - Sep 02, 2020 , 02:48:54

టూరిజం సర్యూట్‌లో లక్నేపల్లి

టూరిజం సర్యూట్‌లో లక్నేపల్లి

నర్సంపేట రూరల్‌ : దివంగత మాజీ ప్రధాని, పీవీ నరసింహారావు జన్మించిన లక్నెపల్లి గ్రామాన్ని మంగళవారం సాయంత్రం టూరిజం శాఖ ఉన్నతాధికారులు, ప్రముఖ ఇంజినీర్లు సందర్శించారు. టూరిజం శాఖ ఎండీ మనోహర్‌రావు ఆధ్వర్యంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఓంప్రకాశ్‌, జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, డిప్యూటీ ఇంజినీర్‌ ఏకాంబ్రం, పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్‌ సీతారాం గ్రామాన్ని సందర్శించారు. తొలుత టూరిజం శాఖ ఎండీ గ్రామంలోని పీవీ మెమోరియల్‌ ట్రస్టు, పీవీ కాంస్య విగ్రహాన్ని పరిశీలించారు. పీవీ మెమోరియల్‌ ట్రస్టులోని పుస్తకాలను పరిశీలించారు. అక్కడి నుంచి లక్నెపల్లి -రామవరానికి వెళ్లే ప్రధాన రహదారిలోని ప్రభుత్వ స్థలాన్ని, లక్నెపల్లి గ్రామం ముందు ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ స్థలాలు, ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను పరిశీలించారు. ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన భూముల వివరాలపై ఆరా తీశారు. అనంతరం టూరిజం శాఖ ఎండీ మాట్లాడుతూ.. లక్నెపల్లిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కావాల్సిన ప్రతిపాదనలు తయారు చేసినట్లు తెలిపారు. లక్నెపల్లిని టూరిజం సర్క్యూట్‌లో చేర్చేందుకు కృషి చేస్తామని అన్నారు. ఒక రోజు, రెండు రోజుల ప్యాకేజీలో భాగంగా హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ టూరిజం సర్క్యూట్‌లో లక్నెపల్లి గ్రామాన్ని చేర్చుతామని పేర్కొన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ త్వరలోనే లక్నెపల్లి గ్రామాన్ని సందర్శిస్తారని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గొడిశాల రాంబాబు, ఉప సర్పంచ్‌ పరాచికపు సంతోష్‌, ఎంపీటీసీ ఉల్లేరావు రజిత, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


logo