బుధవారం 25 నవంబర్ 2020
Warangal-rural - Aug 27, 2020 , 04:58:50

స్వ‌చ్ఛ‌త... స్వ‌స్థ‌త‌

స్వ‌చ్ఛ‌త... స్వ‌స్థ‌త‌

  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుచూపు ఫలితం
  • ‘పల్లె, పట్టణ ప్రగతి’తో ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం
  • ఊరూరా పారిశుధ్యంతో రోగాలు దూరం
  • పల్లె, పట్టణం తేడాలేకుండా సీజనల్‌ వ్యాధులు మటుమాయం
  • ప్రజలకు తగ్గిన వైద్య ఖర్చుల భారం 
  • ఫలించిన సర్కారు ఆపరేషన్‌
  • ప్రైవేట్‌ హాస్పిటళ్లకు ఆదాయాన్నివ్వని సీజన్‌ 

ఉమ్మడి జిల్లాలో నమోదైన మలేరియా, డెంగీ కేసులు 

సంవత్సరం 2018 2019 2020

మలేరియా 507 443 164

డెంగీ 387 631 72ములుగు/భూపాలపల్లిటౌన్‌/వర్ధన్నపేట/పరకాల/కేసముద్రం టౌన్‌ /బయ్యారం/ఐనవోలు : వానకాలం వచ్చీరాగానే సీజనల్‌ వ్యాధులను వెంట బెట్టుకొచ్చేది. ఉమ్మడి జిల్లాలో పల్లె, పట్టణం తేడా లేకుండా ప్రజలు రోగాల బారిన పడేవారు. మలేరియా, డెంగీ, చికున్‌గున్యా, వైరల్‌ ఫీవర్‌, టైఫాయిడ్‌తో ఇంటికొకరిద్దరు మంచాన పడేవారు. గత ప్రభుత్వాల హయాంలో గ్రామాలు మురికికూపాల్లా మారి విపరీతమైన దోమల నడుమ, అపరిశుభ్ర వాతావరణంతో వ్యాధులు ప్రబలి ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యేవారు. పిల్లల నుంచి పెద్దల దాకా స్లైన్‌ బాటిళ్లు ఎక్కించుకుంటూ కనిపించేవారు. వైద్యం కోసం హాస్పిటళ్ల చుట్టూ తిరిగేవారు. వైద్యం కోసం వేలాది రూపాయలు ఖర్చుపెట్టినా పరిస్థితి విషమించి వందల సంఖ్యలో మృత్యువాత పడేవారు. పల్లెల్లో ఈ దుస్థితిని గుర్తించిన ఉద్యమ నేత కేసీఆర్‌, స్వరాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం కోసం అనేక సంస్కరణలు చేశారు. ముఖ్యంగా వైద్య రంగాన్ని పటిష్టం చేశారు. రోగాలను దూరం చేయాలంటే ముందుగా గ్రామాలను పరిశుభ్రంగా మార్చాలని ప్రతిష్టాత్మకంగా ‘పల్లె ప్రగతి’ని తెరపైకి తెచ్చారు రెండేళ్లుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. గ్రామాల్లో వాటర్‌ ట్యాంకులు, పైల్‌లైన్‌లు, మురుగు కాల్వలను శుభ్రం చేయిం చారు. మురికి కూపాలను లేకుండా చేశారు. కూలిన ఇండ్ల శిథిలాలు, పిచ్చి మొక్కలు, పెంట కుప్పలను తొలగించారు. పాడుబడ్డ బావులను పూడ్చి వేయించారు. బహిరంగ మలవిసర్జన చేస్తే జరిమానాలు విధించారు. డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేశారు. తాజాగా ఊరికో ట్రాక్టర్‌ను అందించంతో వాటి ద్వారా ఎప్పుటికప్పుడు చెత్తను తొలగిస్తున్నారు. ఒకవేళ గ్రామం అపరిశుభ్రంగా ఉంటే సదరు సర్పంచ్‌లకు కలెక్టర్లు నోటీసులు జారీ చేస్తూ పంచాయతీ కార్యదర్శులపైనా శాఖాపరమైన చర్యలు తీసుకున్న సందర్భాలు అనేకమున్నాయి. ఇవన్ని చర్యలు చేపట్టడంతో గతేడాది నుంచి వానకాలంలో రోగాలు పల్లెల దరి చేరలేదు. ప్రస్తుతం వానకాలం సీజన్‌ ముగుస్తున్నా డెంగీ, మలేరియా, డయేరియా, చికున్‌గున్యా, టైఫాయిడ్‌ లాంటి వ్యాధులు ప్రజలను పట్టి పీడించలేదు. 

ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మాణం

గ్రామాల్లో విస్తృతంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం కూడా ప్రజల ఆరోగ్య సంరక్షణకు దోహదపడింది. గతంలో అవగాహన లేక ఆరుబయట మలవిసర్జన చేయడంతో గ్రామాల్లో అపరిశుభ్ర వాతా వరణం ఏర్పడి ఈగలు, దోమలు వ్యాప్తి చెంది వ్యాధులు ప్రబలేవి. ప్రభు త్వం ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండాలనే లక్ష్యంతో విస్తృతంగా మరుగుదొడ్లను మంజూరు చేసింది. కలెక్టర్ల ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు ప్రజలకు అవగాహన కల్పించి ఇంటికో మరుగుదొడ్డి నిర్మించుకునేలా చేశారు. చాలా గ్రామాలు 100శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసుకొని ఆరుబయట మలవిసర్జన రహితంగా మారాయి. దీంతో రోగాల వ్యాప్తి నిరోధానికి వీలు కలిగింది. 

మారుమూల గ్రామాలూ సేఫ్‌

వ్యాధుల సీజన్‌లో ముఖ్యంగా మారుమూల అటవీ గ్రామాలు అల్లాడి పోయేవి. ఊర్లకు ఊర్లే రోగాల బారిన పడి దుర్భర పరిస్థితిని అనుభవిం చేవి. పారిశుధ్యంపై అవగాహన లేక, సరైన వైద్య సౌకర్యాలు లేక పల్లె పల్లెనా ప్రతి సీజన్‌లో పదుల సంఖ్యలో మరణాలు సంభవించేవి. మం చాన పడ్డ కుటుంబసభ్యులతో ప్రతి ఇల్లూ దీనంగా కనిపించేది. ఇలాంటి దయనీయ పరిస్థితులు సైతం ప్రస్తుతం కనుమరుగయ్యాయి. పీహెచ్‌సీ, సీహెచ్‌సీలను బలోపేతం చేయడం, వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తేవడం, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ‘ప్రగతి’ కార్య క్రమాలను పటిష్టంగా అమలుచేయడంతో ఇప్పుడు మారుమూల సైతం పల్లెలు సేఫ్‌గా ఉన్నాయి.      

హాస్పిటళ్లకు తప్పిన పరుగులు 

ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లో రోగాలు అధికంగా వ్యాప్తి చెంది ప్రభు త్వ, ప్రైవేట్‌ హాస్పిటళ్లు కిటకిటలాడేవి. ఇదే అదునుగా ప్రైవేట్‌ దవాఖానలు ఇష్టారీతిన దండు కునేవి. ఇటు మందులకు సైతం వేలాది రూపా యలు ఖర్చుచేయాల్సి వచ్చేది. సీజనల్‌ వ్యాధులు విజృంభిం చి సమయాల్లో ప్రజలు ఆందోళనతో ప్రైవేట్‌ దవాఖానలకు వెళ్లి ఆర్థికంగా భారీగా నష్టపోయే వారు. డాక్టర్లు రాసిచ్చే ఇబ్బడి ముబ్బడి ముందులు కొని ఆర్థికంగా దివాలా తీసేవారు. ప్రతి సీజన్‌లో వైద్యం కోసం ఒక్కో కుటుంబం రూ.20వేల నుంచి రూ.30వేల దాకా ఖర్చు చేసేది. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారింది. సీజనల్‌ వ్యాధులు లేకపోవడంతో పైవేట్‌ హాస్పిటళ్లలో రోగుల సంఖ్య తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం సర్కారు వైద్యాన్ని పటిష్టం చేయడంతో ప్రజలకు వైద్యం కోసం ఆర్థిక భారం తప్పింది. ప్రజల జేబులు గుల్ల కాకుండా ప్రభుత్వ దావాఖానల్లోనే మెరుగైన వైద్య సదుపాయా లు అందుతున్నాయి. సర్కారు చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాలతో ఇంత వరకు ఏ జిల్లాలోని పీహెచ్‌సీ పరిధిలోనూ మలేరియా, డయేరియా, డెంగీ వ్యాధులు నమోదు కాలేదు.  

 డెంగీ, మలేరియా తగ్గుముఖం 

సర్కారు చేపట్టిన ప్రత్యేక చర్యలతో జిల్లాల్లో డెంగీ , మలేరియా లాంటి వ్యాధులు తగ్గుముఖం పట్టాయి. 2015కు ముందు వందల సంఖ్యలో ఉన్న కేసులు క్రమక్రమంగా పదుల సంఖ్యకు చేరాయి. డయేరియా, చికున్‌గున్యా లాంటివి ఇప్పుడు ఎక్కడా నమోదు కాలేదు. కాగా గోదావరి పరీవాహక ప్రాంతం వెంట ఉన్న గ్రామాల్లో మాత్రమే మలేరియా కేసులు కొంచెం ఎక్కువ నమోదయ్యాయని, సరిహద్దు దాటి పక్క రాష్ట్రంలోని గ్రామాలకు వెళ్లి వస్తుండడంతో వ్యాధి వ్యాప్తి చెందుతున్నదని వైద్యులు చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే డెంగీ కేసులు గణనీయంగా తగ్గాయి.

సమస్యాత్మక గ్రామాల్లోనూ కేసులు నిల్‌

వైద్య ఆరోగ్యశాఖ ప్రతి వర్షాకాలం సీజన్‌లో సమస్యాత్మక గ్రామాలను గుర్తించి వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపడుతుంది. ఈ సారి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని 19 సమస్యాత్మక గ్రామాల్లో అంతగా కేసులు నమోదు కాలేదు. అంబట్‌పల్లి పీహెచ్‌సీ పరిధిలో నీలంపల్లి, ముకునూరు, చిన్నేటిగూడెం, దమ్మూరు, బూతుగూడెం, ఇచ్చంపల్లి, మహాముత్తారం పీహెచ్‌సీ పరిధిలో పెగడపల్లి సబ్‌సెంటర్‌లో పెగడపల్లి, ఆంజనేయపల్లి, ప్రేంనగర్‌, కేశవాపూర్‌, నిమ్మగూడెం, కనుకునూరు సబ్‌సెంటర్‌ పరిధిలో కనుకునూరు, రెడ్డిపల్లి, సింగంపల్లి, యత్నారం, ఆజంనగర్‌ పీహెచ్‌సీ పరిధిలో ఆజంనగర్‌, నందిగామ, గణపురం పీహెచ్‌సీ పరిధిలో సీతారాంపురం, అప్పయ్యపల్లిని సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. కాగా పలిమెల, అన్నారం, కొర్లకుంట, బోర్లగూడెం మినహా ఎక్కడా కేసులు నమోదు కాలేదు.  

కామ్‌గా కామారెడ్డిపల్లి 

వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల మండలం కామారెడ్డిపల్లిలో అనేక మంది ఏటా సీజనల్‌ వ్యాధుల బారిన పడేవారు. ఊరిలోని కమ్మరివాడ, ఎస్సీకాలనీలో పరిస్థితి దయనీయంగా ఉండేది. ఏ ఇంట చూసినా జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడేవారు. దవాఖానలకు వెళ్లి చికిత్స కోసం పెద్దమొత్తంలోనే ఖర్చుపెట్టుకునేవారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో ఊరిని ఎప్పటికప్పుడు శుభ్రం చేశారు. మురుగులు కాల్వలను క్లీన్‌ చేయడంతో పాటు ఎక్కడ చెత్తవేసినా జరిమానా విధిస్తూ వచ్చారు. దీంతో ఊరిలో అపరిశుభ్రత కనుమరుగై దోమలవ్యాప్తి లేకపోవడంతో సీజనల్‌ వ్యాధుల ప్రభావం లేకుండా పోయింది. 

రోగాలను దూరం చేసిన ‘భగీరథ’ నీరు

పల్లె ప్రజలు కలుషిత నీటిని తాగి రోగాల బారిన పడుతున్నారనే విషయాన్ని గుర్తించిన ఉద్యమనేత, సీఎం కేసీఆర్‌ దేశంలో ఎక్కడా లేనివిధంగా ‘మిషన్‌ భగీరథ’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇంటింటికీ నల్లా కనెక్షన్‌ ఇప్పించి శుద్ధజలాలను సరఫరా చేస్తున్నారు. దీంతో రోగాల బారిన పడే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. కామారెడ్డిపల్లిలో అంతకుముందు నల్లాల ద్వారా కలుషిత నీరు సరఫరా అయ్యేది. ఆ నీటిని తాగి అధికసంఖ్యలో రోగాల బారిన పడ్డారు. మిషన్‌ భగీరథ నీరు వచ్చిన తర్వాత ఊరిలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గ్రామంలో సుమారు 2100 మంది జనాభా ఉండగా 430కి పైగా ఇండ్లున్నాయి. మిషన్‌ భగీరథ ద్వారా 417 ఇండ్లకు నల్లాలు బిగించి శుద్ధజలాలను అందిస్తున్నారు.

బెగులూరులో కనపడని వ్యాధుల జాడ

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలం అంబట్‌పల్లి పీహెచ్‌సీ పరిధిలోని బెగులూరులో ఏటా తీవ్రంగా సీజనల్‌ వ్యాధులు ప్రబలేవి. 2016 ఆగస్టులో ఊహించని విధంగా ఇక్కడ రోగాలు వ్యాపించాయి. గ్రామంలో 2100 జనాభా ఉండగా 36 డెంగీ కేసులు నమోదయ్యాయి. జిల్లాల ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్‌ వైద్య ఆరోగ్యశాఖలో సంస్కరణలు తెచ్చారు. ఇందులో భాగంగా 2017లో 30రోజులు గ్రా మంలో క్యాంపు ఏర్పాటు చేసి వైద్య సేవలందించారు. ఇక్కడ కుమ్మరులు అధికంగా ఉండడంతో ప్రతి ఇంట్లో 20కి పైగా కుండల్లో నీటి నిల్వ ఉండి రోగాలు ప్రబలాయి. 2017లో కేసులను జీరో స్థాయికి తెచ్చారు. 2018 లో రెండు, 2019లో ఒకటి, 2020లో జీరో కేసులు నమోదయ్యాయి.

అమీనాపురంలో గతేడాది ఫుల్‌.. ఇప్పుడు నిల్‌..

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం అమీనాపురంలో గతేడాది ఆగస్టులో విష జ్వరాలు ప్రబలి పదుల సంఖ్యలో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. డెంగీ, మలేరియా వంటి వాటికి చికిత్స కోసం వేలకువేలు ఖర్చు చేశారు. పల్లె ప్రగతితో ఊరి పరిసరాలు పరిశుభ్రం కావడం, మిషన్‌ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరందుతుండడంతో ఈ ఏడాది ఏ ఒక్క వ్యక్తి కూడా సీజనల్‌ వ్యాధుల బారిన పడలేదు.  

కట్య్రాల ప్రశాంతం 

వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం కట్య్రాల గ్రామంలో 3,251 మంది జనాభా ఉన్నారు. గతంలో ఏటా 150 నుంచి 220 మంది దాకా సీజనల్‌ వ్యాధుల బారిన పడేవారు. రెండేళ్ల నుంచి ప్రభుత్వం చేపడుతున్న పారిశుధ్య కార్యక్రమాలు, వైద్యారోగ్యశాఖ అవగాహన సదస్సులతో గ్రామంలో రోగాలు క్రమంగా మటుమాయమవుతున్నాయి. ఈ ఏడాదిలో ఇంత వరకు గ్రామంలో కేవలం ఎనిమిది మందికే సాధారణ జ్వరం వచ్చినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. గ్రామస్తులకు నిత్యం ఆరోగ్య కార్యకర్తలు బీపీ, షుగర్‌ పరీక్షలు చేస్తూ ఉచితంగా మందులు అందిస్తున్నారు.  ఓపీ తగ్గింది

గతంతో పోలిస్తే ఈ ఏడాది సీజనల్‌ వ్యాధులు చాలా తగ్గినయ్‌. ఇప్పటివరకు మహబూబాబాద్‌ జిల్లాలో కేవలం తొమ్మిది  మలేరియా, ఐదు డెంగీ కేసులు నమోదైనై. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపడడం, రక్షిత మంచినీరు అందడం వల్లే రోగాలు ప్రబలడం లేదు. ఒక్క కరోనాపై తప్ప ప్రభుత్వ దవాఖానల్లో ఇతర వ్యాధుల ఓపీ చాలా తగ్గింది.

- డాక్టర్‌ రాజేశ్‌, జిల్లా మలేరియా అధికారి, మహబూబాబాద్‌ (బయ్యారం)

గతంల రంగుమారిన నీళ్లు వచ్చేవి 

మా ఊర్లె ఓవర్‌హెడ్‌ ట్యాంకు ఉండే ది. నాకు తెలిసినప్పటి నుంచి వానకాలం వచ్చిందంటే రంగుమారిన నీళ్లు నల్లా ద్వారా సరఫరా అయ్యేవి. అవి తాగాలంటే చాలా ఇబ్బంది పడేటోళ్లం. రోగాలు వచ్చేవి. ఇప్పుడు మిషన్‌ భగీరథ కింద చెరువు కట్ట దగ్గర ట్యాంకు కట్టిన్రు. రెండు ట్యాంకుల నుంచి శుద్ధ నీటిని సరఫరా చేస్తున్నరు. తాగుటానికి మంచిగున్నయ్‌. వానచ్చినా, వరదచ్చినా స్వచ్ఛమైన మంచినీళ్లే వస్తున్నయ్‌.

- చిలువేరు రమేశ్‌, గ్రామస్తుడు, వెంకటాపురం, పరకాల