శనివారం 28 నవంబర్ 2020
Warangal-rural - Aug 30, 2020 , 03:58:22

ప్ర‌యాణం.. భ‌యాన‌కం..

ప్ర‌యాణం.. భ‌యాన‌కం..

అవి పేరుకు జాతీయ రహదారులు.. వాటిపై ప్రయాణమంటే ప్రాణాలకు గ్యారెంటీ లేదు. అడుగడుగునా గజం లోతు గుంతలతో ఎక్కడ ఏ ప్రమాదం పొంచి ఉన్నదో తెలియదు. పట్టుమని పది కిలోమీటర్లు వెళ్లాలన్నా ప్రాణాలు అరచేత పెట్టుకోక తప్పదు. కరీంనగర్‌, వరంగల్‌ జిల్లా కేంద్రాల మీదుగా ఖమ్మం వెళ్లే ‘ఎన్‌హెచ్‌ 563’ పరిస్థితి ఆదినుంచీ అధ్వానమే కాగా, హైదరాబాద్‌, జనగామ, వరంగల్‌ మీదుగా ములుగు వైపు వెళ్లే ‘ఎన్‌హెచ్‌ 163’పనులు నత్తకే నడక నేర్పుతున్నాయి. కేంద్రం తాత్సారం చేస్తూ అరకొర నిధులు విడుదల చేస్తుండడం, తాత్కాలిక మరమ్మతులు తప్ప, శాశ్వత పనులు చేపట్టకపోవడంతో ‘ఎక్కడ వేసిన గొంగళి’ అక్కడే అన్న చందాన తయారయ్యాయి. వీటిపై ఏటా ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు పోతుండగా, వందలాది మంది కాళ్లు, చేతులు విరిగి వారి బతుకులే ఆగమమవుతున్నాయి. 

- వరంగల్‌ రూరల్‌/జనగామ/ములుగు నమస్తే తెలంగాణ/తొర్రూరు

2015లో హేతుబద్ధీకరణలో భాగంగా 202 జాతీయ రహదారి 163గా మారింది. 334 కిలో మీటర్లు ఉండే ఈ రహదారి హైదరాబాద్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని భూపాలపట్నం దాకా తెలంగాణలో 298 కిలోమీటర్లు, ఛత్తీస్‌గఢ్‌లో 36కిలో మీటర్లు ఉంటుంది. హైదరాబాద్‌ అంబర్‌పేట, రామంతపూర్‌, ఉప్పల్‌ మీదుగా భువనగరి, జనగామ, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్‌, వరంగల్‌, ములుగు, ఏటూరునాగారం, చంద్రపట్ల, భద్రకాళీ మీదుగా భూపాలపట్నం వరకు వెళ్లి అక్కడ జాతీయ రహదారి 16తో కలుస్తుంది. దీనిని నాలుగు లేన్లుగా మార్చేందుకు కేంద్రం రూ.1905.23 కోట్లు కేటాయించింది. గతంలో యాదాద్రి వరకు పనులు చేపట్టగా, ఇప్పుడు జనగామ నుంచి వరంగల్‌ వరకు పనులు నత్తకే నడక నేర్పేలా కొనసా..గుతున్నాయి. చాలా చోట్ల సర్వీస్‌రోడ్లు, స్టేషన్‌ఘన్‌పూర్‌, రఘునాథపల్లి అండర్‌పాస్‌ పనులు చేపట్టలేదు. డివైడర్లు, లైటింగ్‌, సూచికల  బోర్డుల ఏర్పాటు,  అవసరమైన చోట రేడియం పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. 

నిర్వహణ అస్తవ్యస్తం

ములుగు జిల్లా నుంచి 163 జాతీయ రహదారిని రెండు బిట్లుగా విభజించి పనులు చేపట్టారు.  ఆత్మకూరు మండలం గూడెప్పాడ్‌ నుంచి నీరుకుళ్ల వరకు, ములుగు మండలం గట్టమ్మ దేవాలయం నుంచి పస్రా వరకు  సుమారు  35 కిలోమీటర్ల మేర రూ.186కోట్లతో పనులను 2018 జూలైలో ప్రారంభించారు. 2020 మార్చిలోగా పూర్తి కావాల్సి ఉన్నది. పోయిన మేడారం జాతర సందర్భంగా పలు సమీక్షల్లో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇతర ముఖ్యులు సూచించినా జాతీయ రహదారుల విభాగం ఇంజినీరింగ్‌ అధికారులు యథాలాపంగా పనుల్లో వేగం పెంచలేదు


  కరోనా లాక్‌డౌన్‌ కారణంగా గడువు మరో ఆరు నెలలు పొడిగించారు. నిత్యం రాకపోకలు అధికంగా ఉండే ఈ రహదారిపై గోవిందరావుపేట వద బ్రిడ్జి పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇటీవలి భారీ వర్షాలకు లక్నవరం సరస్సు మత్తడి  అధికంగా పారి బ్రిడ్జి వద్ద రోడ్డు తీవ్రంగా కోతకు గురైంది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. 2012లో మంజూరై ఏటూరునాగారం ఐటీడీఏ క్రాస్‌ నుంచి వాజేడు మండలం లొటపిటగండి దాకా 2015వరకు పూర్తి చేసిన రహదారి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. రూ.350కోట్లతో మూడు బిట్లుగా పనులు చేశారు.

ఐటీడీఏ క్రాస్‌ నుంచి వాజేడు మండలం జగన్నాథపురం జంక్షన్‌ వరకు 18.4 కిలోమీటర్లు, అక్కడి నుంచి టేకులగూడెం వరకు 15కిలోమీటర్లు, అటునుంచి ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని లొటపిటగండి వరకు 7కిలోమీటర్ల నిర్మించారు. వాజేడు మండలం పెద్దగొళ్లగూడెం వద్ద రోడ్డు పూర్తిగా కుంగిపోయి ప్రమాదాలు జరిగేలా ఉన్నా ఇంజినీరింగ్‌ అధికారులు కనీస మరమ్మతులు చేపట్టకపోవడంపై వాహనదారులు మండిపడుతున్నారు. రోడ్డు దెబ్బతిన్న ప్రదేశాల్లో స్థానిక పోలీసులే హెచ్చరిక గుర్తులు పెట్టి అప్రమత్తంగా చేయాల్సిన దుస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

174వ కిలోమీటర్‌ రాయి వద్ద ఐదు నెలల్లో ఏడు ప్రమాదాలు


 వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండలం మైలారం సమీపంలో 563జాతీయ రహదారి 174వ కిలో మీటర్‌ వద్ద విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఉన్నది. ఇక్కడ రోడ్డుపై చాలాకాలం క్రితం గుంతలు పడ్డాయి. మరమ్మతులు లేక వాహనదారులు గుంతలను తప్పించే ప్రయత్నంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. రాయపర్తి పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులను పరిశీలిస్తే మార్చి నుంచి ఈ ఐదు నెలల్లో ఏడు ప్రమాదాలు జరిగాయి. ఇద్దరు చనిపోగా 13మంది తీవ్ర గాయాలపాలయ్యారు.  ఈ ప్రదేశాన్ని పోలీసులు బ్లాక్‌ పాయింట్‌గా గుర్తించారు. వరంగల్‌- ఖమ్మం ప్రధాన రహదారిలో అనేక చోట్ల ఇదే దుస్థితి నెలకొంది. 

నాటి నుంచీ ఎన్‌హెచ్‌ 563 పరిస్థితి అధ్వానం


జగిత్యాల-కరీంనగర్‌- వరంగల్‌ జిల్లా కేంద్రాల మీదుగా ఖమ్మం వరకు సుమారు 249 కిలోమీటర్ల 563 జాతీయ రహదారిని 2016నుంచి కేంద్ర నిర్వహణ పరిధికి వెళ్లింది. అప్పటి నుంచి దీనికి తాత్కాలిక, శాశ్వత మరమ్మతులు గానీ లేవు. నాలుగేళ్లలో కేవలం రూ.15 కోట్లు వెచ్చించి 91కిలో మీటర్లలో కేవలం 23కిలోమీటర్ల మేర మరమ్మతులు చేసి కేంద్రం చేతులు దులుపుకున్నది. తాజాగా మరో 21కోట్లు కేటాయించగా రెండు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పూర్తి చేసినా పనులు ప్రారంభం కాలేదు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సుమారు 91కిలో మీటర్ల మేర ఈ రహదారి విస్తరించి ఉన్నది. కార్పొరేషన్‌ పరిధిలో 10కిలో మీటర్లు, శంభునిపేట శివారు నాయుడు పెట్రోల్‌ బంక్‌ నుంచి మరిపెడ శివారు వరకు  81కిలో మీటర్లు ఉన్న ఈ రహదారి పరిస్థితి అధ్వానంగా తయారైంది. నాయుడు పెట్రోల్‌ బంకు నుంచి దంతాలపల్లి వరకు వివిధ దశల్లో రూ.15 కోట్లతో 23 కిలో మీటర్ల మేర గుంతలు పూడ్చి, బీటీ రెన్యూవల్‌ చేశారు. దీన్ని పక్కన పెడితే వరంగల్‌ నుంచి మరిపెడ వరకు ఎలాంటి మరమ్మతులు చేయలేదు. అడుగుకొకటి చొప్పున మోకాలి లోతు గుంతలు పడి ఈ రోడ్డుపై ప్రయాణం నరక ప్రాయంలా మారింది. రెండేళ్ల క్రితం చేసిన పనులు వర్షాల కారణంగా దెబ్బతిన్నాయి. మామునూరు, పంథిని, ఇల్లంద, వర్ధన్నపేట, రాయపర్తి, మైలారం, మొరిపిరాల, నాంచారిమడూరు, సన్నూరు క్రాస్‌, తొర్రూరు, దంతాలపల్లి, బీరిశెట్టి గూడెం, గోపాతండా సమీపంలో ఎస్సారెస్పీ కాల్వ బ్రిడ్జి, మరిపెడ గురుకులాల సమీపం నుంచి మరిపెడలోని జిల్లా ముగింపు వద్ద కాకతీయ ఆర్చి దాకా రోడ్డు పరిస్థితి అధ్వానంగా ఉంది. ఇటీవల కోనారెడ్డి చెరువు కట్ట తెగి వరద ఉధృతికి వర్ధన్నపేట పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ల్యాబర్తి క్రాస్‌రోడ్డు వద్ద బ్రిడ్జి పక్కన హైవే తెగిపోయింది. సన్నూరు క్రాస్‌ రోడ్డు, మరిపెడ మున్సిపాలిటీ పరిధి రహదారికి తాత్కాలిక మరమ్మతులు చేశారు. 

కనుమరుగైన బోర్డులు..

జాతీయ రహదారిపై సూచిక బోర్డులు కనుమరుగయ్యాయి. ఆరు నెలల క్రితం ఈ హైవేపై ప్రమాదాల నివారణకు యుద్ధప్రాతిపదికన కొన్ని పనులు చేయాలని తొర్రూరు ఆర్డీవో, డీఎస్పీ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, రవాణా, రెవెన్యూ, పోలీస్‌, మున్సిపల్‌ అధికారులు కలిసి నాంచారిమడూర్‌ నుంచి మరిపెడ దాకా రోడ్డును పరిశీలించి కార్యాచరణ సిద్ధం చేశారు. కానీ, ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. 

ప్రమాదాలకు నెలవుగా క్రాస్‌ రోడ్లు..

 పలు గ్రామాల నుంచి నేరుగా హైవేకి కలిసే క్రాస్‌ రోడ్లు ప్రమాదాలకు నెలవుగా మారాయి. ఈ ప్రాంతాల్లో వేగ నియంత్రణ కోసం ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినా ఇప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి క్రాస్‌రోడ్డు, కట్య్రాల, వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో, కొత్తూరుక్రాస్‌, రాయపర్తి మండల కేంద్రం, ఊకల్‌క్రాస్‌రోడ్డు, మైలారం, జగన్నాథపల్లి క్రాస్‌, సన్నూరు, మురిపిరాల, సుభాష్‌తండాక్రాస్‌, కిష్టాపురం, ఫత్తేపురం, మాటేడు స్టేజీ, పోలెపల్లి, బొడ్లాడ క్రాస్‌ రోడ్లు, చారితండా, వంతడుపుల, వస్రాంతండా, చిల్లంచెర్ల, మల్లంకుంట తండా, నేతావత్‌ తండా, అన్నెపురం, మెక్యాతండా, ఇస్లావత్‌ తండా, ఆల్లగడ్డ రోడ్డు, బక్కరూపుల తండా, వీరారం క్రాస్‌రోడ్డు, మరిపెడ శివాలయం, మరిపెడ గ్రామ రహదారి, దాట్ల క్రాస్‌ రోడ్లు గుంతలమయమై ప్రమాదాలకు నెలవుగా మారాయి. ఆయా చోట్ల రబ్బర్‌ స్ట్రిప్‌లతో కూడిన స్పీడ్‌ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినా కార్యరూపం దాల్చలేదు.  

 సొంత డబ్బుతో మరమ్మతులు


ఎన్‌హెచ్‌ 563 అధ్వానంగా మారడంతో మరమ్మతుల కోసం సొంత డబ్బులు ఖర్చు పెడుతున్న. మైలారం వద్ద ఇప్పటి వరకు రూ.50 వేలు ఖర్చుపెట్టిన, ఇక్కడ మొకాలు లోతు గుంతలు పడి ప్రమాదకరంగా మారాయి. పాఠశాల, బస్‌స్టేజీ సమీపంలో గుంతలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేను సర్పంచ్‌గా ఎన్నికయ్యాక ఏడాదిలో 20సార్లు ట్రాక్టర్లతో మొరం పోయించి గుంతలు పూడ్పించా. అయినా ఫలితం లేదు. పోయిన జూలైలో సిమెంటు, ఇసుక, కంకర మిక్స్‌ పోయించిన.

- లేతాకుల సుమతిరెడ్డి, సర్పంచ్‌, మైలారం (వరంగల్‌ రూరల్‌ జిల్లా)

వాహనాలు పాడైతున్నయ్‌ 

జాతీయ రహదారులపై పెద్దపెద్ద గుంతలు పడి వాహనాలు పాడైపోతున్నయ్‌. కార్లు, భారీ వాహనాలు, బైక్‌ ప్రమాదాలు వరంగల్‌-ఖమ్మం ప్రధాన రహదారిపై సర్వసాధారణమయ్యాయి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా వాహనం గుంతలో పడుడు ఖాయం. వర్షం కురిస్తే ఎక్కడ ఏగుంత ఉందో తెలియక భయమైతున్నది. ఇప్పటివరకు చాలామంది తలలు పగిలినయ్‌. కాళ్లు, చేతులు విరిగినయ్‌. అనేకసార్లు పోలీసులే రహదారిపై గుంతలను పూడ్పించిన్రు. ఎన్‌హెచ్‌ అధికారులు మాత్రం ఇటువైపు చూసిన దాఖలాల్లేవు.  

- సంది మధూకర్‌రెడ్డి, కడారిగూడెం, వర్ధన్నపేట (వరంగల్‌ రూరల్‌ జిల్లా)

 ప్రయాణమంటేనే భయంగా ఉంది 

 

మా ఊరి శివారులో దెబ్బతిన్న జాతీయ రహదారిపై రాత్రి సమయల్లో వెళ్లాలంటే భయంగా ఉంది. పలు చోట్ల రహదారి కుంగిపోయి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియకుండా ఉన్నది. అధికారులు వెంటనే దెబ్బతిన్న చోట మరమ్మతులు చేపట్టాలి. 

- గొంది సత్యనారాయణ, చీకుపల్లి, ములుగు జిల్లా