శనివారం 28 నవంబర్ 2020
Warangal-rural - Aug 27, 2020 , 04:58:48

భగీరథ జలం.. అమృత ఫలం

భగీరథ జలం.. అమృత ఫలం

  • ఇంటింటికీ శుద్ధనీటి సరఫరా
  • కలుషిత నీటికి స్వస్తి 
  • ‘మిషన్‌' నీళ్లతో రోగాలు నిల్‌
  • ముఖ్యంగా డయేరియాకు చెక్‌

ఏటా వానకాలం వచ్చిందంటే పల్లె, పట్టణం తేడాలేకుండా ప్రజలు వణికిపోయేవారు. సీజనల్‌ వ్యాధులైన మలేరియా, డెంగీ, చికున్‌గున్యా, వైరల్‌ ఫీవర్‌, టైఫాయిడ్‌తో ఇంటికొకరిద్దరు మంచాన పడేవారు. గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా వైద్యరంగం పటిష్టంగా లేకపోవడం, గ్రామాలు మురికికూపాల్లా మారడంతో విపరీతమైన దోమల నడుమ, అపరిశుభ్ర వాతావరణంలోనే మగ్గుతూ రోగాల పాలయ్యేవారు. పిల్లల నుంచి పెద్దల దాకా స్లైన్‌ బాటిళ్లు ఎక్కించుకుంటూ కనిపించేవారు. వైద్యం కోసం హాస్పిటళ్ల చుట్టూ తిరిగేవారు. చికిత్స, మందుల పేరిట వేలాది రూపాయలు తగలేసినా పరిస్థితి విషమించి వందల సంఖ్యలో మృత్యువాత పడేవారు. ఈ దుస్థితిని గమనించి ఉద్యమ నేత కేసీఆర్‌, స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాక వైద్య రంగంలో సమూల మార్పులు తేవడంతో పాటు గ్రామాలను పరిశుభ్రంగా మార్చేందుకు ప్రతిష్టాత్మకంగా ‘పల్లె ప్రగతి’ని చేపట్టి విజయవంతంగా అమలు చేశారు. ఫలితంగా పల్లె, పట్టణం తేడా లేకుండా ప్రజలు సీజనల్‌ వ్యాధుల నుంచి విముక్తులవుతున్నారు.      - నమస్తే తెలంగాణ, నెట్‌వర్క్‌

నర్సంపేట/బచ్చన్నపేట/నెక్కొండ/సుబేదారి/మరిపెడ : వానకాలం వచ్చిందంటే నీటి కాలుష్యానిదే రాజ్యం.. కలుషిత నీటిని తాగిన ఎంతో మంది అతిసార బారిన పడేవారు. వాంతులు, విరేచనాలు, తీవ్ర జ్వరంతో  తల్లడిల్లిపోయేవారు. డయేరియా ప్రబలి దవాఖానల పాలయ్యేవారు. అతిసార ప్రబలిన గ్రామాల్లో వారం పది రోజుల పాటు వైద్య శిబిరాలు ఏర్పాటయ్యేవి. కొన్ని సందర్భాల్లో మరణాలు సైతం సంభవించి ఊర్లకు ఊర్లే భయంకర వాతావరణాన్ని తలపించేవి. కానీ, ఇప్పుడా పరిస్థితి గ్రామాల్లో కనిపించడం లేదు. కలుషిత నీరు తాగి ప్రజలు రోగాల బారిన పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు ఎదురైనా ‘మిషన్‌ భగీరథ’ ద్వారా శుద్ధనీటిని ఊరూరా సరఫరా చేస్తున్నది. కృష్ణా, గోదావరి జలాలతో పల్లె జనుల గొంతు తడుపుతున్నది. ప్రత్యేక శ్రద్ధతో ‘మిషన్‌ భగీరథ’ వాటర్‌ను సరఫరా చేస్తుండడంతో కలుషిత నీటికి ఫుల్‌స్టాఫ్‌ పడినట్లంది. ఎంతో కాలం గా గ్రామ చెరువు, బావులు, బోర్ల ద్వారా నీటినందించే పాత పద్ధతికి స్వస్తి పలికినట్లయింది. లీకేజీలు లేకపోవడంతో స్వచ్ఛమైన జలాలు నల్లాల ద్వారా ప్రజలకు అందుతున్నాయి. వీటిని తాగుతున్న జనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటున్నారు. 

తప్పిన మురుగు నీటి కష్టాలు

ఒకప్పుడు చెరువులు, బోరుబావుల ద్వారా నీరు సరఫరా అయ్యేది. పలుచోట్ల పైపులైన్లు పగిలి వానాకాలంలో కలుషిత నీరు వచ్చేది. ఆ నీరు తాగి ప్రజలు రోగాల బారిన పడేవారు. వాంతులు, విరేచనాలు, తీవ్ర జ్వరంతో బాధపడేవారు.  ఇక అటవీ గ్రామాల ప్రజలు వాగులు, వంకలు, చెలిమెల్లో కలుషిత నీటిని తాగి వ్యాధులతో సతమతమయ్యేవారు.  చర్మంపై దద్దుర్లు, డయేరియా, గొంతు జబ్బులతో ఇబ్బందులు పడేవారు. మిషన్‌ భగీరథ పుణ్యమా అని ఇప్పుడు  ఇప్పుడు ఏ గ్రామంలోనూ అలాంటి పరిస్థితులు లేవు. స్వచ్ఛమైన తాగునీరు అందుతుండడంతో సీజనల్‌ వ్యాధులకు అడ్డుకట్ట పడింది. సురక్షితమైన తాగు నీటిని సరఫరా చేస్తే ప్రజలకు సగం రోగాలు దూరమవుతాయని తలచిన సీఎం కేసీఆర్‌ స్వప్నం ‘మిషన్‌ భగీరథ’తో నెరవేరింది. పట్టణాలు, పల్లెల్లో మాయదారి కరోనా తప్ప ఇంకో రోగం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.       

మిషన్‌ భగీరథ నీరే మేలు

మిషన్‌ భగీరథ నీటిలో మనకు కావాల్సిన అన్ని రకాల లవణాలు, ప్రొటీన్లు ఉంటాయి. ఈ నీటిని తాగిన ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని శాస్త్రవేత్తలు సైతం చెబుతున్నారు. బయట దొరికే మినరల్‌ వాటర్‌ కన్నా మిషన్‌ భగీరథ నీరే ఆరోగ్యానికి ఎంతో మంచిదని స్పష్టం చేస్తున్నారు.       

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో..

మిషన్‌ భగీరథ పథకం ద్వారా వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని 790 హాబిటేషన్లలో 6,34,976మంది జనాభాకు సరిపడా తాగునీటిని అందిస్తున్నారు.  547 పాత ట్యాంకుల వినియోగంతో పాటు, 520 కొత్త ట్యాంకులను నిర్మించారు. 1728.23 కిలో మీటర్ల మేర పైప్‌లైన్‌ వేశారు. 

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో..

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని గ్రామీణ మండలాల్లో 75,356 ఇళ్లకు మూడు సెగ్మెంట్ల నుంచి, వరంగల్‌ మహానగరంలో సుమారు లక్షా 20వేల నాల్లా కనెక్షన్లకు ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ గ్రిడ్‌ నుంచి నీరు సరఫరా చేస్తున్నారు. 

జనగామ జిల్లాలో..

జనగామ జిల్లా వ్యాప్తంగా 12 మండలాల్లోని అన్ని ఇండ్లకూ మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు. జిల్లాలో 1, 24,815 ఇండ్లు ఉండగా అన్నింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చినట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు తెలిపారు. జిల్లాలో 601 ఆవాసాలు ఉండగా కొత్తగా 1,018,00 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేశారు. 89,323 నల్లాలను కొత్తగా ఏర్పాటు చేశారు. 443 ట్యాంకులు నిర్మించారు. 

మహబూబాబాద్‌ జిల్లాలో..

రూ.1700కోట్లతో చేపట్టిన పాలేరు వాటర్‌గ్రిడ్‌ (మిషన్‌ భగీరథ) పథకం ద్వారా మహబూబాబాద్‌ జిల్లాలోని 14మండలాలకు,  వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని ఏడు మండలాలకు, ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం, ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం కలిపి మొత్తం 1708 అవాసా ప్రాంతాల్లో 10,09,895 మందికి నిత్యం కృష్ణానది జలాలను శుద్ధి చేసి రోజూ 170ఎంఎల్‌డీ నీటిని సరఫరా చేస్తున్నారు. కృష్ణానది జలాలను మరిపెడ మండలం అబ్బాయిపాలెం ఎదెళ్లగుట్ట దగ్గర నిర్మించిన వాటర్‌ట్రీట్‌ మెంట్‌ ప్లాంట్‌ (డబ్ల్యూటీపీ)లో ఫిల్టర్‌ చేసి వివిధ పరీక్షలు చేసిన తర్వాత ప్రజలకు చేరవేస్తున్నారు.