సోమవారం 30 నవంబర్ 2020
Warangal-rural - Sep 02, 2020 , 02:48:54

అవును అది పెద్దపులే..

అవును అది  పెద్దపులే..

మహాముత్తారం : మూడు రోజులుగా మహాముత్తారం అటవీ ప్రాంతంలో తిరుగాడుతున్నది పెద్దపులేనని స్పష్టమైంది. పులి జాడ కనుగొనేందుకు మంగళవారం రంగంలోకి దిగిన మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ వైల్డ్‌లైఫ్‌ బృందం దాని పాదముద్రల ఆధారంగా ఈ విషయాన్ని నిర్ధారించింది. మొదట నిమ్మగూడెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పెగడపల్లి, ఆజంనగర్‌ రేంజ్‌ పరిధిలోని బీట్‌ ఆఫీసర్లతో టైగర్‌ ట్రాకర్‌ రాకేశ్‌, ఎఫ్‌బీవో శ్రీకాంత్‌ సమావేశమయ్యారు. పెద్దపులి పాదముద్రలు కనిపించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అడవిలో అనుకోకుండా పులి ఎదురైనప్పుడు పరిగెత్తకుండా దాని కండ్లలోకి చూడాలని, ఒకవేళ దూరంగా ఉంటే ఒక రకమైన దుర్వాసన వస్తుందని తద్వారా వాసనను బట్టి పెద్దపులి ఉన్నట్లు గ్రహించాలని వారికి అవగాహన కల్పించారు. సాధారణంగా పెద్దపులి ఇద్దరు, ముగ్గురు ఉన్నప్పుడు దాడి చేయదని, ఒంటరిగా పులి కంటే కిందికి వంగి లేదా కూర్చొని ఉన్నప్పుడు మాత్రమే అటాక్‌ చేసేందుకు ఇష్టపడుతుందన్నారు. అదీగాక కుళ్లిన మాంసం ఇష్టంగా తింటుందని చెప్పారు. దాని అడుగులు నేల మీద పడినప్పుడు మగపులి అయితే అడుగులు బలంగా, త్రిభుజాకారంలో పడుతాయని, ఆడపులి అయితే బలహీనంగా, వేళ్లు పొడుగ్గా, చతురస్రాకారంలో పడుతాయని వివరించారు.

కెమెరా ట్రాప్‌లపై సూచనలు

అడవిలో కెమెరా ట్రాఫ్‌లను అమర్చినపప్పుడు ఎంత ఎత్తులో అమర్చాలి, ఎక్కడ అమర్చాలనే విషయాలపై బీట్‌ ఆఫీసర్లకు వైల్డ్‌లైఫ్‌ సిబ్బంది అవగాహన కల్పించారు. ట్రాప్‌ల చుట్టుపక్కల చెత్తాచెదారం లేకుండా, చెట్ల మండలు గాలికి కదలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే ట్రాప్‌కు నిక్షిప్తమైన ఫొటోలను భద్రపరిచే విధానం గురించి వివరించారు.

పులి పాదముద్రల పరిశీలన

సోమవారం యామన్‌పల్లి, ఆజంనగర్‌ గ్రామాల మధ్యలో మట్టిర్డోపై పడిన పాదముద్రలను వైల్డ్‌లైఫ్‌ సిబ్బంది పరిశీలించి వాటి వివరాలు నమోదు చేసుకున్నారు. పాదం పొడవు 14సెం.మీ, వెడల్పు 14 సెం.మీ, ఎత్తు 90 సెం.మీ, పొడవు దాదాపు 120 సెం.మీ వరకు ఉన్నట్లు అధికారులు అంచనా వేసినట్లు సమాచారం. కార్యక్రమంలో ఆజంనగర్‌ ఇన్‌చార్జి రేంజర్‌ ఆదిల్‌, నిమ్మగూడెం డీఆర్‌వో వీరన్న, యత్నారం సెక్షన్‌ ఆఫీసర్‌ లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.