సోమవారం 23 నవంబర్ 2020
Warangal-rural - Sep 01, 2020 , 03:37:35

పర్యాటక కేంద్రంగా లక్నేపల్లి

పర్యాటక కేంద్రంగా లక్నేపల్లి

  • సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ప్రణాళికలు
  • నేడు టూరిజం ఉన్నతాధికారుల రాక
  • ప్రత్యేక చొరవ చూపుతున్న ఎమ్మెల్యే పెద్ది

వరంగల్‌రూరల్‌-నమస్తేతెలంగాణ : దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జన్మించిన లక్నేపల్లికి మహర్దశ పట్టనుంది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో అధికారులు లక్నేపల్లి దారి పడుతున్నారు. గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పీవీ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి గత శుక్రవారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. పీవీ నర్సింహారావు జన్మించిన నర్సంపేట మండలం లక్నేపల్లి, ఆయన పెరిగిన భీమదేవరపల్లి మండలం వంగర గ్రామాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. 

ఈ మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగారు. కలెక్టర్‌ ఎం హరిత ఆదివారం పర్యాటక జిల్లా అధికారి శివాజీ, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్‌ ఏకాంబర్‌, నర్సంపేట ఆర్డీవో పవన్‌కుమార్‌, తాసీల్దార్‌తో కలిసి లక్నేపల్లిలో పర్యటించారు. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రభుత్వ, ప్రైవేట్‌ భూ ములపై ఆరా తీశారు. కాగా, మంగళవారం పర్యాటక శాఖ ఉన్నతాధికారులు లక్నేపల్లికి రానున్నారు. పర్యాటక శాఖ కమిషనర్‌ శ్రీనివాసరావు, ఎండీ మనోహర్‌రావుతో పాటు పలువురు టూరిజం అధికారులు, ఇంజినీర్లు పర్యటిస్తారని తెలిసింది.

తెరపైకి పలు ప్రతిపాదనలు..

లక్నేపల్లిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తాజాగా పలు ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా టూరిజం సర్య్యూట్‌లో లక్నేపల్లిని చేర్చాలనే ప్రతిపాదనను పర్యాటక శాఖ పరిశీలిస్తున్నది. ప్రస్తుతం పర్యాటక శాఖ నిర్వహిస్తున్న టూరి జం సర్క్యూట్‌ ప్రకారం హైదరాబాద్‌ నుంచి బయల్దేరే టూరిస్టులు వరంగల్‌ మహా నగరంలోని వేయిస్తంభాల గుడి, వరంగల్‌కోట, పాకాల, లక్నవరం మీదుగా రామప్ప చేరుకుంటున్నా రు.

లక్నేపల్లిని టూరిజం సర్క్యూట్‌లో చేరిస్తే హైదరాబాద్‌ నుం చి బయల్దేరే టూరిస్టులు లక్నేపల్లి వచ్చే అవకాశం ఉంటుందని పర్యాటక శాఖ భావిస్తున్నది. లక్నేపల్లిలో సాంస్కృతిక వేదిక, కన్వెన్షన్‌ సెంటర్‌ (హాలు), చిల్డ్రన్స్‌ పార్కు నిర్మాణంతో పాటు రోడ్డు విస్తరణ పనులు చేపట్టే ప్రతిపాదనలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.